కాంట్రాక్ట్ కిల్లర్ కం సిబిఐ ఆఫీసర్ రజినీకాంత్ పాత్రలో తమిళ నటుడు ఆదిత్య హీరోగా నటించిన హిందీ సినిమా 'మై హో రజినీకాంత్'. ఈ సినిమా టైటిల్ చేంజ్ చేయాలని కోరుతూ.. గత ఏడాది సెప్టెంబర్లో రజినీకాంత్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా టైటిల్ తన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు టైటిల్ మార్చమని నిర్మాతలను ఆదేశించింది. ఫిబ్రవరిలో సినిమా విడుదలపై స్టే విధించింది. దాంతో నిర్మాతలు సినిమా పేరును మార్చారు.
'మై హూ రజినీకాంత్' కాస్త 'మై హూ (పార్ట్ టైం) కిల్లర్'గా మారింది. దీంతో వర్షా ప్రొడక్షన్స్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య సుధీర్గ కాలంగా కోర్టులో నడుస్తున్న కేసులకు శుభం కార్డు పడింది. వివాదాలు సద్దుమణగడంతో ఫైసల్ సైఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల ఆలస్యం అయినా వివాదాలతో సినిమాకు కావలిసినంత ఫ్రీ పబ్లిసిటీ లభించింది.