హిమజ, గిడ్డేష్, గంటమ్రోగిన రవితేజ ప్రధాన పాత్రల్లో పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘వేటకొడవళ్ళు’. ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి 7న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ముహర్తపు సన్నివేశానికి సహజనటి జయసుధ క్లాప్ నివ్వగా, సీనియర్ నటుడు నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో..
బాబ్జీ: దర్శకుడిగా ఎన్నో చిత్రాలు రూపొందించిన నేను మొదటి సారి నిర్మాతగా ఈ చిత్రాన్ని చేస్తున్నాను. మంచి మెసేజ్‌తోపాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. మన పిల్లలకు మంచి భవిష్యత్తు వుండాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అయితే తల్లిదండ్రులు లేని అనాథల మాటేమిటి? వాళ్ళని నిర్లక్ష్యం చెయ్యడంవల్ల సంఘ వ్యతిరేక శక్తులతో చేరి వేటకొడవళ్ళుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అందర్నీ ఆలోచింపజేసే ఇలాంటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆరుగురు నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఈ నెల 7 నుండి 13 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్, 22 నుంచి నెలరోజుల పాటు కర్నూల్ పరిసర ప్రాంతాల్లో జరిగే షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాము. ఏప్రిల్, మే నెలలో చిత్రాన్ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం.
నరేష్: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న బాబ్జీ చేస్తున్న ఈ సినిమాలో ఎంతో వైవిధ్యం వుంది. తన డైరెక్షన్‌లో ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ చిత్రం చేశాను. అది త్వరలో విడుదల కాబోతోంది. మంచి సందేశంతో బాబ్జీ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది.
హిమజ: మొదటిసారి ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ చేస్తున్నాను. వేటకొడవళ్ళు అనే టైటిల్‌లాగే ఎంతో పదునైన కథ ఇది. అందర్నీ ఆలోచింపజేసే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది.
సంగీత దర్శకుడు గజ్వేల్ వేణు: ఇందులో ఐదు పాటలు వున్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్ చెయ్యడం జరిగింది. ఇంత మంచి సినమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన బాబ్జీగారికి థాంక్స్.
సుమన్, తనికెళ్ల భరణి, కాదంబరి కిరణ్, చాణక్య, జబర్‌దస్త్ రాఘవ, గిడ్డేష్, గంటమ్రోగిన రవితేజ, బాబూ రామ్, గోవింద్, హన్మంత్, హిమజ, జయవాహిని, బిందు, ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌సాగర్.యస్, సంగీతం: గజ్వేల్ వేణు, ఎడిటర్: శివశార్వాణి, నిర్వహణ: సి.హెచ్.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హనుమంతరావు.యస్, సహ నిర్మాత: ఎన్.పి.సుబ్బారాయుడు, రచన, నిర్మాత, దర్శకత్వం: బాబ్జీ.