దేశపతిశ్రీనివాస్, మిథున్‌రెడ్డి, చైతన్య, జోషి.దేవా, మధు, శహెరా బాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ మురారి(బాబీ) దర్శకుడు. బి.బి.ఎన్. స్టూడియో మోషన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుజ్జ యుగంధర్‌రావు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ఈ చిత్ర నిర్మాత గుజ్జ యుగంధర్‌రావు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో తెలంగాణవారితో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా వుంది. ఈ సినిమాలో బందూక్ చరిత్రను ఆవిష్కరిస్తున్నాం. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. టాలెంట్ వుండి అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభావంతులైన నటీనటుల్ని ఎంపికచేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిపోతుందనే నమ్మకముంది. తెలంగాణ చరిత్రను వర్ణిస్తూ గోరటి వెంకన్న రాసిన బ్రీత్ లెస్ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ పాట తెలియని తెలంగాణ వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. అంత బాగా ఈ పాట పాపులర్ అయింది. భావితరాలకు తెలంగాణ చరిత్రను...పోరాటాన్ని తెలియజెప్పాలన్న సంకల్పంతో తీసిన సినిమా ఇది. చిత్రాన్ని జూన్‌లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తొమ్మిదవ శతాబ్ధంలో చైనాలో పుట్టిన తుపాకి జీవనగమనం 2014 వరకూ ఎలా సాగింది? సమాజంలో దాని స్థానమేమిటి?అనేది ఈ చిత్ర ఇతివృత్తం. నేను ఉన్నప్పుడు ప్రపంచం ఎలా వుంది? నేను లేనప్పుడు ఎలా వుందని ఓ బందూక్ ఆత్మ విమర్శ చేసుకునే కొత్త కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బందూక్ లేకుండా చరిత్రలో రెండు గొప్ప విజయాలు సిద్ధించాయి. భారత దేశానికి గాంధీజీ నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్య్రం సిద్ధంచడం ఒకటైతే.... ఒక్క నెత్తురు చుక్క చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మరొకటి. దీన్నే ఇందులో చూపిస్తున్నాం. ఈ సినిమాలో కుళ్లు జోకులు, వెకిలి వేశాలు వేస్తూ సెటైర్లు వుండవు, క్లీన్‌గా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ప్రదీప్ మాటలు, రాహుల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శుకర్రవారం చివరి పాటతో చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో మిథున్‌రెడ్డి, చైతన్య, జోషి.దేవా, మధు, శహెరా బాను, కో-డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.