Advertisementt

సినీజోష్ రివ్యూ - గేమ్ చేంజర్

Fri 10th Jan 2025 02:07 PM
game changer  సినీజోష్ రివ్యూ - గేమ్ చేంజర్
Cinejosh Review : Game Changer సినీజోష్ రివ్యూ - గేమ్ చేంజర్
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్ 

నేమ్ చేంజర్ ఫర్ రామ్ చరణ్ (గ్లోబల్ స్టార్ ట్యాగ్ నిలుపుకోవాలి)

ఫేమ్ చేంజర్ ఫర్ శంకర్ (భారతీయుడు 2 మరక చెరుపుకోవాలి)

స్ట్రీమ్ చేంజర్ ఫర్ దిల్ రాజు (ఆర్ధికంగా గట్టెక్కాలి, హిట్టు మెట్టెక్కాలి)

జనరల్ గా ఓ పెద్ద సినిమా పాటలంటే మార్మోగిపోవాలి. కానీ ఇక్కడ మాములుగా ఉన్నాయంతే. 

భారీ బడ్జెట్ సినిమా అంటే ప్రమోషన్లు హోరెత్తిపోవాలి. కానీ ఇక్కడ సాదా సీదాగా ఉన్నాయంతే.. 

టాప్ లేపాల్సిన టీజర్, ట్రైలర్ సో సో గా కనిపించాయి. 

హైప్ పెంచాల్సిన ప్రమోషనల్ కంటెంట్ అంతంత మాత్రమే అనిపించాయి. 

ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు 

ఎందుకు పోస్ట్ పోన్ అవ్వుద్దో అర్ధం కాదు 

ఎప్పటికి వస్తుందో క్లారిటీ రాదు 

ఇన్ని సందేహాల మధ్య ఎన్నో చర్చల నడుమ నలుగుతూ వచ్చిన గేమ్ చేంజర్ ఎట్టకేలకు ఈఏడాది సంక్రాంతికి థియేటర్ల దర్శనం దక్కించుకుంది. సరేమరి, కష్టపడ్డ చరణ్, ఖర్చుపెట్టిన దిల్ రాజు, కసిగా కదిలిన శంకర్ ఎలాంటి సినిమాని తెచ్చారు, ఏం చూపించారు, ప్రేక్షకుల నుంచి వారు ఆశిస్తున్నది ఎంతవరకు పొందగలిగారు. లెట్స్ చెక్.. గేమ్ స్టార్ట్ చేద్దాం.

గేమ్ స్టోరీ (చేంజ్ ఎక్స్పెక్ట్ చెయ్యకండి ఎక్కడా) : 

ఇది క్విడ్ గేమ్ కాదు. మైండ్ గేమ్ కాదు. మహత్తరమైన గేమ్ అసలే కాదు. మాములు గేమ్. మనందరం ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సినిమాల్లో చూసేసిన పరమ రొటీన్ గేమ్. ప్రమోషన్స్ లో ప్రకటించుకున్నట్టుగానే ఓ IAS అధికారికి, ఓ రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధం ఈ మేకర్స్ భాషలో అదే గేమ్. ఈ సినిమాకు అదే నేమ్. కానీ ఆహా ఓహో అంటూ ఎలివేషన్స్ ఇచ్చిన అప్పన్న ఎపిసోడ్ కూడా అతను చేసేదంతా మాకు ముందే తెలుసెహే అని ఆడియన్స్ ఫీలవడంతో సినిమాకి బలమనుకున్న విషయం కాస్తా వీకైపోయింది. అయితే సోకాల్డ్ సినిమాటిక్ లిబర్టీస్, హీరో ఎలివేషన్స్ ప్రేక్షకుడిని బోర్ ఫీలవకుండా చేయడంతో కొత్త చేంజెస్ ఏమి చూపించలేకపోయినా ఈ గేమ్ చేంజర్ గెలిచాడులే అనిపిస్తుంది. అంతే కథ. 

