జగపతిబాబు, మీరా నందన్ ప్రధాన పాత్రధారులుగా కేఎస్వీ ఫిలింస్ పతాకంపై విప్లవ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కేఎస్వీ నిర్మాతగా ప్రముఖ నిర్మాత సుంకర మధుమురళి సగర్వంగా సమర్పిస్తున్న విభిన్న కథా చిత్రం ‘హితుడు’. ఈ చిత్రం డిసెంబర్ 26న సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని వివిధ రంగాలకు చెందిన మేధావులకు, ప్రముఖులకు ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ ప్రివ్యూకు సీనియర్ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ఈ చిత్రంలోని పాటలను రచించిన అనంతశ్రీరామ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి అనుభూతులను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఎ.బి.కె.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘హితుడు’ ఈ కాలంలో వున్న బుద్ధుల్ని సరిచేయడానికి వచ్చిన మంచి సాంఘిక చిత్రంగా నేను భావిస్తున్నాను. ఆదర్శమైన విలువల్ని దర్శకుడు విప్లవ్ ఈ చిత్రంలో ప్రతిపాదించారు. ‘హితుడు’ చాలా మంచి చిత్రం’’ అన్నారు.
అల్లం నారాయణ మాట్లాడుతూ ‘‘వాస్తవిక పరిస్థితులు, సోషల్ కాన్షెస్, అలాగే చదువు, ఉపాధ్యాయులు, తొలి ఉపాధ్యాయుడి ప్రభావం ఇవన్నీ వెరసి ఒక మంచి సినిమాగా అయింది. నిజానికి విప్లవ్‌కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా థీమ్, కంటెంట్, మేకింగ్ చాలా బాగుంది. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా అనిపించలేదు. మనుషుల్లో నిద్రాణమై వున్న శక్తుల్ని మేల్కొలపడానికి, సామాజిక వాస్తవిక పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానికి విప్లవ్ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. హ్యాట్సాఫ్ టు హిమ్’’ అన్నారు.
అనంతశ్రీరామ్ మాట్లాడుతూ ‘‘హితుడు సినిమా చూశాను. అబద్ధం చెప్పడం ఎందుకు కళ్ళు తుడుచుకునే బయటికి వచ్చాను. మనసు పొరల్లోంచి దాటి మన చిత్తాన్ని, బుద్ధిని, ఆత్మని మేల్కొలపగలిగేంత గొప్ప కథ ఇది. విప్లవ్‌గారి కథనం కూడా ఈ కాలానికి సరిపడేట్టు వుంటూ విలువల్ని ఏమాత్రం జారనివ్వకుండా వుంది. ఇలాంటి సినిమాని చూడడం, ఇలాంటి సినిమాని ప్రోత్సహించడం మన తెలుగు ప్రేక్షకుల బాధ్యత. ఎందుకంటే మనకు మంచి అభిరుచి వుంది అని ప్రేక్షకులు నిరూపించుకోవాలంటే ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ఆదరించి తీరాలి. ఇందులో ఒక పాటలో నేను రాసిన లైను ‘అనుకున్నావో అవుతుందంతే..’ మనం అనుకుంటే కళాత్మకమైన సినిమాల్ని కమర్షియల్ హిట్స్ చెయ్యగలం. అది ప్రేక్షకుల బాధ్యత. మీ బాధ్యతను నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాత సుంకర మధుమురళి మాట్లాడుతూ ‘‘ఒక మంచి కథ, విభిన్నమైన కథనం, సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం... ఇవన్నీ కలగలిసిన మంచి చిత్రమిది. ఇలాంటి మంచి సినిమా నా సమర్పణలో రావడం గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
జగపతిబాబు, మీరానందన్, బెనర్జీ, సి.వి.ఎల్.నరసింహారావు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరన్, పాటలు: అనంతశ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సమర్పణ: సుంకర మధుమురళి, నిర్మాత: కేఎస్వీ, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: విప్లవ్.