దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మద్రాస్ టాకీస్ అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శ్రీమతి అనిత సమర్పణలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని ‘ఓకె బంగారం’గా అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్న దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో ప్రముఖ కథానాయకుడు నాని డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘నేను మణిరత్నంగారి వీరాభిమానిని. ఆయన అడగడంతో పాటు, దిల్‌రాజుగారి మీద ఉన్న గౌరవంతో తెలుగులో హీరో పాత్ర కు డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించాను. ‘ఓకే బంగారం’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నప్పుడు ‘సఖి’ కంటే ఈ సినిమా గొప్పగా వుంటుందని అనిపించింది. ఓ మంచి చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు మణిరత్నంగారు, దిల్‌రాజుగారు అందించబోతున్నారు. ఈ సినిమా ‘సఖి’ని మించి భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారి ‘సఖి’ సినిమాని నైజామ్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా పంపిణీ చేశాను. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ఓకే బంగారం’ చిత్రానికి నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతున్నాను. మణిరత్నం దర్శకత్వంతో పాటు, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, పి.సి.శ్రీరామ్ కెమెరా పనితనం అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రం ఆడియోను మార్చి నెలాఖరులో, ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’’ అని అన్నారు.
మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అందిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సీతారామ శాస్త్రి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.