సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా, అగ్రదర్శకుడు శంకర్‌ల మధ్య వివాదం రాజుకుంది. తాను కంపోజ్ చేసిన పాటను తన అనుమతి లేకుండా శంకర్ వాడుకున్నాడంటూ ఇళయరాజా అగ్గిమీదగుగ్గిలమవుతున్నాడు. అంతేకాకుండా దీనికి సంబంధించి వెంటనే సమాధానం చెప్పాలంటూ కోర్టు ద్వారా నోటీసులు కూడా జారీ చేయించాడు. వివరాల్లోకి వెళితే.. శంకర్ శిష్యుడు కార్తిక్ జి. క్రిష్ దర్శకత్వంల్‌ో ఇటీవల 'కప్పల్' అనే సినిమా రూపొందింది. ఈ చిత్రంలో వైభవ్, సోనమ్ నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాను శంకర్ తన ఎస్. పిక్చర్స్ ద్వారా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో ఇళయరాజా బాణీ కట్టిన 'ఊరు విట్టు ఊరు వందు..' అనే పాటను వాడుకున్నారు. తాను కంపోజ్ చేసిన పాటను వాడుకునేముందు తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ఇలా తన పాటను వాడుకున్నందుకు తనకు పరిహారం చెల్లించాలని ఇళయరాజా 'కప్పల్' దర్శకుడు కార్తీక్ జి.క్రిష్, ప్రొడ్యూసర్ జయరాంలతోపాటు శంకర్‌కు కూడా నోటీసులు జారీ చేశాడు. పరిహారం చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని నోటీసులో హెచ్చరించాడు. మరి పరిహారం చెల్లించి చేసిన తప్పును శంకర్ ఒప్పుకుంటాడా..? లేక కోర్టుకు వెళ్లడానికి సై అంటాడా..? అనే విషయమై ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తీవ్ర ఆసక్తి నెలకొంది.