‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్ చిత్రాల తర్వాత కమల్ హాసన్ చేసిన మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్’. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 2 న విడుదలయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాన్ మాట్లాడుతూ "మే1 న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వలన శనివారం ఫస్ట్ షో నుండి థియేటర్లలో ప్రదర్శింపజేయడం జరిగింది. మూడు రోజులు ఈ చిత్రం కోసం పోరాడితే నిన్న షో వేయగలిగాం. దీనికి సహకరించిన తమిల్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి నా ధన్యవాదాలు. భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రాన్నికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఏ హీరో చేయని క్యారెక్టర్ లో కమల్ హాసన్ నటించి ప్రేక్షకులను మెప్పించారు" అని అన్నారు.
బి.ఏ.రాజు మాట్లాడుతూ "కమల్ గారి నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
కుమార్ బాబు మాట్లాడుతూ "ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రానికి మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఊర్వశి గారి పాత్ర సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. సాగరసంగమం సినిమా తరువాత కమల్ హాసన్ అధ్బుతంగా డాన్స్ చేసిన సినిమా ఇది" అని అన్నారు.