కమల్ హాసన్ నటించిన 'ఉత్తమ విలన్' సినిమాను మొదట ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు, కుదరలేదు. తర్వాత ఏప్రిల్ 10న కన్ఫర్మ్ అన్నారు. కానీ, ఆ రోజు కూడా విడుదల కావడం లేదు. సెన్సార్ పూర్తయిన తర్వాత కొత్త విడుదల తేదిని ప్రకటిస్తారు. కమల్ సినిమాలు అనుకున్న సమయానికి రాకపోవడం కొత్తేమి కాదు. 'విశ్వరూపం 2' సైతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జాప్యం కారణంగా పలు విడుదల తేదీలు మారాయి. 'ఉత్తమ విలన్' వాయిదాకు గల కారణాలను నిర్మాత వెల్లడించనప్పటికీ.. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాకు పోటిగా రావడం ఇష్టం లేక వెనక్కు వెళ్ళారట. ఓ వారం తర్వాత వస్తే ఎక్కువ థియేటర్లు లభించడంతో పాటు, ప్రారంభ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది.
రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన 'ఉత్తమ విలన్'లో మహామహులు నటించారు. స్వర్గీయ బాలచందర్, కె.విశ్వనాధ్, జయరాం, ఊర్వశిలు ముఖ్య పాత్రధారులు. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఇటివలే తెలుగు ఆడియో విడుదలయ్యింది.