మిస్టర్ బచ్చన్ మినీ రివ్యూ
అన్ లిమిటెడ్ ఎనర్జీ తో మాస్ ని మెప్పించే రవితేజ, అలరించే ఎంటర్ టైనర్స్ తో ఫ్యాన్స్ ని ఒప్పించేసే హరీష్ శంకర్ ల కలయికలో వచ్చింది మిస్టర్ బచ్చన్. ఫస్ట్ ఎటెంప్ట్ లో షాక్ తగిలినా సెకండ్ ఎటెంప్ట్ మిరపకాయ్ తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో పై అభిమాన ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తోడు సాంగ్స్ లోనూ, ట్రైలర్ లోనూ, ఈవెన్ పోస్టర్స్ లోనూ కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే అందాలు కుర్రకారుని అమితంగా ఆకర్షించడంతో మిస్టర్ బచ్చన్ కి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచే సందడి షురూ చేసి నేడు ఘనంగా విడుదలైన మిస్టర్ బచ్చన్ నచ్చాడా, గుచ్చాడా అనే అంశంపై మినీ రివ్యూ.
పాత పాటలు వినిపిస్తూ.. పాత కథనే చూపిస్తూ !!
కొన్ని యథార్థ సంఘటనల ఆధారంతో, ఇన్ కంటాక్స్ రైడ్స్ నేపథ్యంతో వచ్చిన హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ గా రూపొందింది మిస్టర్ బచ్చన్. అయితే గబ్బర్ సింగ్, గడ్డలకొండ గణేష్ వంటి చిత్రాలతో రీమేక్ స్పెషలిస్ట్ గా మారిన హరీష్ శంకర్ ఈ రైడ్ విషయం లోనూ చెలరేగిపోయి చేయి చేసుకున్నారు. మాతృకలో లేని విధంగా చిత్ర ప్రథమార్ధంలో ప్రేమ కథని ఇరికించిన హరీష్ నోస్టాలజీ పేరుతో పాత పాటలు వినిపిస్తూ, పాత కథనే చూపిస్తూ ఇంటర్వెల్ వరకూ బండిని లాక్కొచ్చారు కానీ ఆపై అసలు కథ విషయంలో అస్సలు ప్రభావం చూపలేదు. సెకండ్ హాఫ్ లో అయినా సీరియస్ గా, ఇంట్రెస్టింగ్ గా సాగాల్సిన కథనం ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేక చప్పగా మారిపోవడంతో రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ అనే ఒంటి కాలి బలంతో కుంటుకుంటూ క్లైమాక్స్ కి చేరిన సినిమా మాస్ మహారాజా ఫ్యాన్స్ ని కూడా శాటిస్ ఫై చేయలేకపోయింది.
అదే బలం.. అదే బలహీనత !
రవితేజ - భాగ్యశ్రీ బోర్సే మధ్య లవ్ ట్రాక్, రొమాన్స్, సాంగ్స్ అన్నీ కంటికింపుగానే అనిపించడం ఈ చిత్రాన్ని మెయిన్ ప్లస్ పాయింట్. ఎట్ ది సేమ్ టైమ్ అదే మైనస్ గా కూడా మారింది. అదెలా అంటే, భాగ్యశ్రీ తాజా అందాల ఆవిష్కరణపై అతిగా మోజు చూపించేసి అసలు కథని, అవసరమైన ప్రధాన పాత్రల పవర్ ని పక్కదారి పట్టించేసారు. దాంతో సినిమా స్పాన్ తగ్గింది. యూట్యూబ్ లో పాటల వీక్షణకు స్కోప్ పెరిగింది. రవితేజ నటనకు వంక పెట్టలేం. ఎప్పటిలానే తన బెస్ట్ ఇచ్చారు. భాగ్యశ్రీ అందాలు ఆరబోసింది కానీ అభినయంలో మెరుగుపడాలి. తొలిచిత్రంలోనే ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడాన్ని అభినందించొచ్చు. ఇక జగపతిబాబు తో సహా అందరూ ఏదో పని కానిచ్చేశారు కానీ పటిమ ప్రదర్శించే అవకాశం లేదక్కడ. సాంకేతిక విభాగాలన్నీ సమర్ధవంతంగా పని చేసాయి ఒక్క దర్శకుడు తప్ప. నిర్మాణ విలువల్లో రాజీ లేదు.. దర్శకుడి రాతలో తప్ప. హరీష్ శంకర్ రెగ్యులర్ టెంప్లేట్ ఫాలో అయిపోవడంతో మిస్టర్ బచ్చన్ రొటీన్ గా అనిపించేసాడు ఆడియన్సుకి !
మళ్ళీ ఆ మ్యాజిక్ జరిగేనా ??
ఇదే పీపుల్ మీడియా బేనర్ లో రవితేజ చేసిన ధమాకా సినిమా కంటెంట్ వీకే అయినా పాటలతో, రవితేజ - శ్రీలీల హంగామాతో హిట్టు మెట్టేక్కేసింది. ఈసారి హరీష్ శంకర్ వంటి దర్శకుడు జత కలిసినా కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడడం విచిత్రం. రవితేజ - భాగ్యశ్రీ లే భారం మోసి సక్సెస్ తీరం చేర్చాల్సి ఉన్న ప్రస్తుత తరుణంలో మళ్ళీ ధమాకా వంటి మ్యాజిక్ జరిగేనా ? వేచి చూద్దాం.
పంచ్ లైన్ : మిస్టర్ బచ్చన్ - హరీష్ ఇష్టానికి వండి వార్చెన్
రేటింగ్ : 2.25/5