అంజాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ జె.వి.ఆర్. సినిమా పతాకంపై సీనియర్ డైరెక్టర్ భరత్ పారేపల్లి దర్శకత్వంలో జె.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ ‘హీరోయిన్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్టర్ మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో అంజాన్, హీరోయిన్ అనుస్మృతి, రచయిత మరుధూరి రాజా, సంగీత దర్శకుడు లలిత్ సురేష్, సినిమాటోగ్రాఫర్ మురళీకృష్ణ వర్మన్, నిర్మాత జె.వెంకటేశ్వరరావు, దర్శకుడు భరత్ పారేపల్లి తదితరులు పాల్గొన్నారు.
భరత్ పారేపల్లి: 30 సినిమాలు డైరెక్ట్ చేసిన నాకు ఇది కొత్త జోనర్. ఇప్పటివరకు హార్రర్ ఎంటర్‌టైనర్స్ చేయలేదు. చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ మంచి కథ కుదరలేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి కరెక్ట్‌గా సరిపోయే కథ కుదిరింది. ఒక మంచి సినిమా నిర్మించాలని ఇండస్ట్రీకి వచ్చిన వెంకటేశ్వరరావుగారు ఈ సబ్జెక్ట్‌కి తగిన బడ్జెట్‌తో సినిమా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం నవ్వుకుంటూ, మరో పక్క భయపడుతూ అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న మా నిర్మాతగారి అబ్బాయి అంజాన్ ఒక కొత్త హీరోలా కాకుండా రెగ్యులర్ హీరోగానే చాలా బాగా చేశాడు. అతనికి హీరోగా మంచి భవిష్యత్తు వుంటుందని నా నమ్మకం. మా సినిమా రిలీజ్‌కి వెళ్ళడానికి మారుతిగారి సహకారం ఎంతో వుంది. ఈ సందర్భంగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరుధూరి రాజా: భరత్, నేను ఎప్పటినుంచో మంచి స్నేహితులం. అతని సినిమాకి వర్క్ చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇండస్ట్రీలో నేను ప్రేమించే ఏడెనిమిది మంది డైరెక్టర్స్‌లో భరత్ ఒకడు. ఒక మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమా చేశాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
లలిత్ సురేష్: ఇందులో 5 పాటలు వున్నాయి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఆడియోకి తగ్గట్టుగానే విజువల్‌గా పాటలు చాలా బాగా తీశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.
అనుస్మృతి: ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి హార్రర్ కామెడీ చిత్రంలో నటించడం హ్యాపీగా వుంది. హీరోయిన్‌గా ఇందులో చేసిన మెయిన్ క్యారెక్టర్ నాకు నిజంగా ఒక ఛాలెంజ్‌లాంటిది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చెయ్యాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. ఆ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
జె.వెంకటేశ్వరరావు: నాకు చిన్నతనం నుంచి నటించాలని కోరిక వుండేది. ఆ కోరిక అందరికీ వుంటుంది. అలాగే మంచి సినిమా తియ్యాలన్న కోరిక కూడా వుంటుంది. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఈ సినిమాతో నాకు దక్కినందుకు చాలా సంతోషంగా వుంది. భరత్‌గారు చెప్పిన సబ్జెక్ట్ నాకు బాగా నచ్చి స్టార్ట్ చేశాం. హ్యాపీగా సినిమా కంప్లీట్ చెయ్యగలిగాం. ఈ సినిమా రిలీజ్ విషయంలో హెల్ప్ చేస్తున్న మారుతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మారుతి: జె.వి.ఆర్.గారు నాకు మంచి ఫ్రెండ్. బిజినెస్‌రంగంలో వున్నారు. మంచి సినిమా తియ్యాలని ఇండస్ట్రీ వచ్చారు. ఫస్ట్‌కాపీ వచ్చిన తర్వాత చూపించారు. నాకు బాగా నచ్చింది. భరత్‌గారు ఫస్ట్‌టైమ్ ఇలాంటి సినిమా చేశారు. జె.వి.ఆర్.గారు రిలీజ్ విషయంలో టెన్షన్ పడడం చూసి ఆ విషయంలో నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. నిర్మాత అవ్వాలన్న ప్యాషన్‌తో వచ్చిన ఆయన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పంపించాలన్న ఆలోచన నాది. ఈ సినిమాతో తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటారన్న నమ్మకం నాకు వుంది.
అంజాన్, అనుస్మృతి, రఘుబాబు, తాగుబోతు రమేష్, శ్యామల, అజ్జుభాయ్, రవి, సంగని శ్రీను, రాంబాబు చిల్లర, అశోక్ రామసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లలిత్ సురేష్, కమల్ ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: మురళీకృష్ణ వర్మన్, నిర్మాత: జె.వెంకటేశ్వరరావు, దర్శకత్వం: భరత్ పారేపల్లి.