చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకొని డైనమిక్ లేడీ డైరెక్టర్ అనిపించుకుంటున్న దర్శకురాలు జయ బి. ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్ తర్వాత ఈ సంవత్సరం రెండు చిత్రాలు రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న జయ బి. పుట్టినరోజు జనవరి 11. ఈ సందర్భంగా సూపర్‌హిట్ పత్రిక నూతన కార్యాలయంలో తన పుట్టినరోజు వేడుకను పాత్రికేయ మిత్రుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌హిట్ వీక్లీ ఎడిటర్ బి.ఎ.రాజుతోపాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పసుపులేటి రామారావు మాట్లాడుతూ ‘‘జయగారి గురించి చెప్పాలంటే ముందుగా భానుమతిగారి గురించి చెప్పాలి. ఎందుకంటే భానుమతిగారితో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. ఒక వారం రోజులు కనిపించకపోతే ఏమయిపోయావంటూ ఇంటికి ఫోన్ చేసేవారు. ఆ తర్వాత నాకు అంతగా తెలిసిన వ్యక్తి జయగారు. డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో మద్రాస్ వచ్చారు. ఎంతో కష్టపడి ప్రతి స్టెప్ ఎదుగుతూ వచ్చారు. భానుమతిగారితో పోల్చదగ్గ వ్యక్తి. ఎందుకంటే డైరెక్టర్‌గా భానుమతిగారిలో వున్న కమాండ్ మళ్ళీ నేను జయగారిలో చూశాను. చాలా మంచి రైటర్. నేను అభిమానించే లేడీ రైటర్స్‌లో జయగారు ఒకరు. ఆమె రాసిన ప్రతి కథ నేను చదివాను. చాలా మంచి సినిమాలు చేశారు. లాస్ట్ ఇయరే సినిమా చేస్తారనుకున్నాను. ఇక నుంచి రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ డైరెక్టర్‌గా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ జయగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ ‘‘లవ్‌లీ’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. 2012లో టాప్ టెన్‌లో ఒక సినిమాగా నిలిచింది. అంత పెద్ద హిట్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఎందుకు సినిమా చెయ్యలేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణం ఏమిటంటే స్క్రిప్ట్ రెడీ చెయ్యడంలో నేను ఎక్కువ టైమ్ తీసుకున్నాను. ఒక మంచి హిట్ సినిమా చేసిన తర్వాత దాన్ని మించిన లెవల్‌లో వున్న సినిమాయే చెయ్యాలి తప్ప ఆర్డినరీ సినిమా చెయ్యకూడదని మెంటల్‌గా ప్రిపేర్ అయి వున్నాను. ఇంతకుముందు కొంచెం తొందరపడి సినిమా తీశాను. ఈసారి అలా తొందరపడదలుచుకోలేదు. ఈ సంవత్సరం ‘తొక్కుడుబిళ్ళ’, ‘కలిసుందాం.. కండీషన్స్ అప్లై’ అనే రెండు సినిమాలు చెయ్యబోతున్నాను. ‘తొక్కుడుబిళ్ళ’ చిత్రానికి గోపాలకృష్ణగారు కథ, మాటలు అందిస్తున్నారు. సుడిగాడు వంటి హిట్ సినిమాకి మ్యూజిక్ చేసిన వసంత్‌గారు కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశారు. ఫిబ్రవరిలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం డెఫినెట్‌గా రెండు సినిమాలు చెయ్యదలుచుకున్నాను. ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమా చేయబోతున్నాను. సజ్జన్ అనే కొత్త కుర్రాడిని ఆ సినిమా కోసం ట్రైన్ అప్ చేస్తున్నాము. అతను హీరోగా ఓ సినిమా చేస్తాను. రామారావుగారు నన్ను భానుమతితో పోల్చారు. ఆవిడ మల్టీ టాలెంటెడ్. అంత కాదు నేను. అయినా రామారావుగారికి థాంక్స్. నా కథలు చదివిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు నాకు వున్న టాలెంట్‌కి తగ్గ సక్సెస్ రాలేదని అంటుంటారు. అందుకే ఈ సంవత్సరం నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాను.ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..
