`శ్రీమంతుడు` తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడో ఇంకా ఎవరికీ తెలియదు. కొద్దిమందేమో శ్రీకాంత్ అడ్డాలతో `బ్రహ్మోత్సవం` అంటున్నారు. మరికొద్దిమందేమో త్రివిక్రమ్‌తోనే సినిమా ఉంటుందంటున్నారు. అయితే ఆ విషయంపై ఇటు మహేష్‌కానీ, అటు దర్శకులు కానీ నోరు విప్పడం లేదు. కానీ ఆయా సినిమాలపై రూమర్లు మాత్రం తెగ పుట్టుకొస్తున్నాయి. ఆమధ్య మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో సమంత కథానాయికగా ఎంపికైందనీ, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందని వార్తలొచ్చాయి. ఇప్పుడేమో `బ్రహ్మోత్సవం` గురించి కొత్త కబుర్లు వినిపిస్తున్నాయి. సినిమా ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందనీ, కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న చిత్రానికి కొబ్బరికాయ కొడుతున్నారని చెప్పుకొంటున్నారంతా. ఆ సినిమా కూడా విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోందని మాట్లాడుకొంటున్నారు. ఇటీవల మళ్లీ కథ విన్న మహేష్... శ్రీకాంత్ అడ్దాలకి ఓకే చెప్పేశాడనీ , సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతలకు సూచించాడని వార్తలొస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవముందన్నది తెలియాల్సి ఉంది. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటించబోతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది.