ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ పతాకంపై ధనుష్ హీరోగా భరత్‌బాల దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మరియన్’. తమిళ్‌లో హిట్ అయిన ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్స్ లాంచ్ బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ‘మరియన్’ టీజర్స్‌ని విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్, కుమార్‌రెడ్డి, హీరో ప్రిన్స్, సెన్సార్ బోర్డ్ మెంబర్ రాధాదేవి, భవాని, సాదక్, వివేక్, గిరి తదితరులు పాల్గొన్నారు.
సి.కళ్యాణ్: శోభారాణిగారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ మధ్యలో ఆపేశారు. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. లక్కీగా వారికి మరియన్ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాని రిలీజ్ చేసే అవకాశం వచ్చింది. ఈమధ్యకాలంలో ధనుష్ సినిమాలు తెలుగులో హిట్ అవుతున్నాయి. అదే కోవలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుంది. ఈ సినిమా నేను తమిళ్‌లో చూశాను. చాలా బాగుంటుంది. ఆడియన్స్‌కి చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. డెఫినెట్‌గా ఈ సినిమా బయ్యర్స్‌కి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ సినిమా సూపర్‌హిట్ అయి శోభారాణిగారు ఇంకా ఇలాంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తున్నాను.
ప్రసన్నకుమార్: ఆస్కార్ ఫిలింస్ వారు తీసే సినిమాలన్నీ ఎంతో వైవిధ్యంతో వుంటాయి. వారు చేసే సినిమాలను రిలీజ్ చేసే అవకాశం మొదట ఎస్.వి.ఆర్. మీడియాకే ఇస్తారు. ఈ సంస్థ గతంలో చాలా మంచి సినిమాలను రిలీజ్ చేశారు. ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ ఇటీవల విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ‘మరియన్’ కూడా పెద్ద హిట్ అయి శోభారాణిగారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.
దామోదరప్రసాద్: మా ఆఫీస్ దగ్గరలో వున్న శోభారాణిగారి ఆఫీస్ ఎప్పుడూ ప్రెస్‌మీట్స్‌తో బిజీగా వుండేది. కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది పెద్ద విజయం సాధించి సినిమాలు కంటిన్యూగా చెయ్యాలని కోరుకుంటున్నాను.
ప్రిన్స్: దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత ఎస్.వి.ఆర్. మీడియా నుంచి సినిమా వస్తోంది. ఇప్పటివరకు ఈ సంస్థ చేసిన సినిమాలన్నింటికంటే ‘మరియన్’ ఎక్కువ కలెక్ట్ చేసి శోభారాణిగారికి మంచి తెస్తుందని ఆశిస్తున్నాను.
శోభారాణి: ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసిన సినిమా. 2008లో ముగ్గురు విదేశాలలో కిడ్నాప్ అయ్యారు. ఆ ముగ్గురు 21 రోజుల తర్వాత కిడ్నాపర్స్ చెర నుంచి తప్పించుకొని వచ్చారు. దాన్ని ఒక సినిమాగా మలచడంలో భరత్‌బాలగారు ఎంతో కృషి చేశారు. ఆ ముగ్గురినీ కలుసుకొని ఎంతో రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేశారు. ధనుష్‌గారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తన క్యారెక్టర్‌ను చేశారు. ఈ సినిమాకి రెహమాన్‌గారి మ్యూజిక్ చాలా ఎస్సెట్ అని చెప్పాలి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఫిలింస్ వారు అన్ని సినిమాలు డిఫరెంట్‌గా తీస్తారు. తెలుగులో వారి సినిమాలు రిలీజ్ చెయ్యాలనుకుంటే ఆ ఆఫర్ ముందుగా మాకే ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఆస్కార్ రవిచంద్రన్‌గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుంది. అప్పుడు ధనుష్‌గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం. మా బేనర్‌లో ఈ సినిమా తప్పకుండా మరో సూపర్‌హిట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను.