సినీజోష్ రివ్యూ: కల్కి 2898 AD
బ్యానర్: వైజయంతీ మూవీస్
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోనె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన తదితరులు
సినిమాటోగ్రఫి: డోర్‌డ్జే స్టోజిల్‌కోవిక్
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: అశ్వినీదత్
సహ నిర్మాత: స్వప్న దత్, ప్రియాంక దత్
డైలాగ్స్: నాగ్ అశ్విన్, సాయి మాధవ్ బుర్రా, వివేక్ (తమిళ్)
కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్
రిలీజ్ డేట్: 2024-06-27
సరైన సినిమా కోసం వేచి చూస్తోన్న ప్రేక్షకులు
సాలిడ్ సినిమా కోసం ఆరాటపడుతోన్న సగటు సినీ అభిమానులు
కల్కి వచ్చాడు తన పటిమ చూపించాడు
ప్రేక్షకాభిమానుల దాహం తీర్చేసాడు
TFI బాక్సాఫీసుకి ఊహకందని ఊపుని తీసుకొచ్చాడు
ఓ పెద్ద సినిమా గురించి మనం ప్రస్తావించాల్సిన ప్రతిసారి హీరో పేరుతోనే మొదలు పెడతాం. అదీ అక్కడ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉంటే ఇగ్నోర్ చెయ్యలేం. కానీ కల్కి అనే సినిమా గురించి నాగ్ అశ్విన్ తోనే మొదలు పెట్టాలి. ఇండియా లో రాజమౌళి తప్ప వేరెవరు టేకప్ చెయ్యలేని హ్యాండిల్ చెయ్యలేని ప్రాజెక్ట్ ని మనో ధైర్యంతో తలకెత్తుకొని ముందడుగు వేశారు నాగి. ఏ ఇతర ఫిలిం మేకర్ కలలో సైతం ఊహించలేని ప్రత్యేక ప్రపంచాన్ని తను చూసాడు. ఏ ఇతర ఫిలిం మేకర్ కలలో సైతం కల్పించలేని ప్రభాస్ - అమితాబ్ - కమల్ కలయికని తెరపైకి తెచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. అతని కలని మన ముందు తెరపై చూపించాడు. వెళదాం కల్కి ప్రపంచంలోకి..
కథ: తెలియాలా?
మహాభారత యుద్ధం నుంచి మరో ప్రపంచం ఉద్భవించే వరకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించే కథని మనం నాలుగైదు లైన్లలో రాయలేం.. నయనాలతో చూడాల్సిందే. ఈ కథలో పురాణాల డెప్త్ ఉంటుంది. మనం అందుకోలేనంతటి లెంత్ ఉంటుంది. ఈ సినిమాలో కథని వెతుక్కోవద్దు, కథనంతో కదిలిపోవాలంతే . తెరపై కనిపించే దృశ్యాలతో సాగిపోవాలంతే. అలా అని కథ లేని సినిమా కాదిది. కదలకుండా కట్టిపడేసే కథా కాదిది. ప్లస్సులూ ఉన్నాయి. మైనస్సులూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. అన్నిటిని మించి అందరిని కట్టిపడేసే క్లైమాక్స్ కల్కి ప్రధాన బలం అదే బాక్సాఫీసుకు ఇంధనం.
కథనం: తెలుసుకోవాలా?
రివ్యూలో చెప్పే కథనం కాదిది. రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ చెయ్యాల్సిందే. కొంతమంది ఫస్ట్ హాఫ్ స్లో గా ఉంది అంటుంటారు, అదే కొంతమంది ఇంటర్వెల్ బ్లాక్ భలే ఉంది అంటారు. ఆ కొంతమందే క్లైమాక్స్ సూపర్బ్ అంటారు. ఇదే నాగ్ అశ్విన్ నైపుణ్యం. ఇదే కల్కి కథలోని చాతుర్యం. ప్రభాస్ ఇంటరాక్షన్ ఎపిసోడ్ చాలా హై గా ఆశించిన వాళ్ళకి కాస్త నిరాశ కలిగించొచ్చు. కానీ అదే పిల్లలను బాగా ఆకర్షించే, ఆకట్టుకునే ఎలిమెంట్ అని బహుశా తెలిసుండకపోవచ్చు. ప్రభాస్ కేరెక్టర్ ని ఫ్రమ్ ది బిగినింగ్ సూపర్ హీరోలా చూపించకుండా కామిక్ గా ఇంట్రడ్యూస్ చేసిన నాగ్ అశ్విన్ ఓ వైపు అశ్వద్ధామ అమితాబ్ తోనూ మరో వైపు సుమతి కేరెక్టర్ చేసిన దీపికా తోను స్ట్రాంగ్ ఎమోషన్స్ ని బిల్డ్ చేసాడు. ఈ కల్కి కథనంలో ఇంటర్వెల్ బ్లాక్, భైరవ - అశ్వద్ధామ ఫైట్, క్లైమాక్స్ ఈ మూడు చూడాల్సిందే. అదే కల్కి వినిపించిన గళం, చాటుకున్న బలం.
