నాని, మాళవిక నాయర్ జంటగా స్వప్న సినిమా బేనర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. ఉగాది కానుకగా మార్చి 21న విడుదలైన ఈ చిత్రానికి మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్‌మీట్‌కి నాగచైతన్య, శేఖర్ కమ్ముల, క్రాంతి మాధవ్, నందినిరెడ్డి, మధుర శ్రీధర్ అతిథులుగా విచ్చేయగా హీరో నాని, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ పాల్గొన్నారు.
నాగ చైతన్య: నేను వున్న సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. నాని అంటే ఇప్పుడు నాకు జెలసీగా వుంది. సుబ్రమణ్యంగా నాని పెర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. జనరల్‌గా కొత్తగా వచ్చే డైరెక్టర్స్ యాక్షన్, లవ్‌కు సంబంధించిన సబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ, నాగ్ అశ్విన్ మాత్రం తను ఎలాంటి సినిమా తియ్యాలనుకున్నాడో అలాంటి సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి మంచి సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నాను.
శేఖర్ కమ్ముల: రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా చూసి నాగ్ అశ్విన్‌కి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. ఇది ఒక కంప్లీట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. ఇలాంటి సినిమా తీసిన నిర్మాతల్ని అభినందించాలి.
నందినిరెడ్డి: కమర్షియల్ సినిమాలు చేస్తూ ఇలాంటి ఒక ఫీల్ గుడ్ సినిమా చేసినందుకు అతనికి థాంక్స్ చెప్తున్నాను. ఈసినిమాలో అతని నటన ఎంతో నేచురల్‌గా వుంది. తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఇది. ఇలాంటి సినిమా చెయ్యాలంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం చేసిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్తున్నాను.
మధుర శ్రీధర్: ఎప్పుడూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చెయ్యాలని కోరుకునే నాలాంటి ఫిల్మ్ మేకర్‌కి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఎంతో ఎనర్జీని ఇచ్చింది. ఒక మంచి సినిమా అందరి ఆదరణ పొందుతూ ఇంతటి ఘనవిజయం సాధించడం చాలా ఆనందంగా వుంది.
క్రాంతిమాధవ్: ఈ సినిమాలో ప్రపంచమంత ఆకలి అని ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంది. నాగ్ అశ్విన్‌లో అంత ఆకలి వుంది. నా సినిమా హిట్ అవ్వాలని దేవుడ్ని కోరుకోలేదు కానీ ఈ సినిమా ఖచ్ఛితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాను. నిర్మాతలు చెప్పిన దానికంటే సినిమా బాగా తీశారు.
స్వప్నదత్: ఈ సినిమా చెయ్యడానికి ధైర్యం చేశాం. సినిమా కంప్లీట్ చేశాం. అయితే ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్న సందేహం వుండేది. అయితే సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాం. ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్‌గానీ, మీడియాగానీ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఈ సినిమా నిరూపించింది.
నాని: నేను నా నిజ జీవితంలో మాత్రం సుబ్రమణ్యంలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడు, సినిమా చేస్తున్నప్పుడు మనకిది ఎంతవరకు హెల్ప్ అవుతుందనే లెక్కలు వేసుకోలేదు. కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాకి అందరి నుంచి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.
నాగ్ అశ్విన్: నేను ఈ కథ రాసుకున్న తర్వాత ఇలాంటి సినిమా చెయ్యాలంటే నిర్మాతలకు ధైర్యం కావాలి. అలాంటి నిర్మాతలు మన ఇండస్ట్రీలో ఎవరైనా వున్నారా అనుకున్నాను. కానీ, ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా చెయ్యడానికి ధైర్యం చెయ్యడమే కాకుండా నాక్కూడా ఎంతో ధైర్యాన్నిచ్చారు. నా కంటే నా కథనే ఎక్కువగా నమ్మారు. హిమాలయాల్లో షూటింగ్ చెయ్యడమంటే మామూలు విషయం కాదు. దానికి భగవంతుడు మాకు ఎంతో సహకరించాడు.