ట్రెండ్ సృష్టించడంలో.. కొత్త ట్రెండ్ సెట్ చేయడంలో ఇండియా తర్వాతే ఎవరైనా.. ఏ దేశమైనా అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలు చేయలేని పనులను సైతం భారత్ చేసి దమ్ముంటే చూపించింది. అది ఒక్క ప్రయోగాలనే కాదు.. అన్నిరంగాల్లోనూ మరీ ముఖ్యంగా సినీ రంగంలో అది భారత్ సత్తా. అయితే భారత్ చేసిన ఒకటి అర ప్రయోగాలు ఫెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు.. ‘ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే’ అన్నట్లు.. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ లాండర్ ఆచూకీ కనిపించకుండా పోయినంత మాత్రాన ఇండియా ఓడినట్లు అస్సలు కాదు.. కచ్చితంగా గెలుస్తుంది.. గెలిచి తీరుతుందంతే.
అసలేం జరిగింది!?
సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయినట్లు శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మౌనం రాజ్యమేలినట్లైంది. ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలాగా.. మన శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించి సరిగ్గా రోజు గడువక ముందే జాడ కనిపెట్టడం యావత్ భారతావనికి శుభవార్త అని చెప్పుకోవచ్చు.
కొన్ని గంటల్లోనే ఆచూకి దొరికింది..!
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించడంతో ఇస్రో శాస్త్రవేత్తల మోముల్లో మళ్లీ చిరునవ్వులు చిందాయి. చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ఇమేజ్‌ను కనుగొన్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ అధికారికంగా ప్రకటిచడంతో ఇక ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. విక్రమ్ లాండర్‌తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదని.. మళ్లీ లింక్ కావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే త్వరలోనే దీన్ని సాధిస్తామని శివన్ ప్రకటించడం విశేషమని చెప్పుకోవచ్చు.
ఇక్కడ కూడా పాక్ పైత్యం..!
దాయాది దేశమైన అవకాశమొస్తే చాలు.. భారత్‌పై పైత్యం ప్రదర్శించడానికి ముందు వరుసలో ఉంటోంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని తెలుసుకున్న పాక్ మంత్రి ఫవాద్.. ‘డియర్ ఇండియా.. చంద్రయాన్ మిషన్‌పై డబ్బు తగలేయడం, టీ కోసం అభినందన్‌ను సరిహద్దు అవతలకు పంపడం లాంటి పనులు చేయొద్దు’ అని సిగ్గులేని మాటలు మాట్లాడారు. అంతటితో ఆగని ఆయన.. పేద దేశమైన భారత్ చంద్రయాన్ కోసం రూ.900 ఖర్చు పెట్టే బదులు.. టాయిలెట్లు నిర్మించడంపై ఫోకస్ పెట్టాలని విమర్శలు గుప్పించారు.
వాస్తవానికి పాకిస్థానీలు, పలువురు ప్రముఖులు దాదాపు అంతా ఇండియాకు మద్దతుగా నిలవడం విశేషమే.. అయితే అక్కడి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఇలా ఏదో ఒక వివాదం రేపాలని చిల్లర మాటలు మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతున్నారంతే. అయితే ఇండియా ఇప్పుడే కాదు ఎప్పటికైనా గెలుస్తుంది.. గెలిచి తీరుతుందంతే అనే విషయం వాళ్లకు తెలిసి కూడా పైకి మేకపోతు గంభీర్యం అంతే. సో.. ఫైనల్‌గా చంద్రయాన్-02 ప్రయోగమే కాదు.. మున్ముంథు ఎన్ని ప్రయోగాలు చేసిన ఎప్పటికీ ఇండియా గెలుస్తుంది.. గెలిచి తీరుతుందంతే.