జెంటిల్‌మేన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి విభిన్న చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దర్శకుడు శంకర్. తను ఏ చిత్రం చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు చాలా హై రేంజ్‌లో వుంటాయి. అలాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ‘ఐ’. చియాన్ విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలిం ప్రై. లిమెటెడ్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ డిసెంబర్ 30న హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఐ’ ఆడియోను ఆవిష్కరించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియోను ఎస్.ఎస్.రాజమౌళి ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సాయికొర్రపాటి, పంపిణీదారులు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, గేయరచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేతలు ఆర్.బి.చౌదరి, పారస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్: సాధారణంగా నేను చేసే సినిమాల తాలూకు విశేషాలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడతాను. ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్స్, మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం వల్ల ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అయితే సినిమా మీద మా యూనిట్‌లోని అందరికీ పూర్తి నమ్మకం వుంది. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఇప్పటి వరకు నేను చేయని జోనర్ ఇది. ఇందులో మంచి మెసేజ్ కూడా వుంది. మా ఆడియో రిలీజ్‌కి టాలీవుడ్‌లోని ప్రముఖులంతా రావడం చాలా ఆనందంగా వుంది. రాజమౌళిగారి ‘మగధీర’ చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘ఈగ’ చూసిన తర్వాత ఆయన మీద నాకు వున్న అభిమానం ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాజమౌళిగారు చేస్తున్న ‘బాహుబలి’ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను తెలుగులో ఒక్కటి కూడా స్ట్రెయిట్ మూవీ చెయ్యలేదు. చేద్దామని రెండుసార్లు ట్రై చేసినప్పటికీ కుదరలేదు. అయితే భవిష్యత్తులో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసే ఆలోచన వుంది. ‘ఐ’ సినిమా విషయానికి వస్తే శ్రీరామకృష్ణగారి డైలాగ్స్‌గానీ, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్, సుద్ధాల అశోక్‌తేజ్ చాలా మంచి సాహిత్యం అందించారు. మా హీరో విక్రమ్ గురించి చెప్పాలంటే సినిమా అంటే అతనికి పిచ్చి. డెడికేటెడ్ ఆర్టిస్ట్. డేడికేషన్ ఉన్న నటుడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. ఇక మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా అనుకున్నప్పుడు సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుండాలని ఆయన చెప్పారు. దాంతో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ట్రై చేశాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది.
ఎస్.ఎస్.రాజమౌళి: ప్రేమికుడు చిత్రంలోని ‘ముక్కాలా ముకాబులా’ పాటను చేసి ఆ పాటను ఎలా పిక్చరైజ్ చేశారా అని ఆలోచించేవాడిని. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, మేకింగ్ వీడియో చూసి ఈ సినిమా ఎలా చేశారా అని అనుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్స్ చూసినప్పటికీ ఈ సినిమా కథ ఏమిటో తెలియకుండా బాగా ప్లాన్ చేశారు. శంకర్‌గారు. విక్రమ్ అద్భుతమైన ఆర్టిస్టు. ఒక సినిమా కోసం బాడీ బిల్డ్‌అప్ చేశారు, అలాగే సన్నబడ్డారు కూడా. నిజంగా ఆయన డెడికేషన్ చాలా గొప్పది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను.
విక్రమ్: ఇందులో నేను చేసిన క్యారెక్టర్ల కోసం బరువు పెరగడం, తగ్గడం చేశాను. వాటి కోసం ఎనిమిది నెలలు కష్టపడ్డాను. అయితే ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశానన్న సంతృప్తి నాకు వుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది.
త్రివిక్రమ్: శంకర్‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. విక్రమ్ అద్భుతమైన ఎఫర్ట్‌తో ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
ఎన్.వి.పసాద్: సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో ఆల్ టైమ్ ఆల్‌టైమ్ రికార్డుని క్రియేట్ చేస్తుంది.
సంతానం, జి.రామ్‌కుమార్, ఉపన్ పటేల్, సురేష్ గోపి, మిస్టర్ ఇండియా కామరాజ్, ఓజాస్ రజని ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్, ఎడిటింగ్: ఆంటోని, మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, చంద్రబోస్, ఆనంత్‌శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్: బాస్కో`సీజర్, శోభి, కో ప్రొడ్యూసర్: రమేష్ బాబు, ప్రొడ్యూసర్: వి.రవిచంద్రన్, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.