అభినవ్(సర్దార్ పటేల్) హీరోగా, మధులగ్నదాస్ హీరోయిన్‌గా శుభోదయ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ సాయి దర్శకత్వంలో టి.లక్ష్మీసౌజన్య గోపాల్ నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ ‘గేట్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని జయభేరి క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ‘గేట్’ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని హీరో అభినవ్‌కి అందించారు. బేనర్ లోగోను రమేష్ పుప్పాల ఆవిష్కరించారు. ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో లగడపాటి శ్రీధర్, మధుర శ్రీధర్‌తోపాటు చిత్ర దర్శకుడు రాజేష్ సాయి, నిర్మాత టి.లక్ష్మీసౌజన్య గోపాల్, సంగీత దర్శకుడు డిజె షాన్, సినిమాటోగ్రాఫర్ చక్రవర్తి గనాపాటి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తలసాని శ్రీనివాసయాదవ్: 80 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి. చెన్నైలో వున్న చిత్ర పరిశ్రమ మొదట అక్కినేని నాగేశ్వరరావుగారు హైదరాబాద్ రావడంతో ఆ తర్వాత పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. ఈ పరిశ్రమని అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ఈమధ్య జరిగిన అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఫంక్షన్‌లో ముఖ్యమంత్రిగారు చెప్పినట్టుగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా చెయ్యడానికి సిద్ధంగా వున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే సర్దార్ పటేల్ హీరోగా నటించిన ఈ ‘గేట్’ సినిమా పాటలు, ట్రైలర్స్ చాలా బాగున్నాయి. చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ సినిమా ఎంతో క్వాలిటీతో పెద్ద సినిమాగా అయిందని నిర్మాత చెప్తున్నారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత గోపాల్: మంచి సినిమాలు చెయ్యాలని ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలు తీసి డబ్బు సంపాదించాలని లేదు. అలాగని సినిమా తీసి డబ్బు పోగొట్టుకోవాలని కూడా లేదు. సినిమా చెయ్యడం వల్ల పది మందికి పని కల్పించిన వాడినవుతానన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. నేను నిర్మాతను కావడానికి నా భార్య సహకారం ఎంతో వుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. రాజేష్ సాయి చాలా అద్భుతంగా తీశాడు. తప్పకుండా ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
రాజేష్‌సాయి: మానవ సంబంధాల మీద నాకు గౌరవం ఎక్కువ. ఒక మంచి సినిమా తియ్యాలన్న ఉద్దేశంతో వచ్చిన గోపాల్‌గారితో కలిసి ఈ సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. డబ్బు కోసం ఆశించకుండా మంచి సినిమా చెయ్యాలని ఈ సినిమా స్టార్ట్ చేశాము. గోపాల్‌గారు నామీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా బాగా రావడానికి మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అనిల్ ఉద్దరాజు, రావణ్, ఆజాద్, కరాటే సైదులు, మధుమిత, బలరాం, టి.ఎల్.సౌజన్యగోపాల్, ప్రత్యూష, జెమిని వినోద్, సాయిసతీష్, దివ్య, కుమార్, సత్యవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఐ.జె., సినిమాటోగ్రఫీ: చక్రవర్తి గనాపాటి, నిర్మాత: టి.లక్ష్మీసౌజన్య గోపాల్, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: రాజేష్ సాయి.