యువ కథానాయకుడు నానికి తమిళంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య అక్కడ `వెప్పమ్` అనే ఓ చిత్రాన్ని చేశాడు. అది `సెగ` పేరుతో తెలుగులోనూ విడుదలైంది. ఆ చిత్రానికి అంజనా అలీఖాన్ అనే అమ్మాయి దర్శకత్వం వహించింది. నానికి మంచి స్నేహితురాలైన అంజనా ఇప్పుడు తమిళంలో `పల్ ఆందు వాజ్‌గా` పేరుతో మరో చిత్రం చేస్తోంది. అందులో నాని ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు నాని. ``నా డార్లింగ్ డైరెక్టర్ అయిన అంజని చిత్రంలో మరో క్యూట్ కామియో చేస్తున్నా`` అని చెప్పుకొచ్చాడు నాని. ఆయన నటించిన `ఈగ` తమిళంలో `నాన్ ఈ` పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. అలా తమిళంలో నానికి మంచి మార్కెట్ ఉంది. అక్కడ మార్కెట్‌ని విస్తరించేందుకు నాని పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నట్టు తెలుస్తోంది.