విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అని అనగానే అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి F2 అంటూ సంక్రాంతికి చేసిన సందడి అందరి మనసులలో మెదలసాగింది. ఆ పై అనిల్ రావిపూడి ఇంతింతై అన్నట్టుగా సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి తో ప్రేక్షకులని అలరిస్తే, వెంకటేష్ తనదైన శైలిలో వెంకీ మామ, నారప్ప, సైంధవ్‌గా తన ఉనికిని చాటారు. మధ్యలో ఇరువురూ F3 అంటూ అందరిని ఆనందపరిచారు. మరి వీరిరువురు ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో ఏం వినోదాలు అందించారో చూద్దాం.
సంక్రాంతికి వస్తున్నాం స్టోరీ
ఇందులో స్టోరీ ఏం లేదు.. చాలా సింపుల్ స్టోరీ. ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్, అతనిని వెతుక్కుంటూ వెళ్లే అతని సహోద్యోగిని. తీరా చూస్తే పోలీస్ ఆఫీసర్ పెళ్ళై భార్య బిడ్డలతో కనిపిస్తాడు. ఈ ముక్కోణపు కథలో మలుపులు ఏమిటనేది తెరపై చూడాల్సిందే.
సంక్రాంతికి వస్తున్నాం లో ఎవరెలా చేశారంటే..
సంక్రాంతికి వస్తున్నాం తెలిసిన కథే అయినా, కొత్తదనం లేకపోయినా, వెంకటేష్ తన నటనతో అందరిని అలరించాడు. ఇద్దరి భామల మధ్య సందడి చేయడం మన వెంకీ మామకి కొత్తేమి కాదు కాబట్టి తెర మీద తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఈ కథలో వచ్చే కొన్ని సన్నివేశాలలో, వెంకటేష్ విజయవంతమైన చిత్రాలు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మొదలైనవి గుర్తుకు వస్తాయి. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ అర్థాంగిగా, గోదావరి పల్లెటూరి అమ్మాయిగా తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. అన్ని రకాల వైవిధ్యభరిత భరితంగా కళ్ళలో భావాలూ పలికిస్తూ, శృంగారం, సరసం, విరసం, అసూయ అన్ని కలగలిపి తన మాటలతో, ఆహార్యంతో, సంప్రదాయ కట్టుతో ప్రేక్షకులని కట్టిపడేసింది. మీనాక్షి చౌదరి సహోద్యోగిగా, మాజీ ప్రియురాలిగా తన అందంతో, నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చాలా మంది నటులు ఉండగా, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి తమ తమ పాత్రలలో హాస్యం పండించి ప్రేక్షకులని ఆనందపరచడానికి ప్రయత్నించారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరిలియో శ్రావ్యమైన బాణీలు అందించాడు. గోదారి గట్టు పాట చిత్రం విడుదలకి ముందే అందరిని అలరించింది. ఆ పాట తెరపైన కూడా అద్భుతంగా చిత్రీకరించారు. ఆద్యంతం ఆ పాట మధ్యలో, తర్వాత కూడా హాస్యం జోడించి కాస్త వైవిధ్యంగా చూపించారు. ఇతర రెండు పాటలు కూడా చిత్రీకరణ బాగున్నా, అవి కథనంలోని వేగాన్ని తగ్గించాయి. భీమ్స్ నేపధ్య సంగీతం కథకి తగ్గట్టుగా ఉండి, దానికో అందాన్ని తెచ్చిపెట్టింది. సమీర్ రెడ్డి తన ఛాయాగ్రహణంతో చిత్రాన్ని తెరపై ఇంపుగా చూపించాడు. తమ్మిరాజు కూర్పులో అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించినా, పర్వాలేదనిపించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణాత్మక విలువలు చిత్రానికి వన్నె చేకూర్చాయి.
ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్నాం టాక్ ఏంటంటే..
దర్శకుడు అనిల్ రావిపూడి వ్రాసిన కథలో కొత్తదనంలేక సాదా సీదాగా ఉన్నా, తన అనుభవంతో కొత్త సీసాలో పాత సారా అన్నట్టు వాటికి హంగులు అద్ది అన్ని వర్గాల వారిని ఆనందపరచడానికి ప్రయత్నించాడు. వెంకటేష్‌ని ప్రేక్షకులు ఏవిధంగా చూస్తే ఆనందిస్తారో, అలా చూపించి అందరినీ హాస్య డోలికలలో తీసుకెళ్లాడు. వెంకటేష్ మాటలు, చేతలు, ప్రేక్షకులకి పాత వెంకీ మామని గుర్తు చేస్తాయి. అనిల్ రావిపూడి చిత్రంలో బంధాలు, అనుబంధాలు అంటూ భార్య భర్తల బంధం, ప్రియుడు, ప్రేయసి బంధం, కర్తవ్యం, భార్య-ప్రియురాలు మధ్య ఈర్ష్య అసూయలు అన్ని వినోదాత్మకంగా చూపించారు.
అనిల్ కథ తెలిసినదే అయినా, కథనం వేగంగా ఉండటంతో ప్రేక్షకులు అంత పట్టించుకోలేదు. కొన్ని కొన్ని చోట్ల చిన్న పిల్లాడిచేత బూతులు మాట్లాడించడం ప్రేక్షకులని బాధిస్తుంది. అనిల్, జంధ్యాల నుండి స్ఫూర్తి తీసుకున్నారేమో మరి.
చిత్రంలోని హాస్యం తెలిసినదే అయినా, అందరిని నవ్వించడంలో సఫలీకృతుడయ్యాడు. మధ్య మధ్యలో అనిల్ ప్రేక్షకులకి, ఓటిటిల వల్ల జరిగే అనర్ధాలు అవీ బాగానే చెప్పారు. మొదటి సగం అలా అలా ఆనందమయంగా సాగిపోయినా, రెండో సగంలో అదే హాస్య సన్నివేశాలు వచ్చినా అవన్నీ అనవసరంగా జొప్పించినట్లుగా అనిపిస్తుంది. చివర్లో కూడా సాగదీసి గురువులని మరువవద్దని ఒక సన్నివేశాన్ని చూపించి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఫైనల్‌గా.. కొత్తగా ఏం లేదు కానీ.. సరదాగా మాత్రం సంక్రాంతికి నడిచిపోయే సినిమా ఇది.
సినీజోష్ పంచ్‌లైన్: సంక్రాంతికి- సరదాగా చూడొచ్చు
సినీజోష్ రేటింగ్: 2.75/5