అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ‘జులాయి’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.రాధాకృష్ణ(చినబాబు) మళ్ళీ అదే కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో పలువురు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వేలాది అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా॥ రాజేంద్రప్రసాద్, హీరో ఉపేంద్ర, హీరోయిన్లు సమంత, అదా శర్మ, ఆలీ, ప్రభాస్ శ్రీను, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్ ప్రవీణ్ పూడి తదితరులు పాల్గొన్నారు.
డా॥ దాసరి నారాయణరావు: ఈ ఫంక్షన్ చూస్తుంటే ఆడియో ఫంక్షన్‌లా లేదు. వందరోజులు వేడుకలా అనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాకి సన్నాఫ్ సత్యమూర్తి అనే టైటిల్ పూర్తి యాప్ట్ అని నా ఉద్దేశం. నేను ఈ ఫంక్షన్‌కి రావడానికి ముఖ్యకారణం అల్లు రామలింగయ్యగారి కుటుంబంతో నాకు వున్న అనుబంధం. గీతా ఆర్ట్స్ అనే సంస్థ నా చేతుల మీదుగా ప్రారంభించాను. ఈ బేనర్‌లో రెండు హిట్ సినిమాలు చేశాను. ఒకప్పుడు ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి ఒక సెపరేట్ స్టైల్ అనేది వుండేది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దాన్ని ఆ తర్వాత వచ్చిన చాలా మంది హీరోలు ఇమిటేట్ చెయ్యడం మనం చూశాం. కానీ, అల్లు అర్జున్ మాత్రం తనకంటూ ఓ స్టైల్ వుండాలనుకున్నాడు. ఇప్పుడు కొంతమంది హీరోలు అర్జున్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తో పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అందరికీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ వుంటాయో ఊహించుకోవచ్చు. ఈ పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డెఫినెట్‌గా ‘రేసుగుర్రం’ చిత్రాన్ని ఈ చిత్రం క్రాస్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం మామూలుగా లేదు. చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ చేశాడు. మంచి కథ, మంచి బేనర్, మంచి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సూపర్‌హిట్ కావాలని మనస్తూర్తిగా కోరుకుంటున్నాను.
అల్లు అరవింద్: మా బేనర్‌లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేసిన ‘జల్సా’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి త్రివిక్రమ్‌తో నా ప్రయాణం మొదలైంది. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి గురించి ఆయన పావుగంట సేపు నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు. ఆ వీడియోను నేను యూ ట్యూబ్‌లో 15 సార్లు చూశాను. అతను ఎలాంటివి ఇష్టపడతాడు, అతని భావోద్వేగం ఇవన్నీ నాకు తెలిశాయి. ఆ వీడియో చూసిన తర్వాత నేను అతనికి ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమా విషయానికి వస్తే ‘జులాయి’ తర్వాత అదే కాంబినేషన్‌లో వస్తున్న మరో మంచి సినిమా ఇది. ఈ సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. అందులో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.
డా॥ రాజేంద్రప్రసాద్: ఇదే బేనర్‌లో, ఇదే హీరోతో, ఇదే డైరెక్టర్‌తో ‘జులాయి’ సినిమా చేశాను. ఈ సినిమా ఎలా వుంటుంది అని అడిగితే గుండెల మీద చేయి వేసుకొని ఆ సినిమా కంటే నాలుగు రెట్లు బాగుంటుందని చెప్పగలను. అల్లు అర్జున్ చాలా అద్భుతంగా తన క్యారెక్టర్‌ని చేశాడు. అతనికి ఇక్కడే కాదు కేరళలో కూడా ఫ్యాన్స్ వున్నారు. యూనిట్‌లోని అందరం ఎంతో భయభక్తులతో ఈ సినిమా చేశాం. తప్పకుండా మీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాను.
