మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రాజేంద్రప్రసాద్ త్వరలో తొలి ఇ.సి మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో పెన్షన్లు, పేద కళాకారులకు ఏవిధంగా మంచి చేయాలి, ‘మా’ను ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంపై చర్చించబోతున్నారని సమాచారం. అయితే ఎన్నికల సమయం నుంచి రాజేంద్రప్రసాద్‌నే టార్గెట్ చేసిన సీనియర్ నరేష్ మరోసారి తనపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాడు. జయసుధ ప్యానల్‌లో గెలిచిన కొందరు కార్యవర్గ సభ్యులతో కలిసి ఇ.సి మీటింగ్‌ను బాయ్‌కాట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడనీ తెలుస్తుంది. అయితే దీనికి కీలక పాత్రధారి నరేష్ అనేది వాస్తవం. తనకు చెప్పకుండా రాజేంద్రప్రసాద్ కేసీఆర్‌ను, ఇటీవల నారా చంద్రబాబునాయుడిని కలిశాడనేది ముఖ్య కారణం.
తమకు ఏదో న్యాయం చేస్తారనీ, ఉద్దరిస్తారనీ నమ్మి ఆర్టిస్ట్‌లు ఓట్లు వేసి గెలిపించారు. నిజంగా మంచి చెయ్యాలని నరేష్‌కి ఉంటే నలుగురితో కలిసి ముందుకెళ్ళాలి. అదేం లేకుండా కార్యవర్గ సమావేశాల్ని ఆపడానికి ప్రయత్నించడం ఎంత వరకు న్యాయమో ఆలోచించాలి నరేష్‌గారు. వేదికలపై మైక్ దొరికితే అలుపు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, అసోసియేషన్‌లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నప్పుడు కుళ్ళు కుతంత్రాలకు దూరంగా ఉంటూ పేద కళాకారులకు మంచి చేసే దిశగా ఆలోచించాలనీ, ఇ.సి మీటింగ్ ఆపితే సమయం వృధా తప్ప ఉపయోగం లేదని, ఎదుటి వ్యక్తిపై కక్ష సాధిస్తే తనకు వచ్చేది ఏమీ లేదని ఫిలింనగర్ జనాలు నరేష్‌కి చెబుతున్నారు.