సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు హీరోగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోస్ నెల్లూరి దర్శకత్వంలో చక్రి చిగురుపాటి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇదే బేనర్‌లో వచ్చిన ‘స్వామిరారా’ చిత్రం సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మోసగాళ్ళకు మోసగాడు’ పేరుతో మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు చక్రి చిగురుపాటి. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన సూపర్‌స్టార్ కృష్ణ, డా॥ దాసరి నారాయణరావు, శ్రీమతి విజయనిర్మల బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను అల్లరి నరేష్, నవీన్ చంద్ర ఆవిష్కరించి తొలి సీడీని చిత్ర సమర్పకులు శంకర్ చిగురుపాటికి అందించారు. మణికాంత్ కద్రి సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, హీరో సుధీర్ బాబు, హీరో శ్రీకాంత్, సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి, అనిల్ రావిపూడి, సుశాంత్, కళామందిర్ కళ్యాణ్, దర్శకుడు బోస్ నెల్లూరి, నిర్మాత చక్రి చిగురుపాటి తదితరులు పాల్గొన్నారు.
డా॥ దాసరి నారాయణరావు: మోసగాళ్ళకు మోసగాడు కృష్ణ హీరోగా పద్మాలయా బేనర్‌లో నిర్మించిన చిత్రం. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ పేరుతో కృష్ణగారి అల్లుడు సుధీర్‌బాబు హీరోగా ఈ సినిమాని నిర్మించడం అనేది పెద్ద సాహసం. ఆ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది కౌబాయ్ సినిమాయే అనుకున్నాను. అయితే ఇది డిఫరెంట్ స్టోరీ మావయ్యగారి సినిమా టైటిల్ పెట్టుకున్నామని సుధీర్ చెప్పాడు. గతంలో ఈ సంస్థ చాలా నిజాయితీగా, తక్కువ బడ్జెట్‌లో అందరితోనూ శెభాష్ అనిపించుకున్న చిత్రాలు తీసింది. మామూలు రోజుల్లో ఆ మూడు సినిమాలు వందరోజులు ఆడాలి. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఆ సినిమాలు 50 రోజులు ఆడాయంటే ఆ నిర్మాతని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సుధీర్‌బాబు ఒక్కో సినిమాతో ఎదుగుతున్నాడు. ఈ సినిమాతో మరింత ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఫంక్షన్‌కి రావడానికి ముఖ్యకారణం కృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవడం. నాటి తేనెమనసులు నుంచి నేటి వరకు ఒక నటుడు నటిస్తూనే 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో వుండడం అనేది జరగదు. అది మా కృష్ణగారికి జరిగింది. అలాగే మా చెల్లాయ్ విజయనిర్మల బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే నేను రచయితగా కెరీర్ స్టార్‌చేసి 50 సంవత్సరాలు పూర్తయింది.
విజయనిర్మల: కృష్ణగారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గురించి అన్నయ్య నారాయణరావుగారు చాలా బాగా చెప్పారు. నేను, కృష్ణగారు నటించిన మోసగాళ్ళకు మోసగాడు చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సుధీర్‌బాబు అదే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. మా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అయి హీరోకి, హీరోయిన్‌కి, నిర్మాతకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
సూపర్‌స్టార్ కృష్ణ: నారాయణరావుగారు విపులంగా నా కెరీర్ గురించి చెప్పారు. దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మోసగాళ్ళకు మోసగాడు వెరీ గుడ్ టైటిల్. సుధీర్‌బాబు గెటప్ స్టిల్స్‌లో చూశాను. ఆ టైటిల్‌తో సుధీర్‌బాబు డెఫినెట్‌గా హిట్ కొడతాడని ఆశిస్తున్నాను. ఈరోజు విడుదలవుతున్న ఆడియో, త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను.
సుధీర్‌బాబు: ఇక్కడ మహేష్‌బాబు ఫ్యాన్స్ చాలా మంది వున్నారు. ఈ ఫంక్షన్‌కి మహేష్‌బాబు రావడం లేదా అని కొంతమంది అడిగారు. మహేష్ బిజీగా వుండడం వల్ల ఈ ఫంక్షన్‌కి రాలేకపోయాడు. అయితే ఎంతోమంది మహేష్‌లు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ ఫంక్షన్‌కి వచ్చారని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ప్రేమకథా చిత్రమ్ సినిమాకి అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. అందుకే ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమాకి కూడా అన్నీ కుదిరాయి. మణికాంత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
బోస్ నెల్లూరి: చక్రిగారు ఒక మంచి హార్రర్ కామెడీ సినిమా చేద్దామన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చెయ్యడం కుదరలేదు. అందుకే క్రైమ్ కామెడీతో సాగే ఈ సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాం. నిర్మాత చక్రిగారు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మించారు. సుధీర్‌బాబు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక మంచి సినిమా చెయ్యడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్తున్నాను.
సుధీర్‌బాబు, నందిని, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్, సప్తగిరి, పంకజ్‌కేసరి, ప్రవీణ్, ఫిష్ వెంకట్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, జ్యోతి, సారిక రామచంద్రరావు, షకలక శంకర్, విజయ్, రెజా, సెంథిల్, ప్రదీప్, నరసింహ, రవిరాజా, బాబీ లహరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ కద్రి, సినిమాటోగ్రఫీ: ఉమ్మడిసింగు సాయిప్రకాష్, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మెత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: వెంకట్, కింగ్ సాల్మన్ దేవరాజ్, పాటలు: శ్రీమణి, కృష్ణకాంత్, డాన్స్: శేఖర్, రఘు, ఆర్ట్: ఎస్.నాగేంద్రబాబు, సమర్పణ: శంకర్ చిగురుపాటి, సహనిర్మాత: చైత్రేష్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోస్ నెల్లూరి.