జక్కన్న తీస్తున్న `బాహుబలి` ఇప్పుడు మరింత బలవంతుడయ్యాడు. ఆ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి, కరణ్ జోహార్ ప్రకటించారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలైతే తొలి నుంచీ ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇటీవల పలువురు హిందీ ప్రముఖులు హైదరాబాద్ వచ్చి రాజమౌళి తీస్తున్న `బాహుబలి` గురించి ఆరా తీశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని కూడా చూశారు. అందులో కరణ్ జోహార్ కూడా ఉన్నారు. ఆయన సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోయారట. ఎలాగైనా ఈ సినిమా హిందీ హక్కుల్ని తాను సొంతం చేసుకోవల్సిందే అని నిర్ణయించుకొన్నారు. ఆ మేరకు చిత్రబృందంతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. కార్మిక ప్రేమికుడు రాజమౌళి తీసిన `బాహుబలి` సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం గర్వంగా ఉందని కరణ్ ట్వీట్ చేశాడు. కరణ్‌జోహార్ సినిమాలో భాగం కావడంతో ప్రాజెక్టు స్థాయి మరింత పెరిగిందని రాజమౌళి ప్రకటించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన `బాహుబలి` రెండు భాగాలుగా తెరకెక్కింది. తొలి భాగం సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకొస్తోంది.