బాండ్ సినిమా ఏంటి ఖర్మ? దాని బాబులాంటి సినిమాలోనైనా నటించేస్తా అంటాడు అల్లరి నరేష్. కాకపోతే ఫైట్లు గట్రా కాకుండా సినిమా నిండా కితకితలే ఉండాలని ఓ రూల్ పెడతాడంతే. మరి అలా కావాలంటే `నువ్వు బాండ్ కాకూడదు.. నీ భార్య బాండ్ కావాల`ని ఆ దర్శకుడు కూడా రూల్ పెట్టేసినట్టున్నాడు. అందుకే `జేమ్స్ బాండ్` ... నేను కాదు నా పెళ్లాం అంటూ ఓ చిత్రంలో నటించాడు అల్లరి నరేష్. `బందిపోటు` తర్వాత ఆయన గుట్టుగా చేసిన చిత్రమిది. ఓ గడసరి పెళ్లాంతో నోరు మెత్తటి కుర్రాడు ఎలా వేగాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు సమాచారం. శ్రీనువైట్ల దగ్గర శిష్యరికం చేసిన ఓ కుర్రాడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా గురించి ఇంకా పూర్తిగా విశేషాలేమీ బయటికి రాలేదు. అందులో పోస్టర్‌ని మాత్రం అల్లరి నరేష్ బయటపెట్టాడు. ఆయన సరసన సాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈమె మంచు మనోజ్‌తో కలిసి ఇదివరకు `పోటుగాడు`లో నటించింది. చిత్రీకరణ మొత్తం పూర్తయింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు రేపోమాపో వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.