సందీప్ కిషన్, సురభి జంటగా ఉషాకిరణ్ ఫిలింస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై కణ్మణి దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బీరువా’. ఈ చిత్రం విడుదలైన మొదటివారం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రెండో వారంలోకి ఎంటర్ అయిన తర్వాత కలెక్షన్లు స్లోగా పెరగడం సినిమా సూపర్‌హిట్ అనే టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో సందీప్ కిషన్, నటులు నరేష్, శివన్నారాయణ, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, ఎడిటర్ గౌతంరాజు, నిర్మాత జెమిని కిరణ్ పాల్గొన్నారు.
జెమిని కిరణ్: ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘బీరువా’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. రెండో వారంలో కలెక్షన్లు పెరగడమే కాకుండా థియేటర్లు కూడా పెరిగాయి. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను.
నరేష్: అడపా దడపా కొన్ని మంచి హిట్స్ అందుకుంటున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచింది ‘బీరువా’. ఒక సినిమా 200 థియేటర్లలో రిలీజ్ అయితే రెండో వారానికే 100 థియేటర్లలో ఎత్తేస్తున్న ఈరోజుల్లో 300 థియేటర్లలో రిలీజ్ అయిన ‘బీరువా’ అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడమే కాకుండా రెండో వారంలో మరో 75 థియేటర్లు పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మరో 11 థియేటర్లు పెరగడం చాలా సంతోషాన్ని కలిగించింది. మూడో వారంలోకి ఎంటర్ అయ్యేసరికి ఈ సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో రిలీజ్ అయిన ఏకైక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. నేను హీరోగా నటించిన చిత్రంతోనే ప్రారంభమైన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నా రెండో ఇన్నింగ్స్‌లో మరో పెద్ద సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా సూపర్‌హిట్ అవడం చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శివన్నారాయణ: నేను ఈ సినిమాలో ఒకేరోజు చేశాను. అంతకుముందు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఒకేరోజు చేశాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కి ఎంత మంచి పేరు వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఒకరోజు క్యారెక్టర్ వుంది అని చెప్పగానే చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచించలేదు. ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్. పైగా రెండు పెద్ద నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న సినిమాలో నేను కూడా ఒక పార్ట్ కావడంతో చాలా హ్యాపీగా చేశాను. ఒక క్యూట్ లవ్‌స్టోరీగా యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.
ఛోటా కె.నాయుడు: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కంటే పెద్ద హిట్ కావాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాం. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో నేను చాలా షాక్ అయ్యాను, చాలా బాధపడ్డాను. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటే రిజల్ట్ ఇలా వుందేమిటి అనుకున్నాను. ఎక్కడ తప్పు చేశామో అర్థం కాలేదు. సినిమా చూసినవారంతా చాలా బాగుంది అంటున్నారు. కానీ, కలెక్షన్స్ మాత్రం లేవు. అయితే నరేష్‌గారు ఈ సినిమా హిట్ అని ఎంతో నమ్మకంతో చెప్పారు. పెరుగుతున్న కలెక్షన్స్ గురించి కూడా చెప్పారు. రెండో వారంలో థియేటర్లు కూడా పెరగడంతో నాకూ నమ్మకం కలిగింది. ఒక మంచి సినిమాని తీస్తే ప్రేక్షకులు లేట్‌గా అయినా తప్పకుండా ఆదరిస్తారని ‘బీరువా’తో మరోసారి రుజువు చేశారు. ఈ చిత్రానికి ఘనవిజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సందీప్ కిషన్: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ కథను నమ్మి చేశాం. మొదటి వారం రిజల్ట్ చూసి డిజప్పాయింట్ అయిన మాట వాస్తవమే. కానీ, స్లోగా కలెక్షన్స్ పికప్ అవడం, మౌత్ టాక్‌తో సినిమా సూపర్‌హిట్ అన్న టాక్ స్ప్రెడ్ అవడంతో అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. రెండో వారంలో థియేటర్లు పెరగడం కూడా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలియజేస్తోంది. ఇప్పుడు కలెక్షన్లు స్టడీగా వున్నాయి. జెన్యూన్‌గా ఈ సినిమా సక్సెస్ అయింది అన్న తర్వాత సక్సెస్‌మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యాం. అందుకే ఈ సినిమా సక్సెస్‌ని మీతో పంచుకుంటున్నాం. ఈ సినిమా డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందని చెప్పినవారు ముగ్గురు. నరేష్‌గారు మొదటి నుంచీ ఈ సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్‌తో వున్నారు. ఆ తర్వాత సినిమా బాగుందన్న టాక్ వుందని, డెఫినెట్‌గా కలెక్షన్లు పెరుగుతాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఆ తర్వాత రోజు రోజుకీ పెరుగుతున్న కలెక్షన్లతో ప్రేక్షకులు మాకు నమ్మకాన్ని కలిగించారు. మమ్మల్ని, మా సినిమాని నమ్మి థియేటర్స్‌కి వచ్చి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.