గేమ్ స్క్రీన్ ప్లే (చేంజ్ చూడొచ్చు అక్కడక్కడా) :

ఈ గేమ్ కామ్ గా జరుగుతూ ఉంటుంది. కామన్ గా సాగిపోతూ ఉంటుంది. ఫుడ్ బాల్ గేమ్ లా హై టెన్షన్ ఏం ఉండదిక్కడ. IPL ఫైనల్ లా అద్భుతాలు జరగవిక్కడ. కానీ పక్కా కమర్షియల్ పంథా లో ఈ గేమ్ అందించాలన్న శంకర్ హీరో ఎంట్రీ ఎపిసోడ్ తోనే తన చాకచక్యం చూపించారు. గళ్ళ లుంగీలో కత్తి చేతపట్టి హెలికాఫ్టర్ నుంచి దిగే హీరో మాస్ ఎంట్రీ అభిమానులకి కావాల్సినంత కిక్కిస్తుంది. థియేటర్స్ ని హోరెత్తిస్తుంది. ఆపై వచ్చే మచ్చ మచ్చా సాంగ్ ఫ్యాన్స్ కి రచ్చ చేసుకునే స్కోప్ ఇస్తుంది. కథ ప్రిడిక్టిబుల్ గానే ఉన్నా కథనం జోరుగా జరగడం ఈ గేమ్ కి అతిపెద్ద ప్లస్ పాయింట్. లవ్ స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. కానీ హీరో- హీరోయిన్లు కెమిస్ట్రీ బావుంటుంది. కాన్ ఫ్లిట్ జనరల్ గానే ఉంటుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ జనాలకు నచ్చుద్ది. అందరూ అనుకున్నట్టే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అప్పన్న పాత్రలో రామ్ చరణ్ తో సహా అంజలి కూడా తన నటనతో మెప్పిస్తుంది. చివరికి మరీ గొప్పగా కాకపోయినా మరీ చప్పగా లేదులే అనిపించేలా ఈ గేమ్ ముగుస్తుంది. ఇంతకీ ఈ గేమ్ టీమ్ గేమ్ ని సగర్వంగా గెలుచుకోగలిగారా, అంపైర్స్ ఆడియన్సే. 

గేమ్ చేంజర్ (చేంజెస్ తో చరణ్ చెడుగుడు) :

నిజం లుక్స్ వైజ్ డిఫ్రెంట్ చేంజస్ తో చెడుగుడు ఆడేసిన రియల్ గేమ్ చేంజర్ రామ్ చరణ్. కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తే కరెక్ట్ గా ఉన్నాడనిపిస్తుంది. పోలీస్ యూనిఫామ్ లో చూస్తే పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడనిపిస్తుంది. IAS అధికారిగా భలే సెట్టయ్యాడే అనుకునేలా చేస్తుంది. అప్పన్న ఆహార్యంలో అయితే మెగా వారసత్వం దర్శనమిస్తుంది. ఇలా రకరకాలుగా కనిపించి చకచకా తనపనిని చేసేసిన చరణ్ నటుడిగా కూడా తనలోని గాఢతను ఆన్ స్క్రీన్ చూపించాడు. అందుకే టాక్ తో సంబంధం లేని, రిజల్ట్ తో లింక్ లేని కాంప్లిమెంట్స్ అపొనెంట్ ఫ్యాన్స్ నుంచి కూడా అందుకోగలుగుతున్నాడు. హీరోగా ఈ సినిమా తన స్థాయిని ఏ మేరకు పెంచగలదో ఆ అంచనాలని అభిమానులకి వదిలేద్దాం. నటుడిగా మాత్రం తనికి బాగా ప్లస్ అయ్యే సినిమా అనే సర్టిఫికెట్ ఈ ట్రూ గేమ్ చేంజర్ కి ఇచ్చేద్దాం. 

