సినీజోష్ రివ్యూ ఈగల్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ వర్మ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ, మధుబాల తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దేవ్
సినిమాటోగ్రఫీ: కమ్లి శ్లాకి , కరమ్ చావ్లా
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే: మణిబాబు
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల
రచన-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
రిలీజ్ డేట్ 09-02-2024
రెండు, మూడు ప్లాప్ లకు ఒక హిట్ పట్టుకుని కెరీర్ ని నెట్టుకుంటూ వస్తున్నాడు రవితేజ. క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే ఖిలాడీ చేష్టలు చేసి రామారావు గా డ్యూటీ చేసి బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ ఇచ్చాడు. అయితే చలాకి డాన్సుల చిచ్చర పిడుగు శ్రీలీల తో కలిసి చేసిన ధమాకా, స్పెషల్ రోల్ చేసిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య రవితేజకి రిలీఫ్ నిచ్చాయి. కానీ రవితేజ మాత్రం తన రివాజు మళ్ళీ రిపీట్ చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరావు సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ డిజాస్టర్స్ చవి చూసి ఇప్పుడు ఈగల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నేడు రిలీజ్ అయిన ఈగల్ రవితేజతో హ్యాట్రిక్ చేయించిందా.. ప్లాప్స్ లో నుంచి బయటికి తీసుకొచ్చిందా చూద్దాం.. సమీక్షలో..
స్టోరీ ఆఫ్ ఈగల్ :
నళిని(అనుపమ) అనే ఓ జర్నలిస్ట్ రాసిన కథనంతో స్టార్ట్ అవుతుంది ఈగల్. ఆమె రాసిన ఆర్టికల్ చిన్నదే అయినా.. పెద్ద స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ అనేది తెరపైకి వస్తుంది. ఎన్నో ఇన్వెస్టిగేషన్ టీమ్స్, నక్సలైట్స్, తీవ్రవాదులు, విదేశీయులు అందరికి టార్గెట్ గా ఉంటుంది ఈగల్. అసలేమిటా ఈగల్ నెట్ వర్క్. ఒకే ఒక్క వ్యక్తి సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతోన్న ఆ ఈగల్ నెట్ వర్క్ టార్గెట్ ఏమిటి, నళిని ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈగల్ కి తలకోన అడవులకి ఉన్న సంబంధం ఏమిటి. అసలు సహదేవ్ గతమేమిటి ఇదే క్లుప్తంగా ఈగల్ కథ.
స్క్రీన్ ప్లే ఆఫ్ ఈగల్:
ఈమధ్య కాలంలో యాక్షన్ సినిమాల హావ జోరుగా సాగుతుంది అనేది అందరికి తెలిసిందే. ఓ వైపు రాజమౌళి మరోవైపు ప్రశాంత్ నీల్ తాజాగా సందీప్ రెడ్డి వంగా, తమిళ్ లో లోకేష్ కనగరాజ్ విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో విధ్వంశం సృష్టిస్తున్నారు. అదే ప్రభావంతో తొలిసారి మెగా ఫోన్ చేపట్టిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈగల్ ని మోతాదుకుమించి ఎలివేషన్ సీన్స్ తో నింపేశారు. సినిమాలోని ప్రథమార్ధం మొత్తం హీరో కనిపించే స్క్రీన్ స్పేస్ తక్కువైనా హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రం కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అసలు కథ ఆరంభమయ్యేది ఇంటర్వెల్ బ్లాక్ నుంచే. అయితే సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా కథనాన్ని శరవేగంగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ని చాలా పద్దతిగా కంపోజ్ చెయ్యడం ఈగల్ సినిమాకి ప్రధాన బలం. అలాగే క్లుప్తంగా తేల్చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. అన్ని పాత్రలకి సమన్యాయం చేసిన దర్శకుడు విజువల్స్ విషయంలో తనకున్న పట్టుని ప్రదర్శించాడు. BGM పరంగా తన అభిరుచిని చాటుకున్నాడు. క్లైమాక్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసి ఈగల్ కి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చాడు.
ఎఫర్ట్స్ ఫర్ ఈగల్:
సరైన కేరెక్టర్ దొరికితే అలవోకగా చెలరేగిపోయే రవితేజ సహదేవ్ పాత్రలో శివాలెత్తాడు. యాక్షన్ సీన్స్ లో తనదైన ఎనర్జీని చూపిస్తూనే యంగ్ లుక్ లోనూ సరికొత్త గ్రేస్ తో కనిపించి అభిమానులని అలరించాడు. వాటన్నిటిని మించి ఎమోషనల్ సీన్స్ లో విగరస్ పెరఫార్మెన్సుతో విజృంభించాడు. చాలా కాలం తర్వాత నవదీప్ కి ఆన్ స్క్రీన్ మెరుపులు మెరిపించే కేరెక్టర్ దొరికింది. అనుపమ పరమేశ్వరన్ ఈగల్ కథని వెలికి తీసే పాత్రలో సినిమా మొత్తం స్క్రీన్ పై కనిపించే స్పేస్ దక్కించుకుంది. కావ్య థాపర్ సెకండ్ హాఫ్ లో చిన్న పాత్రకే పరిమితమైనా అందంతో ఆకట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ, మధుబాల తదితరులంతా తమ తమ పాత్రలమేరకు అభినయించారు.
ఇక ఈగల్ విషయంలో ప్రధానంగా, ప్రముఖంగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కార్తీక్ ఘట్టమనేని గురించి. కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం మూడు విభాగాలని మోసిన కార్తీక్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ ప్రేక్షకులకి అసలు ఏమాత్రం కలగకుండా ఈగల్ ని తెరపైకి తెచ్చాడు. మెగా ఫోన్ బాధ్యతలని నిర్వర్తించడంలో కాస్త తడబడ్డాడేమో కానీ.. ఓవరాల్ గా మాత్రం రీసెంట్ గా వచ్చిన రవితేజ సినిమాలకంటే బెటర్ ఫిల్మే ఇచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ లో కార్తీక్ శైలి కాంప్లిమెంట్స్ పొందుతుంది. ఖచ్చితంగా తనకి డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. డైలాగ్స్ ఆచితూచి మరీ కొలిచినట్టున్నాయి. దేవ్ నేపధ్య సంగీతం ఈగల్ కి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈగల్ ని అటు మాస్ కి ఇటు క్లాస్ కి నచ్చే స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా తెరపైకి తెచ్చాయి.
ఎనాలసిస్ ఆన్ ఈగల్:
రవితేజ రీసెంట్ ఫామ్, ఫిబ్రవరి రిలీజ్ ఈగల్ ప్రారంభ వసూళ్లపై బాగా ప్రభావం చూపించాయి. అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి భారీగా పెరిగిపోయిన రెమ్యునరేషన్లు, ఫిల్మ్ మేకింగ్ కాస్ట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ అన్ సీజన్ లో ఈగల్ హిట్టు మెట్టెక్కుతుందా అనేది అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. మరి మాస్ క్రౌడ్ పుల్లర్ మాస్ మహారాజ రవితేజ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా రప్పిస్తాడో.. ఏ స్థాయి వసూళ్ళని తెప్పిస్తాడో వేచి చూద్దాం.
సినీజోష్ పంచ్ లైన్: రవితేజ రఫ్ఫాడించాడు
సినీజోష్ రేటింగ్: 2.5/5