ఆర్.ఎ. ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బి.ప్రశాంత్ నిర్మాతగా రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మల్లి’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ జరిగింది. ఈ ఆడియో బిగ్ సి.డి.ని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త జ్యోతిరెడ్డి ఆవిష్కరించగా, ఆడియో సి.డి.ని ఎం.ఐ.ఎం. నాయకుడు నవీన్ యాదవ్ ఆవిష్కరించి తొలి సి.డి.ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచయిత వెనిగళ్ళ రాంబాబు, సంగీత దర్శకుల్లో ఒకరైన కృష్ణ, నిర్మాత బి.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
వెనిగళ్ళ రాంబాబు: రమ్యశ్రీగారు పేరుకు తగ్గట్టుగానే రమ్యంగా వుంటారు. అలాంటి రమ్యశ్రీగారు ఒక మంచి సినిమా తియ్యాలన్న ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్‌ని ఎంచుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఓ అమాయకమైన అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలను ఎంతో సహజంగా తెరకెక్కించారు. ఆమె ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాను.
రామసత్యనారాయణ: డబ్బు కోసం సినిమాలు తీసేవారు, పేరు కోసం సినిమాలు తీసేవారు వుంటారు. రమ్యశ్రీగారు ఈ సినిమాని పేరు కోసం తీశారు. ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి డైరెక్ట్ చెయ్యడమే కాకుండా ఇందులో ఒక ఉదాత్తమైన పాత్రను పోషించారు. ఆమె కెరీర్ నిలిచిపోయే క్యారెక్టర్ అది. ఈ సినిమా తప్పకుండా ఆమెకు మంచి పేరుని తెస్తుంది.
జ్యోతిరెడ్డి: లేడీ డైరెక్టర్‌గా రమ్యశ్రీగారు ఈ ప్రయత్నం చేయడం ఎంతో అభినందనీయం. స్త్రీ సమస్య మీద సినిమా అంటే గుర్తొచ్చేది ఒసేయ్ రాములమ్మ. ఈ సినిమా కూడా అంతటి ఘనవిజయం సాధించి రమ్యశ్రీగారికి మంచి పేరు, డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నవీన్ యాదవ్: రమ్యశ్రీగారు మా ఫ్యామిలీకి బాగా కావాల్సినవారు. గ్రామాల్లో వున్న పరిస్థితుల్ని బాగా తెలుసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సర్వీస్ ఓరియంటెడ్‌గా వుండే రమ్యశ్రీగారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక మంచి చిత్రాన్ని రూపొందించిన రమ్యశ్రీగారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆమె చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
ప్రశాంత్: రమ్యశ్రీ నా సిస్టర్. ఒక మంచి సినిమా చెయ్యాలి, నా దగ్గర మంచి కథ వుంది అని చెప్పింది. కథ నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో ప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా తప్పకుండా మాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
రమ్యశ్రీ: సినిమా తియ్యడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఒక జీవితం గురించి చూపించడం జరిగింది. ఈ సినిమా తియ్యడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఎన్నో గ్లామర్ పాత్రలు చేస్తూ పీక్‌లో వున్న నేను ఈ సినిమా కోసం వాటన్నింటినీ వదులుకొని రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. మా బ్రదర్‌ని రిక్వెస్ట్ చేసి ఈ సినిమాని చేశాను. ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి నాకు వుంది. దానికి మీ అందరి సపోర్ట్ కూడా వుంటుందని ఆశిస్తున్నాను.
రమ్యశ్రీ, ఆకాష్, ఎల్.బి.శ్రీరామ్, శ్రీధర్, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ, విజయలక్ష్మి, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, సినిమాటోగ్రఫీ: కె.దత్తు, డాన్స్: డి.సురేష్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.రమ్యశ్రీ.