శ్రీకాంత్, సోనియామాన్ జంటగా మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సినిమా 'డీ అంటే డీ'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఈ చిత్రం ఇంత అధ్బుతంగా వచ్చిందంటే దానికి కారణం ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులే. ఈ నెల చివరి వారంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాలో హీరో గా నటించిన శ్రీకాంత్ కి, బ్రహ్మానందంకు మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి" అని అన్నారు.
పాటల రచయిత చంద్రబోసు మాట్లాడుతూ "కష్టపడి పని చేసే సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి దొరికారు. ఈ సినిమాలో నాలుగు పాటలు విభిన్న కధాంశాలతో రాసాను. విద్యా వ్యవస్థల గురించి విశ్లేషిస్తూ రాసిన పాటా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
డైలాగ్ రైటర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా ఓ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. కమర్షియల్ గా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చంద్రబోసు రాసిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. చోటా భీమ్ పాత్రలో 10 సంవత్సరాల స్కూల్ బోయ్ లా బ్రహ్మానందం కనిపించనున్నారు. ఆయన చేసిన డాన్సు, అల్లరి, స్పోర్ట్స్ ఈ సినిమా సెకండ్ హాఫ్ కి అధ్బుతంగా కుదిరాయి" అని చెప్పారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "టాప్ టెక్నీషియన్ బృందంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా జొన్నలగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంగీతాన్నిఅందించిన చక్రి లేకపోవడం దురదృష్టకరం. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.