రెండు మాసాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్ష ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడింది. సహజనటి జయసుధ, నటకిరీటి రాజేంద్రప్రసాద్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలలో జయసుధపై 85 వోట్ల ఆధిక్యంతో రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. అసోసియేషన్ లో మొత్తం 702 ఓటర్లకు గాను గతనెల 29న జరిగిన ఎన్నికల్లో 394 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 237 మంది రాజేంద్రప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేయగా.. 152 మంది జయసుధకు ఓటు వేసారు. మరో అయిదుగురు అధ్యక్ష పదవికి పోటీపడిన బొమ్మరిల్లు ధూళిపాళకు ఓటు వేసారు. మొత్తం 7 రౌండ్లుగా ఓట్లను లెక్కించగా.. ప్రతి రౌండ్ లోనూ రాజేంద్రప్రసాద్ ఆధిక్యాన్ని కనబర్చి మా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి, శివకుమార్ ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. 168 ఓట్ల మెజార్టీతో కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడిగా తనికెళ్ళభరణి, 36 ఓట్ల మెజార్టీతో ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, 159 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వర్ రావు, కార్యదర్శులుగా నరేష్, రఘుబాబు గెలుపొందారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఈరోజు భగవంతుడు నాకు కొత్త బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఈ స్థానంలోకి రావడానికి ఎన్నో పరిక్షలు ఎదుర్కొన్నాం. కొందరు భయపెట్టారు, ప్రలోభపెట్టారు, దబాయించారు, కుళ్ళు రాజకీయాలు చేసారు. మమ్మల్ని అభిమన్యుడిలా దెబ్బ తీయాలని చూసినా నేను అర్జునుడిలా నిలబడ్డాను.నా వెన్నంటే ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నాగబాబు కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలకు ముందు నేను చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటాను. నేను గెలిచి తీరాలని తెలుగు వారు కోరుకున్నారు. నటుడిగా నాబాధ్యతను దాటి వెళ్ళలేదు. దివంగత ఎన్టీఆర్ ఆశీర్వాదాలతోనే ఇక్కడకి వచ్చాను. ఇంత భారీ మెజారిటీతో గెలవడం 'మా' చరిత్రలోనే లేదు. ఇది కేవలం సేవా కార్యక్రమం. ఇక్కడ రూపాయి కూడా పట్టుకెల్లం. ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకు నాకు టీ కూడా ఇవ్వొద్దు" అని అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు. ఇది చిన్న వాళ్ళ విజయం, పేద వాళ్ళ విజయం. ఈరోజు వచ్చిన ఈ విజయం వెనుక ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ఉన్నాయి" అని చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ "మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా ప్రయత్నిస్తాం. మా ప్యానల్ లో నలుగురమే ఉన్నా మా వెన్నంటే ఉండి ఎన్నో సహాయ సహకారాలు అందించిన నాగబాబు గారికి ధన్యవాదాలు"అని చెప్పారు.
నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ "మా అసోసియేషన్ సభ్యులంతా ఒకటే కులం, ఒకటే మతం. తెలంగాణా, ఆంధ్ర అనే తేడా లేదు. మేము అంత ఒక ఇంటి వాళ్ళం. రెండోసారి నన్ను ఈ ఎన్నికలలో గెలిపించారు. మా సభ్యులందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు.