కథానాయకుడు వెంకటేష్ ఓ కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభించబోతున్నట్టు ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఒక ఇంటర్య్వూలో స్వయంగా వెంకటేష్ కూడా ఆ విషయాన్ని ప్రకటించాడు. ఆ సంస్థని ప్రకటించే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. వెంకీ కొత్త చిత్రం త్వరలోనే మొదలుకాబోతోంది. ఆ చిత్రంతోనే తన బ్యానర్‌ని పరిచయం చేస్తాడనీ, ఆ సినిమాకి వెంకీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. వెంకటేష్ కుటుంబానికి సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ ప్రై లిమిటెడ్‌లాంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అయితే అవన్నీ రామానాయుడు, సురేష్ బాబు పేరుమీదే నడిచాయి. అందుకే తన పేరుతోనే ఓ సంస్థని ఏర్పాటు చేసి అందులో వరుసగా చిత్రాలు నిర్మించాలని వెంకీ ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. తనతో పాటు బయటి కథానాయకులతోనూ ఆ సంస్థ నుంచి సినిమాలు తీయాలనే ఆలోచనలో వెంకీ ఉన్నారట. ఇటీవల మహేష్‌బాబు కూడా తన నిర్మాణ సంస్థని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ కథానాయకుడు కూడా తనకో సొంత బ్యానర్ ఉండాలనే ఆలోచనలో కనిపిస్తున్నాడు.