Advertisementt

సినీజోష్ రివ్యూ: డాకు మహారాజ్

Sun 12th Jan 2025 12:40 PM
daaku maharaaj  సినీజోష్ రివ్యూ: డాకు మహారాజ్
Cinejosh Review : Daaku Maharaaj సినీజోష్ రివ్యూ: డాకు మహారాజ్
Advertisement
Ads by CJ

డాకు మహారాజ్ 

అఖండ తో ఆరంభమైంది బాలయ్య విజృంభణ

వీరసింహా రెడ్డితో పతాక స్థాయికి చేరింది ప్రదర్శన 

భగవంత్ కేసరితో సమాజానికి సందేశం అందించిన ఆలంబన 

ఐ యాం అన్ స్టాపబుల్ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గా వస్తా అన్నారు. పండగకు కావాల్సిన పసందైన విందు ని తెస్తానన్నారు. 

అయితే సినిమాపై అంచనాలు అంతంత మాత్రమే. 

పాటలకు వచ్చిన స్పందన కొంత మాత్రమే. 

జరగాల్సిన ఈవెంట్ రద్దయ్యింది 

చెయ్యాల్సిన ప్రమోషన్ తక్కువైంది. 

కేవలం బాలకృష్ణ హీరో అనే పేరుతో మాత్రమే చెలామణి అవుతూ వచ్చిన డాకు మహారాజ్ లో హీరోయిన్ ఎవరో నేటికీ ఎవరికీ తెలియదు. విలన్ గా యానిమల్ బాబీ డియోల్ ఉన్నాడని తెలుసు కానీ కాన్ ఫ్లిక్ట్ ఏంటో ఆడియెన్ కి కరెక్ట్ గా కన్వే అవలేదు. 

బ్లాక్ బస్టర్ పాటలేమి లేవు. అబ్బో అనిపించే టీజర్ లు, ట్రైలర్ లు కూడా రాలేదు. 

కానీ మళ్ళీ కేవలం బాలయ్యే ఉన్నాడక్కడ. 

బాలయ్యే జనాన్ని థియేటర్స్ కి రప్పిస్తున్నాడక్కడ. 

వచ్చాడు డాకు మహారాజ్ థియేటర్స్ లోకి, ఏంతెచ్చాడో చూద్దాం, ఏం చూపించాడో చెప్పుకుందాం. వెళదాం డాకు మహారాజ్ సామ్రాజ్యం లోకి, సమీక్ష లోకి.. 

డాకు మహారాజ్ స్టోరీ (ఒక్క కథ కోసం ఎన్నో కతలు పడ్డారు)

గాడ్ ఆఫ్ మాసెస్ గా కీర్తించబడే హీరో ఉన్నపుడు ఆ ఇమేజ్ కి తగ్గట్టే కథ అల్లుకోవాల్సి ఉంటుంది. సదరు హీరో స్థాయికి తగ్గట్టుగానే కథనం నడపాల్సి ఉంటుంది. ఈ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ తోనే కథని డిజైన్ చేసుకున్న దర్శకుడు బాబీ ప్లాంటింగ్స్ అన్ని ఎంత పర్ఫెక్ట్ గా పోస్ట్ చేసుకుంటూ వెళ్లారో పే ఆఫ్ చెయ్యడంలో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అందుకే అనిపించింది ఒక్క కథకి ఎన్నో కతలు పడ్డారని. చాలా మాములుగా మొదలైన కథ ఇంటర్వెల్ కి ముందు ఎంత పరుగులు పెట్టినా ఇంటర్వెల్ తర్వాత అంతే నీరసంగా అందరూ ఊహించేసే విధంగా జరిగిపోవడం సినిమా రేంజ్ ని జారిపోయేలా చేసింది. ఇదో కొత్త కథ అని చెప్పుకోవడానికి లేదు, ఈ కథలోని నవ్యతని, నాణ్యతని ప్రశంసించేలాను లేదు. బాలయ్య వరకు సరిపోయిందంతే, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి కుదిరిపోయిందంతే. 

