నందమూరి బాలకృష్ణ, అంజలి జంటగా వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వంలో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'డిక్టేటర్'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ ను ఇవ్వగా, బి.గోపాల్ స్విచ్ ఆన్ చేసారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా
హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "మొదటిసారి శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. లయన్ సినిమా షూటింగ్ సమయంలో 'డిక్టేటర్' అనే టైటిల్ చెప్పారు. టైటిల్ కు తగ్గట్లుగానే కథను సిద్ధం చేయమని చెప్పాను. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం సంతోషంగా ఉంది. అంజలికి పాత్రకు ఇంపార్టన్స్ ఉంటుంది. ఈ 'డిక్టేటర్' ప్రాణం పోసే ఆయుధం కాబోతుంది. ప్రజలకు రీచ్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం" అని చెప్పారు.
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ "నేను దర్శకునిగా మారిన తరువాత బాలకృష్ణ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. లక్ష్యం సినిమా తరువాత ఆయనతో సినిమా చేయాలనుకున్నాం. కాని కొన్ని కారణాల వలన చేయడం కుదరలేదు. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. కోన-గోపి మోహన్ ఓ మంచి స్టొరీ చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ బాగా జరిగింది. ఈ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. సినిమాకి మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలుగులో మొదటిసారి ఈ చిత్రం ద్వారా ప్రొడక్షన్ మొదలుపెట్టారు. హీరోయిన్ అంజలి పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూడగలిగే సినిమా ఇది" అని అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ "బాలయ్య సినిమాకు కథను అందించడం సంతోషంగా ఉంది. శ్రీవాస్ తీసిన 'లక్ష్యం' ,'లౌక్యం' సినిమాల కలయికే ఈ సినిమా. బాలయ్య సినిమాలను నెమరు వేసుకుంటూ ఈ సినిమా కథను తయారు చేసాం. ఎరోస్ సంస్థ వారు మొదటిసారి తెలుగు నిర్మాణంలో భాధ్యతలు చేపట్టారు. బాలయ్య గారిని డిగ్నిఫైడ్ క్యారెక్టర్, డిగ్నిఫైడ్ హ్యూమర్ ఉన్న పాత్రలో చూడబోతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అంజలి కి మంచి ఆదరణ ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు, ఫాన్స్ కు తప్పకుండా నచ్చుతుంది" అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ "మొదటిసారి బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మునుపెన్నడూ నటించని విధంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. మంచి సినిమా" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీధర్ సీపాన, సత్య ప్రకాష్, ఎం. రత్నం, చింతు అయోపాధ్యాయ, బ్రహ్మ కడలి, శ్యాం కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: గౌతంరాజు, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, ప్రొడ్యూసర్: ఎరోస్ ఇంటర్నేషనల్, కో-ప్రొడ్యూసర్: వేదాస్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్.