ఉపేంద్ర: నేను కెమెరా ముందు మాట్లాడినంతగా స్టేజ్ మీద మాట్లాడలేను. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలుగులో నేను చేస్తున్న స్ట్రెయిట్ మూవీ ఇది. నాకు ఎంతో ఇష్టమైన ఆర్టిస్టులతో ఒకే సినిమాలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బన్ని చేసిన ఆర్య సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. తను చేస్తున్న డిఫరెంట్ మూవీస్‌తో సౌత్‌లో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాను. ఇంత మంచి సినిమాలో నేనూ ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అల్లు అర్జున్: ఎంతో దూరం నుంచి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మొదటి చిత్రం నుంచి ఒక్కో మెట్టు నన్ను పైకి ఎక్కిస్తున్న మెగాస్టార్ అభిమానులకు థాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రసాద్ మూరెళ్ళగారికి, పీటర్ హెయిన్స్‌గారికి, దేవికి థాంక్స్. త్రివిక్రమ్‌గారిని అందరూ మాటల మాంత్రికుడు అంటూ వుంటారన్న విషయం తెలిసిందే. ఆయన మాటల్లో చెప్పాలంటే కరెంట్ వున్నోళ్ళకి కటౌట్ అక్కర్లేదు, మ్యాటర్ వున్నోళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్‌గారి డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది.
ప్రసాద్ మూరెళ్ళ: సినిమాని అందంగా, చాలా క్వాలిటీగా తీశాం. డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ వున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం.
సమంత: ఇది నాకు చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే అత్తారింటికి దారేది చిత్రం తర్వాత త్రివిక్రమ్‌గారి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా ఇది. ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. త్రివిక్రమ్‌గారు సక్సెస్ అనేది రిజల్ట్‌తో చూడకూడదు, మనం వర్క్ చేసిన విధానంలోనే చూడాలని చెప్తుంటారు. అలా చూస్తే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను. అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఒక సినిమా కోసం ఆయన చేసే హార్డ్ వర్క్ మామూలుగా వుండదు. తన క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను.
అదా శర్మ: హీరోయిన్‌గా నన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దేవిశ్రీప్రసాద్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
త్రివిక్రమ్: ఒక మంచి సినిమా చేయడంలో మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకారం అందించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చిన కోఆపరేషన్ నేను మర్చిపోలేను. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉపేంద్రగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాత రాధాకృష్ణగారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన బేనర్‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ బేనర్‌లో మళ్ళీ సినిమా చేయడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను.
ఆలీ: త్రివిక్రమ్‌గారు తను ఇంతకుముందు చేసిన హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మహేష్‌తో రెండు సినిమాలు, పవన్‌కళ్యాణ్‌తో రెండు సినిమాలు, బన్నితో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమా మాత్రం ‘జులాయి’ కంటే పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ వినగానే దేవిశ్రీప్రసాద్ నాన్నగారు సత్యమూర్తిగారు గుర్తొచ్చారు. ఆయన కూడా ఈ ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందం కలిగింది.
రామజోగయ్యశాస్త్రి: గతంలో అల్లు అర్జున్‌గారు చేసిన చాలా సినిమాలకు పాటలు రాశాను. రాబోయే చిత్రాలకు కూడా రాస్తున్నాను. అలాగే త్రివిక్రమ్‌గారి సినిమాలకు, దేవిశ్రీప్రసాద్‌గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో కూడా చాలా పాటలు రాశాను. అయితే ఈ సినిమాలో నేను రాసిన పాటకు ఓ ప్రత్యేకత వుంది. అదేమిటో మీరు పాట వింటే తెలుస్తుంది. డూయెట్లు, సరదాగా వుండే పాటలు చాలా రాస్తుంటాం. కానీ, నాకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చిన పాట ఇది. మీ అందరికీ బాగా నచ్చుతుంది.
ప్రవీణ్ పూడి: నా కెరీర్‌లో ‘జులాయి’ సినిమాకి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా రాధాకృష్ణగారికి, అల్లు అరవింద్‌గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం మేం 200 పర్సెంట్ కష్టపడ్డాం. ఈ సినిమాకి విలువలే ఆస్తి అనే ట్యాగ్‌లైన్ వుంది. మరి ఈ సినిమాని చూసిన తర్వాత అల్లు అరవింద్‌గారి రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలని వుంది.
ప్రభాస్ శ్రీను: నేను మొదటి సారి అల్లు అర్జున్‌గారితో కలిసి నటించాను. పెర్‌ఫార్మెన్స్‌లోగానీ, ఫైట్స్‌లో గానీ దేవుడా అనిపించేలా బన్ని పెర్‌ఫార్మెన్స్ వుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.