'కొచ్చడయాన్', 'లింగా' సినిమాలు దారుణ పరాజయం తర్వాత రజినీకాంత్ మరో సినిమాకు అంగీకారం తెలుపలేదు. రజినీకాంత్ తర్వాతి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు శంకర్, మురుగదాస్ వంటి అగ్రదర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం సి. సుందర్‌కు దొరికినట్లు సమాచారం. ఇదివరకే సుందర్, రజినీకాంత్‌ల దర్శకత్వంలో 'అరుణాచలం' సినిమా వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా వచ్చిన 18 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. హీరోయిజానికి వినోదాన్ని మేళవించి సిద్ధం చేసిన కథను ఇటీవలే రజినీకాంత్‌కు సుందర్ వినిపించినట్లు సమాచారం. ఈ కథలో కొత్తదనం బాగా నచ్చడంతో వెంటనే రజినీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రెండు వరుస పరాజయాల తర్వాత సినిమాల ఎంపికలో రజినీకాంత్ చాలా జాగ్రత్త వహించారని, సుందర్ చెప్పిన కథపై పూర్తి నమ్మకం ఏర్పడటంతోనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రజినీలాంటి స్టార్‌ను మళ్లీ విజయాల బాట ఎక్కించే బాధ్యతను తీసుకున్న సుందర్ ఎంతవరకు విజయం సాధిస్తాడో వేచిచూడాల్సిందే.