రాకేందు మౌళి, వెంకీ, అదితి ప్రధాన పాత్రల్లో క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ సమర్పణలో మధుమిత దర్శకత్వంలో ఎస్.పి.చరణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి అందించారు. ఇంకా ఆడియో ఫంక్షన్‌లో సంగీత దర్శకుడు కోటి, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రాజీవ్ కనకాల, శివలెంక కృష్ణప్రసాద్‌లతోపాటు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీత దర్శకుడు కార్తికేయ మూర్తి, హీరోలు రాకేందు మౌళి, వెంకీ, హీరోయిన్ అదితి, తమిళ్ వెర్షన్ హీరో అర్జున్ చిదంబరం, రాజా రవీంద్ర, సినిమాటోగ్రాఫర్ శ్రీనివాసన్ వెంకటేష్, మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి, గేయరచయితలు వెన్నెలకంటి, కిట్టు, ఎడిటర్ కిరణ్, చిత్ర దర్శకురాలు మధుమిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం: ఈ ఫంక్షన్‌లో స్వాగతోపన్యాసం చేసే అవకాశం ఎలా వచ్చిందంటే నేను ఈ సినిమా ప్రొడ్యూసర్‌కే ప్రొడ్యూసర్‌ని. చరణ్ ఈ సినిమా చేస్తూ ఇందులో ఒక చిన్న వేషం వుంది చెయ్యాలని అడిగాడు. చేశాను. చరణ్ తెలుగులో నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. తమిళ్‌లో కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లుగా, హీరోలుగా వున్నవారికి మొదట అవకాశం ఇచ్చింది వాడే. వెంకట్‌ప్రభు, సముద్రఖని వంటి డైరెక్టర్లకి మొదట అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తెలుగులో మీరు అతన్ని నిర్మాతగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
కె.విశ్వనాథ్: చరణ్ నన్ను పెదనాన్న అని పిలుస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో ఇప్పుడు చరణ్ తెలుగులో మొదటి సినిమా నిర్మిస్తున్నాడని తెలిసి అంతకంటే ఎక్కువ ఆనందపడ్డాను. ఈ సినిమా చక్కని విజయం సాధించాలని నెక్స్‌ట్ చరణ్ తీసే సినిమాల్లో మధుమిత డైరెక్షన్‌లో నేను, నా తమ్ముడు కలిసి నటించాలి. ఇక్కడ చూపించిన సాంగ్ ఆమె ఎంతో బాగా తీశారు. ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా చాలా చక్కగా తీశారు. టెక్నికల్‌గా ఎంత సపోర్ట్ వున్నప్పటికీ దాన్ని కన్సీవ్ చేసి అలా తియ్యడమనేది చాలా గొప్ప విషయం.
మోహనకృష్ణ ఇంద్రగంటి: ఈ సినిమా టైటిల్ చాలా బాగా నచ్చింది. అందమైన తెలుగు పేర్లు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఈ టైటిల్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. పాటలు, టీజర్స్ చాలా బాగున్నాయి. కార్తికేయ చాలా మంచి మ్యూజిక్ చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది.
కార్తికేయ మూర్తి: మూడు ముక్కల్లో చెప్పాలంటే డ్రీమ్ కేమ్ ట్రూ, చరణ్ సార్‌కి థాంక్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మధు మేడమ్ థాంక్స్.
