సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాక్షసుడు'. ఈ సినిమాను మేధా క్రియేషన్స్ పతాకంపై కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ "ఈ సినిమా టైటిల్ అందరికి సుపరిచితమే. సినిమా చూసాక అందరికి తెలుస్తుంది టైటిల్ ఎందుకు పెట్టారో.. ఈ సినిమాలో హారర్, కామెడీ, హ్యుమర్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పర్టిక్యులర్ జోనర్ ఇదే అని చెప్పలేం. సినిమా ప్రేక్షకులకు మాస్ ట్రీట్ అవుతుంది. సినిమా మొత్తం హ్యుమరస్ గా వెళ్తుంది. 2005 లో 'మన్మథ' సినిమాతో నా కెరీర్ మొదలు పెట్టాను. 'రాక్షసుడు' నా 200 సినిమాలు పూర్తి చేసాను. అన్ని వర్గాల వారికి రీచ్ అయ్యే మూవీ ఇది" అని చెప్పారు.
సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ మాట్లాడుతూ "ఇదొక మంచి కథ. వెంకట్ ప్రభు, సూర్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తుంది" అని చెప్పారు.
వెంకట్ ప్రభు మాట్లాడుతూ "రవితేజ, సూర్య, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. కాని ఇప్పటివరకు కుదరలేదు. ఇదొక కొత్త మూవీ. సినిమా చూసాక ఫ్రెష్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. కోదండరామిరెడ్డి లాంటి గొప్ప వ్యక్తి సినిమా టైటిల్ ను మా సినిమాకు పెట్టుకోవడం ఆనందంగా ఉంది. నయనతార, ప్రణీత లు ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు" అని చెప్పారు.
సూర్య మాట్లాడుతూ "సింగం, బ్రదర్స్ సినిమాల తరువాత ఈ బ్యానర్ లో చేస్తున్న మూడవ సినిమా ఇది. వెంకట్ ప్రభు గారు లేకపోతే ఈ సినిమా చేయలేం. ముందు ఓ లవ్ స్టొరీ చేయాలనుకున్నాం. దానికి కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ కలగలిపి చిత్రీకరించారు. ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమా ఉంటుంది. యువన్ అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పటివరకు నటుడిగా పని చేస్తున్న నేను ప్రొడ్యూసర్ గా నా సొంత బ్యానర్ లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. 'హౌ ఓల్డ్ ఆర్ యు' అనే చిత్రాన్ని '36 వయదినిలే' పేరుతో తమిల్ లో రీమేక్ చేస్తున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నాం. తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.
జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ "ఈ సినిమాలో మంచి ఫైట్ సన్నివేశాలు ఉంటాయి. సినిమా మొదటి కాపీ చూసాక చాలా సంతోషంగా అనిపించింది. వెంకట్ ప్రభుగారితో మా బ్యానర్ లో చేస్తున్న రెండో చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఈ నెల 29 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.