`హార్ట్ ఎటాక్` భామ ఆదాశర్మ గురించి నిన్న ఓ రూమర్ వచ్చింది. ఒక సినిమా చిత్రీకరణలో ఉండగా ఆదాకి బస్ యాక్సిడెంట్ అయ్యిందనీ, ఆమె ప్రాణాలతో లేదనీ ప్రచారం సృష్టించారు. కొన్ని మీడియా సంస్థలకి మెయిళ్లు కూడా వచ్చాయి. దీంతో అంతా కంగారుపడ్డారు. ఆదాకి ఏమైందో అని ఆరా తీశారు. ఆ తర్వాత తెలిసింది అదంతా ఉత్తిదే అని. ఆదాశర్మ కూడా ఆ రూమర్ గురించి ట్వీట్ చేసింది. ``నేను బతికే ఉన్నా. నాకు ప్రమాదం జరిగిన మాట అవాస్తవం. హైదరాబాద్ వేడిగా ఉంది కాబట్టి... నాక్కాస్త జ్వరం వచ్చినట్టుంది. అంతకుమించి మరేమీ అవ్వలేదు`` అని ట్వీట్ చేసింది ఆదా. ప్రస్తుతం ఆమె `గరం`, `సేల్ ఫర్ సుబ్రమణ్యం`, `క్షణం` తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బంగారంలాంటి అమ్మాయిని ఊరికే చంపేసి, ఆ కబురును స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయినా తారల గురించి ఫేక్ న్యూస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ... ఇలా చచ్చిపోయారన్న వార్త రావడం మాత్రం ఇదే తొలిసారి. నితిన్‌తో కలిసి `హార్ట్ ఎటాక్`లో నటించిన ఆదా ఇటీవల అల్లు అర్జున్ చిత్రం `సన్నాఫ్ సత్యమూర్తి`లోనూ కనిపించింది. ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్న ఆదా స్టార్ల సినిమాల్లో అవకాశాల కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది.