దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'కుందనపు బొమ్మ'. ఈ చిత్రానికి స్వరవాణి శ్రీ యం.యం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ లాంచ్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యం.యం.కీరవాణి మాట్లాడుతూ "ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథ ఇది. అమ్మాయి ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తుందనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా టైటిల్ చాలా బావుంది" అని చెప్పారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ "బాపు రమణ నాకు ఆత్మీయులు. వారి కుటుంబసభ్యులు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. ఈ సినిమా టైటిల్ చూస్తుంటే బాపు కదిలి వచ్చినట్లుంది" అని తెలిపారు.
ముళ్ళపూడి వరా మాట్లాడుతూ "సంవత్సరంన్నర కాలంగా ఈ సినిమా నిర్మాణం కోసం చాలా కష్టపడుతున్నాం. రాఘవేంద్రరావు గారికి 43 కథలు చెప్పాను అవేవి ఆయనను త్రుప్తి పరచలేదు. 44 వ కథ ఇది. ఈ చిత్రాన్ని ఆయన సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి గారితో పది సంవత్సరాలుగా కలిసి పని చేయాలనుకున్నాను. ఇప్పటికి నా కోరిక నెరవేరింది. ఓ పల్లెటూరి కుటుంబ ప్రేమకథాచిత్రం. ఈ సినిమాని బొబ్బిలి, విజయనగరం, పరిసరప్రాంతాల్లో చిత్రీకరించాం" అని తెలుపగా "పాటల చిత్రీకరణ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరిగిందని, చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని మే నెలలో ఆడియో, రిలీజ్ జరుగుతుందని" చిత్ర నిర్మాతలు జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణలు తెలియజేసారు.
సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ "కుటుంబ కథా చిత్రమిది. ఖచ్చితంగా అందరికీ మంచి పేరు వస్తుంది" అని అన్నారు.
చాందిని చౌదరి మాట్లాడుతూ "ఓ గొప్ప బ్యానర్ తో తెలుగు తెరకు పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతం కశ్యప్, కథావిస్తరణ-స్క్రీన్ ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్లూరి, పాటలు: కీ.శే.శ్రీ ఆరుద్ర గారు, శివ శక్తి దత్తా, అనంత శ్రీరాం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.డి.జాన్.