డాకు మహారాజ్ స్క్రీన్ ప్లే (ఒకే సినిమాని రెండు సినిమాల్లా చూపించారు)

ఎక్కడో మొదలైన సినిమా ఎటెటో వెళుతూ ఉంటుంది. ఎంతో కథ దాగుందనిపిస్తుంది. సినిమా టేకాఫ్ కే ఎక్కువ టైమ్ తీసుకున్న దర్శకుడు బాబీ మొదటి గంట కథనాన్ని ఎత్తుగడలకే పరిమితం చేసారు. స్క్రీన్ పై బాలయ్య హవా చూపిస్తున్నా ఆ వెనుక థమన్ దడదడలాడిస్తున్నా ఆడియన్స్ కి గాని, ఫ్యాన్స్ కి గాని డాకు కథ కనెక్ట్ కావడానికి చాలా టైమ్ పట్టింది. ఇంటర్వెల్ కి 30 నిమిషాల ముందు ఊపందుకున్న డాకు కథనం ఒక్కసారిగా థియేటర్స్ లో పూనకాలు పుట్టిస్తుంది. విజిల్స్ కొట్టిస్తుంది. ఇక ద్వితీయార్ధం మొత్తం ఇలాగే ఉంటే బాక్సాఫీసుకి భంభోళ జంబ అనిపిస్తుంది. 

కానీ ఆ ఆశలు నెరవేరలేదు. అందరూ ఆశించిన బాలయ్య మార్క్ బ్రహ్మాండమైన మాస్ జనానికి అందలేదు. అందుకే సంక్రాంతి బరిలో మరో సమర సింహ రెడ్డి, ఇంకో నరసింహ నాయుడు అవ్వాల్సిన డాకు మహారాజ్ కాస్తా లక్ష్మీ నరసింహా రేంజ్ తో సరిపెట్టుకుంది.  

డాకు మహారాజ్ - బాలయ్య వన్ మాన్ షో (ప్రైమ్ ఫార్మ్ లో వీరంగం ఆడేసారు)

అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తో తన ఎంటైర్ కెరీర్ లోనే ప్రైమ్ ఫార్మ్ లో ఉన్న బాలకృష్ణ డెడికేషన్ కి డెస్టినీ కూడా సపోర్ట్ చేస్తుందేమో అనిపించేలా వరసగా వైవిధ్యమైన కథలు అందుతున్నాయి. అందుకు తగ్గ ఫలితాలే వన్ బై వన్ వస్తున్నాయి. కథ ఎలాంటిదైనా, పాత్ర ఎంతటిదైనా పరకాయ ప్రవేశం చేసేసి పంబ రేగ్గొట్టే బాలయ్య పవర్ డాకు మహారాజ్ లో మరోమారు చూడొచ్చు. 60 ప్లస్ ఏజ్ లోను అన్ స్టాపబుల్ ఎనెర్జీతో ఆయన ఆన్ స్క్రీన్ చెలరేగిపోతుంటే జనమంతా అసంకల్పితంగానే జై బాలయ్య అనేస్తున్నారు. ఆ స్లోగన్ ఎందుకంత పాపులర్ అయ్యిందో ప్రూవ్ చేస్తున్నారు. ఆహార్యం, ఆంగికం, వాచకం వంటి విషయాల్లో నందమూరి కథానాయకులకు ఎంతటి కమాండ్ ఉందో అందరికి తెలిసిందే. అంతేకాదు ఆన్ స్క్రీన్ ఓ కాస్ట్యూమ్ డ్రామాను కన్విన్సింగ్ గా, సెంట్ పెర్సెంట్ కరెక్ట్ గా ప్లే చెయ్యాలంటే నందమూరి అందగాళ్ళకే సాధ్యమవుద్ధి అని స్పష్టంగా చాటి చెప్పింది డాకు మహారాజ్ గెటప్ లో బాలయ్య బాబు ఆడిన వీరంగం. ఫైట్స్ లో బాలయ్య పవర్ ఏమిటో చూస్తూనే ఉన్నాం. డాన్స్ లో బాలయ్య స్పీడ్ కి శెభాష్ అంటూనే ఉన్నాం. మళ్లీ అదే మ్యాజిక్ జరిగింది, మరోమారు నందమూరి అందగాడు గ్రేస్ ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ఇచ్చింది. సినిమాగా అందిన రిజల్ట్ జస్ట్ సరిపెట్టుకునే స్థాయిలోనే ఉన్నా సినిమాకి ఇచ్చే ట్యాగ్ మాత్రం ఇట్స్ బాలయ్య వన్ మ్యాన్ షో. 

