నరేష్, శ్వేతషైని, శ్రీదేవి హీరో, హీరోయిన్స్‌గా షకీలా ప్రధాన పాత్రలో సయ్యద్ అఫ్జల్ సమర్పణలో సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై షకీలా దర్శకత్వంలో రూపొందిన మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ ‘రొమాంటిక్ టార్గెట్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్స్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ టీజర్స్‌ను ప్రముఖ దర్శకుడు సాగర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, కట్టా రాంబాబు విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకురాలు షకీలా, నిర్మాత మెంటా సత్యనారాయణ, చిత్ర సమర్పకులు సయ్యద్ అఫ్జల్, మోహన్‌గౌడ్, హీరోయిన్లు శ్వేత షైని, శ్రీదేవి, మాటల రచయిత నండూరి వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్: మహిళా దర్శకులు డైరెక్ట్ చేసిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో సొసైటీలో జరుగుతున్న సంఘటనలను ప్రొజెక్ట్ చేశారని టీజర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కమర్షియల్‌గా వుంటూనే ఒక సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా షకీలాగారికి డైరెక్టర్‌గా ఉన్నతమైన పేరును తెస్తుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నా నమ్మకం.
టి.ప్రసన్నకుమార్: రొమాంటిక్ టార్గెట్ అనే టైటిల్ చాలా బాగుంది. షకీలాగారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలను చూపుతూ రూపొందించిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరుతోపాటు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.
మెంటా సత్యనారాయణ: కట్టా శ్రీకరప్రసాద్‌గారు ఈ చిత్రాన్ని నిర్మించడంలో అందించిన సహకారం మరువలేనిది. 250 సినిమాల్లో నటించిన షకీలాగారు ఈ చిత్రంతో డైరెక్టర్ అవుతున్నారు. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేశారు. సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. షకీలాగారిని అభిమానించేవారు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే చాలు మేం పెట్టిన డబ్బుకు పదిరెట్లు వస్తుందన్న నమ్మకం వుంది. మేం చేసిన చిన్న ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని, సినిమాని సూపర్‌హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.
సయ్యద్ అఫ్జల్: శ్రీకరప్రసాద్‌గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. షకీలాగారు చాలా మంచి కథ రెడీ చేశారు. ఆమె కథ చెప్పిన దానికంటే బాగా తీశారు. ఒక మంచి ప్రొడక్ట్‌ని తయారు చేశాం. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు. ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడానికి ఒక ముఖ్యకారణం వుంది. ఈ కథ గురించి తెలిసిన కొందరు పొలిటికల్ లీడర్స్ సినిమా రిలీజ్ చెయ్యొద్దని, చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు, షకీలాగారికి బెదిరింపులు వచ్చాయి. అయితే మేం దేనికీ భయపడదలుచుకోలేదు. సినిమాని హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తాం. ఎవరేం చేస్తారో చూస్తాం. ఒక మంచి సినిమాని రిలీజ్ అవకుండా ఎవరూ అడ్డుకోలేరు.
షకీలా: నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలను వేలెత్తి చూపిస్తూ ఒక సందేశాత్మక చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఒక మహిళ మహాశక్తిగా మారి అత్యాచారాలను చేసే వారిని ఎదుర్కొన్నదీ, ఎలా వారి ఆట కట్టించిందనేది ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
నరేష్, శ్వేత షైని, శ్రీదేవి, షకీలా, బాబా భాయ్, దేవి, అరోహి, కావేరి, స్వప్న, జబర్దస్త్ శేషు, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, కావలి సత్యం, స్వామి, అజహర్, రాధాకృష్ణ, అశోక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, పాటలు: సయ్యద్ అఫ్జల్, బొబ్బా, కెమెరా: కంకణాల శ్రీనివాస్‌రెడ్డి, సంగీతం: అభిషేక్, కార్తీక్, ఎడిటింగ్: సునీల్ అళహరి, డాన్స్ బండ్ల రామారావు, ఫైట్స్: అవినాష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్, సహనిర్మాత: జల్లేపల్లి నరేష్, నిర్మాత: మెంటా సత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షకీలా.