గేమ్ లీడర్ (విజువల్స్ తో హడావిడి) :

డైరెక్టర్ గా శంకర్ విజన్ కి వంక పెట్టే విమర్శకుడే కాదు మరే దర్శకుడు ఉండడు. కానీ గత కొన్నేళ్లుగా కథకుడిగానే ఆయన తడబడుతున్నారు. భారతీయుడు 2 వంటి బ్లండర్ మిస్టేక్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనలో ఇంకా స్పార్క్ ఉందని తన మార్క్ మళ్లీ చూపాలని పంతం పట్టి పట్టుదలగా చేసిన సినిమా గేమ్ చేంజర్. అయితే ఆ పట్టుదల తనలో ఉంది కానీ కథనంపై తన పట్టు తప్పిపోయిందని తెరపై తెలిసిపోతుంది. విజువల్స్ విషయంలో శంకర్ స్థాయి కనిపిస్తోంది కానీ కథని నడపడంలో ఆయన వీక్ అయ్యారనే విషయం స్పష్టమైపోతుంది. ఎంచుకున్న ఏ నటుడినైనా వివిధ ఆహార్యంలో చూపించి, సదరు హీరో ఫ్యాన్స్ కి పండగ చేసేసే శంకర్ ఇప్పటికీ అదే తీరు చూపిస్తున్నారు కానీ కథలపై శ్రద్దే సరిపోవట్లేదా, సరుకైపోయిందా అనే సందేహాలు కలిగిస్తుంది. రా మచ్చ మచ్చా, థోప్, జరగండి సాంగ్స్ మేకింగ్ లో శంకర్ శైలికి అబ్బురపడతాం. అరుగు మీద, కొండ దేవర పాటలని కథలో మిళితం చేసిన విధానాన్ని మెచ్చుకుంటాం. పాటలపై పెట్టిన ఫోకస్ ఇతర అన్ని అంశాలపై కూడా పెట్టుంటే గేమ్ చేంజర్ నిజంగా బాక్సాఫీస్ రికార్డ్స్ చాలా చేంజ్ చేసేసి ఉండేవాడు. 

గేమ్ మేకర్ (డబ్బులతో దబిడి దిబిడి) : 

దిల్ రాజు దిల్ ఎంత గట్టిదో, ఎంత గట్టిగా కొట్టుకుంటూ ఉంటుందో ఆ చప్పుడు గేమ్ చేంజర్ లో వినవచ్చు. 50 వ సినిమాగా గేమ్ చేంజర్ ని ప్రకటించిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 58 సినిమాల నిర్మాతగా మారాక ఈ సినిమా విడుదలకు వచ్చింది అంటే అంతటి గ్యాప్ ని అందరికి ఆశ్చర్యమనిపించే ఇంతటి నిడివిని, అసహనతని, ఆర్ధిక భారాన్ని మోస్తూ, సహిస్తూ, భరిస్తూ అన్ని క్లిష్టపరిస్థితులను అధిగమించి సినిమాని థియేటర్స్ వరకు తీసుకొచ్చిన దిల్ రాజ్ కెపాసిటికి, క్యాపబిలిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పాన్ ఇండియా స్కెల్ లో ప్రమోట్ చేయలేకపోయారు. తెలంగాణ స్టేట్ లో బెన్ఫిట్ షోస్ తెచ్చుకోలేకపోయారు. అయినా అదే ధైర్యంతో ముందీ గేమ్ చేంజర్ ని జనం ముందుకు తెచ్చేయ్యాలనుకున్నారు. ఫైనాన్షియల్ గా ఈ గేమ్ చేంజర్ రిజల్ట్ వైజ్ ఆయన ప్రాఫిట్స్ లో ఎలాంటి చేంజస్ చూపిస్తుందో బాక్సాఫీసు చూపిస్తుంది. బట్, గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ గా ఆయనకి ట్రేడ్ మొత్తం సాహో అంటుంది. 