డాకు మహారాజ్ మేకింగ్ - బాబీ తడబాటు, థమన్ తోడ్పాటు 

వరసగా విజయాలు వచ్చిపడుతున్నట్టే, విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నట్టే బాలకృష్ణ సినిమాల మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమా సినిమాకి పెరుగుతూ వస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే విజువల్స్ వైజ్, మేకింగ్ వైజ్ భారీ సినిమా డాకు మహారాజ్. నెంబర్ ఆఫ్ షాట్స్, నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అన్నిట్లోనూ అంత కేర్ ఫుల్ గా ఉన్న దర్శకుడు బాబీ గాని, నిర్మాత నాగవంశీ గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కథని కరెక్ట్ గా చెక్ చేసుకుని ఉంటే ఈ సంక్రాంతిని డాకు షేక్ చేసేసి ఉండేది. సినిమా అంతటా భారీతనం ఉంటుంది, కథలో మాత్రం డొల్లతనం కనిపిస్తుంది. లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు ఉన్నారు బాలయ్య మినహా ప్రభావం చూపేవారు కరువయ్యారు. పాటలు వస్తూ వెళుతూ ఉంటాయి. ఊపునివ్వడంలో మాత్రం ఫెయిలవుతాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఘనంగా జరుగుతూ ఉంటాయి ఎమోషన్స్ ను మాత్రం మిస్ అవుతూవుంటాయి. 

బాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ తో తెచ్చుకున్న బాబీ డియోల్ కూడా తెర పై తేలిపోయాడు. ముగ్గురు కథానాయికలున్నా ముచ్చటగా చెప్పుకునే సరైన బాండింగ్ ఏ ఒక్కటి కాకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధానంలో విఫలం ఎదురైంది. నటీనటులందరూ పాత్రల పరిధిమేరకే నటించారు కానీ ఆ పరిధి మరీ మితంగా ఉంది. 

సాంకేతిక నిపుణులందరూ సంపూర్ణ సహకారమే అందించారు కానీ స్ట్రెంగ్త్ లేని కథ వారి ఎఫర్ట్ కి సపోర్ట్ కాలేకపోయింది. ఏది ఎలా ఉన్నా స్క్రీన్ పై ఏం జరుగుతున్నా నేనున్నా వెనుక అంటూ థమన్ మాత్రం తాండవం ఆడేసాడు. బేసిక్ గా బాలయ్య సినిమా అంటేనే ఉద్వేగంతో ఊగిపోయే థమన్ ఆ ఉత్సాహాన్ని ఊపుని సినిమా మొత్తం చూపించాడు. కాదు కాదు స్పష్టంగా వినిపించాడు. నిర్మాత నాగవంశీ క్వాలిటీ వైజ్ అస్సలు కాంప్రమైజ్ కాలేదు కానీ కథ విషయంలో మాత్రం రాజీ పడిపోయారేమో అనిపిస్తుంది. దర్శకుడు బాబీ బాలయ్య బాబు ఎనెర్జీని ఎంత బాగా తెరపైకి తెచ్చారో తాను అనుకున్న కథని అంత పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్ గా ఓ రేంజ్ రిజల్ట్ రావాల్సిన సినిమాని ఓ స్థాయికి సరిపెట్టేశారే అనుకునేలా చేస్తుంది. 

ఫైనల్లీ డాకు టాక్ :

సంక్రాంతి సీజన్ కి కావాల్సిన సంపూర్ణమైన సరంజామా లేదు కానీ.. మరీ నిరాశపరిచి పంపించే సినిమా అయితే కాదు అనేది ట్రేడ్ వర్గాల స్ట్రాంగ్ రిపోర్ట్. ముఖ్యంగా ఇదేమి పాన్ ఇండియా సినిమా కాదు. అందుకోవాల్సిన భారీ పరిధులేం లేవు. అచ్చతెలుగు నందమూరి హీరో తెలుగు ప్రేక్షకుల కోసం చేసిన స్వచ్ఛమైన సినిమా మాత్రమే. అభిమానులను అలరిస్తే చాలు, ఆడియన్స్ తో ఓకె అనిపించుకుంటే అదే పదివేలు. లిమిటెడ్ టార్గెట్ ని లిటరల్ గా రీచ్ అయిపోగలిగే రీజనల్ సినిమా, రీజనబుల్ సినిమా డాకు మహారాజ్ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. బాలయ్య సూపర్ సక్సెస్ ఫుల్ స్ట్రీక్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. 

సినీజోష్ పంచ్ లైన్: అన్ స్టాపబుల్ బాలయ్య 

సినీజోష్ రేటింగ్: 2.75/5

Cinejosh Review : Daaku Maharaaj:

Daaku Maharaaj Telugu Movie Review

Tags:   DAAKU MAHARAAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