టీమ్ సాలిడ్ గేమ్ :
ప్రభాస్.. తాను పాన్ ఇండియా స్టార్ అని మరిచిపోయాడు. పూర్తిగా భైరవగా మారిపోయాడు. అమితాబ్ ఆల్ ఇండియా మెగాస్టార్ అనే పదాన్ని పక్కనబెట్టారు అశ్వద్ధామ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా విజృంభించారు. ఆ పాత్రలోనూ తన విలక్షణత చూపించారు. దీపికా పదుకొనె గర్భం దాల్చిన తల్లి పాత్రలో తనని తానే ఊహించేసుకుందో, తనే అనుకుందో ఆ పాత్రకు ప్రాణం పోసేసింది. ఇక ఇతర పాత్రధారులు ఎవరికి వాళ్ళు చెలరేగిపోయారు. అతిధి పాత్రల్లో అలరించిన వాళ్ళు ప్రేక్షకులకు కనువిందు చేసారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ పట్ల విముఖత వినిపిస్తోంది. పాటలే తక్కువున్న సినిమాలో నేపధ్య సంగీతానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడే తక్కువ మార్కులు పడుతున్నాయి సంగీత దర్శకుడికి. ఇదే దశలో సినిమాటోగ్రాఫర్ డోర్‌డ్జే స్టోజిల్‌కోవిక్ ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగు తెరపై తెలుగు సినిమా గర్వించేలా ఓ విజువల్ వండర్ ని ఆవిష్కరించినందుకు అతనికి అభినందనలు చెప్పి తీరాల్సిందే. అలాగే ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్స్ ని కూడా అప్రిషేట్ చెయ్యాల్సిందే. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉడాల్సింది అని మనం కంప్లైంట్ చెయ్యొచ్చు కానీ అది కూడా నాగ్ అశ్విన్ డిజైన్ గానే సరిపెట్టుకోవాలి. ఎందుకంటే కల్కి విషయంలో అందరికంటే ఎక్కువ క్లారిటీ ఉంది నాగ్ అశ్విన్ కే. కల్కి అనే కల కన్నది నాగ్ అశ్వినే. కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ ని కలిపింది నాగ్ అశ్వినే. తన తపన ఈ సినిమా. తన కల ఈ సినిమా. కల్కికి సంబంధించి ప్రతి క్రెడిట్ నాగ్ అశ్విన్ కే చెందాలి అని అమితాబ్, కమల్, ప్రభాస్ లే చెప్పారంటే నాగి దీక్షకి అది నిదర్శనం. నాగి కృషికి ఇది ఫలితం. నిర్మాత అశ్విని దత్ విషయానికొస్తే ఎన్నో దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఖర్చుకు వెనకాడే రకం కాదు. క్వాలిటీ విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. కేవలం మూడో సినిమా చేస్తోన్న నాగ్ అశ్విన్ పై నమ్మకంతో వందలకోట్లు తీసుకొచ్చి పెట్టారు. కథని నమ్మారు, నాగిని నమ్మారు. తన కూతుర్ని నమ్మారు. అందుకు తగ్గ ఫలితాన్ని కల్కి రిజల్ట్ రూపంలో అందుకుంటున్నారు.
ఎనాలసిస్ : ఎందుకెహే !!
బాహుబలిగా దేశ వ్యాప్తంగా అందరికి చేరువైపోయిన ప్రభాస్ పిల్లలందరిని అలరిస్తూనే అభిమానులని ఉర్రుతలూగించే కల్కి గా తెరపైకి వచ్చాడు. అనూహ్యమైన పాత్రతో అద్భుతమైన మాటలతో, కనువిందు చేస్తున్నాడు. అశ్వద్ధామ పాత్రలో అసామాన్యమైన రీతిలో అమితాబ్ చెలరేగిపోయారు. అభినయంతో దీపికా అదరగొట్టింది. అందంతో దిశా పటాని అలరిస్తుంది. ఇక ఈ కల్కికి తిరుగేముంటుంది. బాక్సాఫీసు రికార్డుల వేటలో ఎదురేముంటుంది. వేచి చూద్దాం కొత్త అంకెల కోసం కల్కి సృష్టించే కొత్త సంఖ్యల కోసం.
పంచ్ లైన్: కల్కి - బాక్సాఫీసుకి ధమ్కీ
సినీజోష్ రేటింగ్: 3/5