సూపర్‌స్టార్ కృష్ణ నట కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుధీర్‌బాబు. కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా వెండితెర రంగ ప్రవేశం చేసిన ఈ హీరోకి ‘ప్రేమకథా చిత్రమ్’ రూపంలో మంచి విజయమే లభించింది. అయితే ఈ చిత్ర క్రెడిట్ మొత్తం ఆ చిత్రంలో నటించిన హాస్య కథానాయకుడు సప్తగిరి, దర్శకుడు మారుతికి దక్కింది. ఇక సుధీర్ ఆ తర్వాత నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’తో పాటు ఇటీవల విడుదలైన ‘మోసగాళ్లకు మోసగాడు’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. కాగా తాజా సమాచారం ప్రకారం సుధీర్‌బాబును ఓ క్రేజీ బాలీవుడ్ ఆఫర్ వరించిందని తెలిసింది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సుధీర్‌బాబు నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ కూడా త్వరలోనే విడుదల కానుంది.