కృష్ణుడు హీరోగా శ్రీశివపార్వతి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ‘నాకూ ఓ లవరుంది’ చిత్రాన్ని నిర్మించి మొదటి చిత్రంతోనే మంచి అభిరుచి వున్న నిర్మాతగా ప్రేక్షకుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు నిర్మాత కె.సురేష్‌బాబు. రెండో ప్రయత్నంగా ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ని తీసుకొని ‘దక్షిణ మధ్య భారతజట్టు’ పేరుతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో వుండగానే ఇప్పుడు ప్రొడక్షన్ నెం.3గా ఓ విభిన్న చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు కె.సురేష్‌బాబు.
ఈ సందర్భంగా కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలన్న ఉద్దేశంతోనే శ్రీశివపార్వతి కంబైన్స్ సంస్థను ప్రారంభించాం. మొదటి ప్రయత్నంగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాం. రెండో చిత్రంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నాము. శ్రీశివపార్వతి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ చిన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తున్నాము. అలాగే చిన్న సినిమాల ఆడియోలను రిలీజ్ చేయడానికి ఆడియో కంపెనీలు ముందుకు రాని టైమ్‌లో హేమాస్ మీడియా పేరుతో ఓ ఆడియో కంపెనీని ప్రారంభించి చిన్న సినిమాల ఆడియోలను రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా బేనర్‌లో మూడో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము. బాలీవుడ్‌లో ఏక్తా కపూర్ దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసిన ప్రశాంత్‌శర్మను ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. ప్రశాంత్‌శర్మ లండన్‌లో కూడా వర్క్ షాప్స్ నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చి ఈ చిత్రం చేస్తున్నాను. మేలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నాము. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో, హీరోయిన్‌లతో ప్లాన్ చేస్తున్నాం. అలాగే టాలీవుడ్‌లోని టాప్ టెక్నీషియన్స్‌ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.