గేమ్ టీమ్ (గట్టిగా పట్టారు - ఘనంగా ఇచ్చారు) : 

భారీ బడ్జెట్ సినిమా, భారీ పారితోషికాలు అందుకు తగ్గట్టే భారీగా సమయం వెచ్చించిన గేమ్ చేంజర్ టీమ్ మొత్తం ఘనమైన అవుట్ ఫుట్ నే ఇచ్చారు. ఇదే సినిమా మేకింగ్ లో పెళ్లి కూడా చేసేసుకున్న బాలీవుడ్ పిల్ల కియారా అద్వానీ మూడేళ్ళ షూటింగ్ లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి చెప్పిందే చేసింది. అవసరమైన అందాల ప్రదర్శన చేసేసింది. ఈ గేమ్ కి కియారా చీర్ గర్ల్ అయితే ఛేంజింగ్ గర్ల్ రోల్ అంజలికి దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని మన తెలుగమ్మాయి అందంగా మడతెట్టేసింది. ఎస్ జె సూర్య ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కంటే అసలు సినిమాలో తక్కువ పెరఫామ్ చేసాడే అనిపించింది. కానీ రామ్ చరణ్ - ఎస్ జె సూర్య ల కెమిస్ట్రీ, రామ్ చరణ్ - కియారా కెమిస్ట్రీ కంటే బెటర్ గా ఉందనిపించింది. శ్రీకాంత్ సినిమాలోని అతిముఖ్యమైన పాత్రని అత్యంత లాఘవంగా పోషించాడు. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తళుక్కున మెరిశారు. సీజనల్ కమెడియన్స్ సునీల్, వెన్నెల కిషోర్ ఉన్నంతలో ఎంటర్టైన్ చేసారు. జయరాం, సముద్రఖని, రాజీవ్ కనకాల, నవీన్ చంద్ర వంటి నటులు ఆయా పాత్రలపై తమ ప్రభావం చూపించారు. 

టెక్నీషియన్స్ క్రెడిట్స్ లో ఫస్ట్ తన పేరే రాయాలంటూ, తన గురించే చెప్పాలంటూ థమన్ దద్దరిల్లేలా దరువులేసారు. తిరు సినిమాటోగ్రఫీ శంకర్ విజన్ ని మ్యాగ్జిమమ్ మ్యాచ్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు కథ శంకర్ కి కాస్త అండనిచ్చింది. సమీర్-రుబెన్ ఎడిటింగ్ శంకర్ మూడేళ్ళ చెక్కుడిని, నాలుగు గంటల సినిమాని కుదించడానికి బాగా కసరత్తు చేసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అభినందనలు అందుకునే నైపుణ్యం కనబర్చింది. 

గేమ్ రిపోర్ట్ (అనుకున్నంత లేదు కానీ ఆశాజనకమే) :

ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ ఏమి వినిపించడం లేదు. అలాగని డిజాస్టర్ అనే వాదనలు లేనేలేవు. ఫ్యాన్స్ హ్యాపీ, ఆడియన్స్ ఓకె. క్రిటిక్స్ వైజ్ వీకే, ట్రేడ్ వైజ్ చాల్లే. ఇవే రిపోర్టులు వినిపిస్తున్నాయి. సినిమా సెటిల్ అవ్వగలదు అనే సంకేతాలని ఇస్తున్నాయి. ఓపెనింగ్స్ భారం రామ్ చరణ్ మోస్తున్నాడు. విజువల్ ట్రీట్ శంకర్ ఇస్తున్నాడు. థియేటర్స్ దిల్ రాజు చూసుకుంటున్నాడు. రామ్ చరణ్ స్టార్‌డమ్ గేమ్ చేంజర్ తో ప్రూవ్ కానుంది. సంక్రాంతి సీజన్ గేమ్ చేంజర్ కి వరంలా మారింది. 

పంచ్ లైన్: గేమ్ చేంజర్ - రామ్ చరణ్ ర్యాంపేజ్ 

సినీజోష్ రేటింగ్: 2.75/5

 

Cinejosh Review : Game Changer:

Game Changer Telugu Movie Review

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