మధుమిత: ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది చాలా ఫన్నీగా వుండే సినిమా. జనాలని, ఇండస్ట్రీని మార్చాలని మేం ట్రై చెయ్యలేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఇవ్వాలని ఈ సినిమా తీశాం. టోటల్‌గా యూత్‌తో చేసిన సినిమా ఇది. తమిళ్‌లో రెండు సినిమాలు చేశాను. తెలుగులో సినిమా డైరెక్ట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన చరణ్ సార్‌కి చాలా థాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన వారిలో చాలా మందికి ఇది మొదటి సినిమా. ఎంతో కష్టపడి పనిచేశారు. తప్పకుండా ఈ సినిమా చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
శశాంక్ వెన్నెలకంటి: నన్ను డైలాగ్ రైటర్‌ని చేసింది కృష్ణప్రసాద్‌గారు. మొట్టమొదట నేను మన్మధ సినిమా కోసం కోదండపాణి థియేటర్‌లో డైలాగ్స్ రాశాను. నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది జురాసిక్ పార్క్ సినిమా కోసం. అది కూడా కోదండపాణి థియేటర్‌లోనే.
రాకేందుమౌళి: నాకు ఇష్టమైన పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చారు. నేను డాన్స్ నేర్చుకోవడానికి కారణం సాగరసంగమం. విశ్వనాథ్‌గారివల్ల, కమల్‌హాసన్‌గారి వల్ల. నేను పాటలు పాడడం నేర్చుకున్నది బాలుగారి పాటలు విని. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడినని ఎప్పుడూ చెప్తుంటాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన చరణ్ అన్నయ్యకి, మధుమితగారికి జీవితాంతం రుణపడి వుంటాను. నేను ఈ సినిమాకి డైలాగ్స్ రాయడానికి వచ్చాను. ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యొచ్చు, నువ్వే హీరోవి అని చెప్పారు. అలా ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నాతోపాటు నటించిన వెంకీ నాకు నటనపరంగా చాలా విషయాలు నేర్పించారు. అలాగే మధుమితగారు ఎంతో ఓపికగా ఒక సిస్టర్‌లా నాతో చేయించారు. వారికి థాంక్స్ చెప్తున్నాను.
వెన్నెలకంటి: నేను జీవితంలో ఇది ఎదురుచూడని రోజు. ఒక లిరిక్ రైటర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. డబ్బింగ్ రైటర్‌ని అయ్యాను. ఎన్నో సినిమాలకు మాటలు, పాటలు రాశాను. పెద్దబ్బాయి రైటర్‌గా వచ్చాడు. మాటలు రాస్తున్నాడు. రెండో అబ్బాయి పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడు. నేను దానికి ఏమీ ఆశ్చర్యపోలేదు. హీరో అవుతాడని అనుకోలేదు. అసలు నేను లిరిక్ రైటర్‌ని అవుతానని అనుకోలేదు. దానికి కారణం బాలసుబ్రహ్మణ్యంగారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఇంకా పెద్ద పదం ఏదైనా వుంటే అవన్నీ బాలుగారే. ఆయన పెట్టిన భిక్ష నా జీవితం. ఇప్పుడు బాలుగారి అబ్బాయి చరణ్ మా అబ్బాయిని హీరోని చేస్తున్నాడు. దానికి నేను ఒకటే చెప్పాను వారి ఫ్యామిలీ చెయ్యి మనకి బాగా అచ్చి వచ్చింది. తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పాను.
కోటి: మా ముద్దుల బాలుగారు చాలా ఆప్యాయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది మా ఫంక్షన్. తెలుగులో ఫస్ట్ మూవీ చేస్తున్న చరణ్ డెఫినెట్‌గా సక్సెస్ అవ్వాలి. కొడుకు ప్రొడ్యూసర్ అవుతానంటే వెన్నంటి వుండి సపోర్ట్ చేస్తున్న బాలుగారికి కృతజ్ఞతలు. మనం ప్రేక్షక దేవుళ్ళు అంటాం. కానీ, నిజానికి డబ్బు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత నిజమైన దేవుడు. చరణ్ చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
చంద్రమోహన్: చరణ్ మా అబ్బాయి. మా తమ్ముడి కొడుకు. ఇక్కడ మా అన్నయ్య విశ్వనాథ్ వున్నారు. ఇది మా సొంత సినిమా లాంటిది. వారి విజయమే మా విజయం. ఈ టీమ్‌లో అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.