ఇంతకుముందు లవ్‌స్టోరీస్ చేశారు. ఇప్పుడు మీరు చెయ్యబోయే సినిమాలు కూడా లవ్‌స్టోరీలేనా?
రెండు లవ్‌స్టోరీస్. ఒకటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ. నేచురల్‌గా, రియాలిటీకి దగ్గరగా వుండే సినిమాలంటే మలయాళం చిత్రాలను ఎగ్జాంపుల్‌గా చెప్తారు. అలాంటి నేచురల్ మూవీ చేయబోతున్నాను.
మీ సొంత బేనర్‌లోనే కాకుండా బయటి బేనర్‌లో కూడా సినిమాలు చేస్తారా?
ఇప్పుడు చెప్పిన మూడు సినిమాల్లో తొక్కుడు బిల్ల మా బేనర్‌లో వుంటుంది. మిగతా రెండు సినిమాలు బయటి బేనర్‌లోనే చేస్తున్నాను.
లేడీ డైరెక్టర్‌గా మీకు ఎలాంటి టార్గెట్స్ వున్నాయి?
డైరెక్టర్‌గా నాకు ఇన్‌స్పిరేషన్ విజయనిర్మలగారు. దాదాపు 50 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్ని సినిమాలు చేసిన లేడీ డైరెక్టర్ వరల్డ్‌లో ఎవరూ లేరు. అన్ని వెరైటీ సినిమాలు చేసినవాళ్ళు కూడా లేరు. యాక్షన్ మూవీస్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, విలేజ్ ఓరియంటెడ్..ఇలా అన్ని రకాల సినిమాలు చేశారు. ఆవిడ చాలా టాలెంటెడ్. విజయనిర్మలగారు తీసినన్ని సినిమాలు కాకపోయినా అందులో సగమైనా మంచి సినిమాలు అందించాలని నా ఉద్దేశం.
మీ సినిమాలను సెన్సిటివ్‌గా డీల్ చేస్తుంటారు. కానీ, ప్రొడ్యూసర్‌కి అది కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందంటారు?
నా కథలు రియల్‌గా వుంటాయని అవి చదివినవారు చెప్తుంటారు. సినిమా విషయానికి వస్తే నేను ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలే తీశాను. ప్రేమలో పావని కళ్యాణ్ పాటలు చూసి నా శిష్యులు కూడా తియ్యలేదు, జయ నాలా పాటలు తీస్తోంది అన్నారు. ఆయన అనేవరకు నాకు తెలీదు నేను ఆయనలా పాటలు తీస్తున్నానని. డిస్ట్రిబ్యూటర్లు కూడా మీరు కమర్షియల్ సినిమా తీస్తారని ఊహించలేదు అన్నారు. నేను ఇంచు మించు అన్నీ కమర్షియల్ మూవీసే తీశాను. లవ్‌లీ ఎంత కమర్షియల్ మూవీ అనేది మీకు తెలుసు. రెండు సంవత్సరాలుగా నేను సినిమా తియ్యలేదని చాలా మంది ఫీల్ అవడం లేదు. ఎందుకంటే నెలకు రెండు, మూడు సార్లు లవ్‌లీ సినిమా చూస్తున్నారు కాబట్టి.
నాగార్జునగారు మీతో సినిమా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు?
అవునండీ. నాగార్జునగారితో సినిమా చెయ్యడం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం. ఎందుకంటే అన్నిరకాల క్యారెక్టర్స్ ఆయన చేశారు. ఆయనతో సినిమా చేస్తే వెరైటీగా వుండాలి, డిఫరెంట్ సబ్జెక్ట్ అయి వుండాలి. లేడీ డైరెక్టర్‌తో చెయ్యడం ఫస్ట్ టైమ్ కాబట్టి చాలా డిఫరెంట్‌గా వుండాలి, సేమ్ టైమ్ కమర్షియల్‌గా కూడా వుండాలి అని చెప్పారు నాగార్జునగారు. ఆయనకు సరిపోయే సబ్జెక్ట్ కోసం చూస్తున్నాను అన్నారు డైరెక్టర్ జయ బి.