దర్శకత్వం నా పాషన్. దానిని నేను వదిలిపెట్టను. కథానాయికగా కొనసాగుతూనే మంచి కథ కుదిరినప్పుడు ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తా. ఇందులో నో కాంప్రమైజ్ అని అంటోంది కమలహాసన్, సారికల రెండో తనయ అక్షర హాసన్. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న బాలీవుడ్ సినిమా ‘షమితాబ్’. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న చిత్రమిది. ఆర్. బాల్కీ దర్శకుడు. ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్షరహాసన్ మాట్లాడుతూ...
ఓ ఫంక్షన్‌లో ఆర్.బాల్కీ నన్ను చూసి నీతో కాసేపు మాట్లాడొచ్చా అనడిగారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశామిస్తారేమో అనుకున్నా. ఆయనతో మాట్లాడాక నా సినిమాలో నీకో క్యారెక్టర్ అనుకున్నాను. చేస్తావా అనడిగారు. అది కూడా హీరోయిన్ చెప్పగానే నేను ఉద్వేగానికి లోనయ్యాను. నాకు నమ్మసఖ్యం కాలేదు. కాపేపటికి అది నిజం అని తెలిసింది. కథ, అమితాబ్‌బచ్చన్‌గారు, ధనుష్ నటిస్తున్నారని చెప్పగానే హీరోయిన్‌గా లాంచ్ అవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరోసారి ఉండదని మరో క్షణం ఆలోచించకుండా అంగీకరించేశాను. అమితాబ్, బాల్కీ, ధనుష్‌ల కాంబినేషన్‌లో నాకు అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
కాస్త వత్తిడికి లోనయ్యాను
సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ధనుష్ క్యారెక్టర్‌కు, నా క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పించేశారు. ఆ తరువాత సినిమా షూటింగ్ ప్రారంభించారు. సినిమా షూటింగ్ సమయంలో వాయిస్ వెనుక వస్తుంటే ఆ డైలాగ్‌కి నా లిప్‌సింగ్ అయ్యేలా చెయ్యాలి. నాకు ఇదే తొలి సినిమా కావడంతో చాలా కష్టమైంది. కొంత వత్తిడికి లోనయ్యాను. కానీ దర్శకుడు నాకెంతో సహకరించారు. అమితాబ్‌గారు, ధనుష్ మాత్రమే కాకుండా ఇంకా ఉందరో సీనియర్ నటుడు ఇందులో నటించడంతో నాకెన్నో విషయాలు తెలిశాయి. నటన నేర్చుకోవడానికి మంచి స్కోప్ దొరికింది. ఇందులో హీరోయిన్‌గా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఆల్‌మోస్ట్ హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది. అయితే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పని చేయడం సవాల్‌తో కూడిన పని అని తొలి సినిమాతోనే తెలిసింది. అమితాబ్ గారి కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా యాక్ట్ చేశాను. ఆయన సమయాన్ని వృదా చేయకూడదని ముందుగానే మేం ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్‌గా బాల్కీగారు వండర్‌ఫుల్ ప్రోడక్ట్ తెరపై ఆవిష్కరించారు. సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను.
దాంతో నా స్ట్రెంగ్ పెరిగింది
అమ్మనాన్నలు విడిపోవడం నాలో మరింత స్ట్రెంగ్త్‌ని పెంచింది. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. ఒకానొక సందర్భంలో నేను కూడా రీలైజ్ అయ్యాను. వారిద్దరికీ ఇష్టమైన లైఫ్ కావాలనుకున్నారేమో అనుకున్నాను. వాళ్ళిద్దరూ విడిపోయారు గానీ మేం వాళ్ళకు దూరం కాలేదు. నా కెరీర్‌కు సంబంధించి ఏ విషయంలోనైనా అమ్మ, నాన్నల సలహా తీసుకుంటా. అక్కను కూడా సంప్రదిస్తా.
పవన్ కళ్యాణ్‌తో నటించను
టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్‌లాంటి స్టార్ హీరోతో నటిస్తే అంచనాలు భారీగా ఉంటాయి. నా తరువాత సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండాలి. కాబట్టి టాలీవుడ్ డెబ్యూ మూవీ పవన్‌తో చెయ్యదలనుకోలేదు.