కన్నడ హీరో విజయ్‌ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ జి.వి.కె.4 గ్రూప్ సమర్పణలో శ్రీనివాసా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పరకోటి బాలాజీ దర్శకత్వంలో ‘బైరాగి’ పేరుతో ఓ విభిన్న చిత్రం రూపొందనుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విజయ్, నిర్మాత మల్లమ్మ సుబ్రహ్మణ్యమ్, దర్శకుడు పరకోటి బాలాజీ, ఈ చిత్రానికి కథ, మాటలతోపాటు కొరియోగ్రఫీ అందిస్తున్న కోడి నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
పరకోటి బాలాజీ: దర్శకుడుగా ఇది నా 9వ సినిమా. తెలుగు, కన్నడ భాషల్లో చాలా భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. జనవరి నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్‌లో మార్చి, ఏప్రిల్ వరకు షూటింగ్ పూర్తి చేస్తాము. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం. సమ్మర్‌లో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం.
మల్లమ్మ సుబ్రహ్మణ్యమ్: ఈ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న విజయ్ ‘ఇష్టార్థ’ చిత్రంతో కన్నడలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ చిత్రం ఆడియో ఫంక్షన్ 5న జరగబోతోంది. బాలాజీగారు చెప్పిన కథ బాగా నచ్చడంతో తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.
విజయ్: ఇది యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ ఈ మూడు అంశాలతో రూపొందుతున్న సినిమా. ఈ చిత్రం ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు.
కోడి నాగేంద్రప్రసాద్: బంధాలు, అనుబంధాలు తెలియకుండా పెరిగిన ఓ యువకుడు వాటి గురించి తెలుసుకొని ఎలా తనని తను మార్చుకున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలోని పాటలకు నేనే కొరియోగ్రఫీ చేస్తున్నాను. అందరికీ నచ్చే మంచి సినిమా అవుతుంది.
విజయ్, ప్రియదర్శిని, విజయరంగరాజు, బాలాజీ, నాగేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మురళి లియోన్, కథ,మాటలు,డాన్స్: కోడి నాగేంద్రప్రసాద్, కెమెరా: డి.వెంకటేష్, ఎడిటింగ్: రాము, నవ్వుల శ్రీను, యాక్షన్: సూపర్ ఆనంద్, సహనిర్మాత: పి.శ్రీనివాసరావు, నిర్మాత: మల్లమ్మ సుబ్రహ్మణ్యమ్, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పరకోటి బాలాజీ.