తమిళ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న అజిత్ తెలుగులోనూ కొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వాలి, ప్రేమలేఖ, గ్యాంబ్లర్, డేవిడ్ బిల్లా, ఆట ఆరంభం వంటి పలు సినిమాలు అజిత్‌ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. తమిళ్‌లో స్టార్‌గా పెద్ద ఇమేజ్ సాధించినప్పటికీ అక్కడతో పోలిస్తే తెలుగులో అతనికి వున్న ఇమేజ్ తక్కువనే చెప్పాలి. విక్రమ్, సూర్య, కార్తీ, విశాల్ వంటి హీరోలకు తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ వుంది. ఇక్కడ కూడా అజిత్ మంచి మార్కెట్ కోసం ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో చేసిన ‘ఎన్నయ్ అరిందాల్’ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడు గానీ..’ పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. హేరిస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవల తెలుగులో విడుదలైంది. ఎ.ఎం.రత్నం నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 22న విడుదల చేస్తున్నారు. తమిళ్ పెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధించి ఇక్కడ కూడా తన ఫాలోయింగ్, మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు అజిత్.