Advertisementt

సినీజోష్ రివ్యూ: నా సామిరంగ

Sun 14th Jan 2024 02:42 PM
naa saami ranga  సినీజోష్ రివ్యూ: నా సామిరంగ
Cinejosh Review : Naa Saami Ranga సినీజోష్ రివ్యూ: నా సామిరంగ
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: నా సామిరంగ

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, అన్నపూర్ణ స్టూడియోస్

నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అధిక రంగనాథ్, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు 

ఎడిటింగ్: చోట కె ప్రసాద్ 

మ్యూజిక్: ఎమ్.ఎమ్. కీరవాణి 

సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర 

ప్రొడ్యూసర్: శ్రీనివాస చిట్టూరి 

డైరెక్టర్: విజయ్ బిన్నీ

రిలీజ్ డేట్: 14-01-2024

సినిమాలకు పెద్ద పండుగ సంక్రాంతి. ఎప్పటిలానే ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద నాలుగు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మూడు సినిమాలు విడుదల కాగా, ఈ సంక్రాంతికి చివరి చిత్రంగా కింగ్ నాగార్జున నా సామిరంగ అంటూ బరిలోకి దిగారు. నాగార్జునకు సంక్రాంతి బాగానే కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఆ మధ్య సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా నాగార్జునకు మళ్లీ ఊపిరిపోసింది. దాని సీక్వెల్‌గా సంక్రాంతికే వచ్చిన బంగార్రాజు కూడా మంచి విజయాన్నే అందుకుంది. బంగార్రాజు తర్వాత నాగార్జున చేసిన ది ఘోస్ట్.. టైటిల్ లాంటి ఫలితమే మిగిల్చింది. ఆ సినిమా ఇచ్చిన షాక్‌కి దాదాపు సంవత్సర కాలంగా ఆయన సైలెంట్‌గానే ఉంటున్నారు. మరి గ్యాప్ ఎక్కువవుతుందని భావించారో, ఇది మనం చేయాల్సిన చిత్రమని అనుకున్నారో తెలియదు కానీ.. ఒక మలయాళం సినిమా తీసుకుని.. హడావుడిగా రీమేక్‌కి సిద్ధమై.. రికార్డ్ డేస్‌లో కంప్లీట్ చేశారు. మరో వైపు టీజర్, ట్రైలర్, పాటలు వదులుతూ.. సినిమాకి కావాల్సినంత హైప్‌ని తీసుకొచ్చారు మేకర్స్. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తుండటంతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తుండటం వంటివన్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. మొదటి నుండి సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అనే ఫీల్‌ని ఇచ్చిన ఈ సినిమా.. ఈ బరిలో ఎలాంటి ప్రభావం చూపిందో సమీక్షిద్దామా..

నా సామిరంగ కథ:

కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) అనాథలు. అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రాణంగా కలిసి ఉంటారు. అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అంటే కిష్టయ్యకి అంజికి ఎంతో గౌరవం. కిష్టయ్యని కూడా పెద్దయ్య అంతే ఇష్టంగా చూస్తాడు. ఆ ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ పీడించుకు తినే వరదరాజులు (రావు రమేష్) కూతురు వరాలు అలియాస్ వరలక్ష్మీ (అషికా రంగనాథ్)ని కిష్టయ్య చిన్నప్పటి నుంచే ప్రేమిస్తుంటాడు. కానీ కిష్టయ్య ప్రేమకు వరాలు ఎస్ చెప్పదు. అదే సమయంలో వరాలు తండ్రి వరదరాజులు తన కూతురు వరాలుని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్ కాళ్లరక్కల్)కి ఇచ్చి వివాహం చేయాలని వస్తాడు. పెద్దయ్యకి కిష్టయ్య, వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొడుక్కి చేసుకోవాలనుకున్న వరదరాజులు సంబంధాన్ని వదిలేస్తాడు.. మరి చివరికి కిష్టయ్య వరాలుని దక్కించుకున్నాడా.. ఆ ఊరిలో సంక్రాంతి పండగ సందర్భంగా తలెత్తిన గొడవ ఎలాంటి సమస్యలకి దారి తీసింది అనేది సింపుల్‌గా నా సామిరంగ కథ.

నా సామిరంగ స్క్రీన్‌ప్లే రివ్యూ:

స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మొదటి హీరో.. నా సామిరంగ కథ, కథనంలో కొత్తదనం లేదు. రొటీన్‌గా ఉంటుంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసేశాం అన్నట్లు ఉంటుంది. అయితే కమర్షియల్ ప్యాకేజీగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్నీ చాలావరకు సక్సెస్ అయ్యాడు. సినిమాలో మాస్ కామెడీ మూమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్లు బాగా డిజైన్ చేశారు. నాగార్జున, నరేష్ మధ్య వచ్చే సీన్స్ అన్ని కామెడీగా వర్కౌట్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది.. సెకండాఫ్ ఎమోషన్స్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు.. ఆ భావోద్వేగాలు చాలా వరకు కనెక్ట్ అవడం సినిమాకు కలిసి వచ్చే విషయం.. ఎంటర్టైన్మెంట్ పోర్షన్ మొత్తం నరేష్ చూసుకున్నాడు.. నవ్వించాడు, మధ్య మధ్యలో  ఏడిపించాడు కూడా.. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్‌లో శివ చైన్ రిఫరెన్స్‌కు విజిల్స్ పక్కా.. అయితే కాన్‌ఫ్లిక్ట్స్ బలంగా లేవు. రెండు ఊర్ల మధ్య గొడవ, హీరో & విలన్ మధ్య గొడవకు చూపించిన కారణాలు ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో చూసినట్టు ఉంటాయి. అయినా దర్శకుడు నా సామిరంగాని హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులకి నచ్చుతుంది.

నా సామిరంగ ఎఫర్ట్స్:

కిష్టయ్య పాత్రలో నాగార్జున చెలరేగిపోవడం కాదు.. ఆ పాత్రలో అవలీలగా నటించేశారు. నాగార్జున ఎనర్జీ అదిరిపోయింది.. లుంగీ, షర్టు వేసి గోదావరి యాసలో నా సామి రంగ అంటూ డైలాగ్స్ చెబుతూ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. యాక్షన్ పార్ట్ మాత్రం ఇరగదీశారు నాగ్. నాగార్జునకు ధీటుగా అంజి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు. నవ్విస్తూ, అప్పుడప్పుడు ఏడిపించేశారు. నాగ్, నరేష్ మధ్య డైలాగులు ప్రతి ఒక్కరిని నవ్విస్తాయి. రాజ్ తరుణ్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు.. వరాలు పాత్రలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందంగా కనిపించడంతో పాటు.. చక్కగా నటించింది. నాగార్జున, ఆషిక మధ్య లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. షబ్బీర్ విలనిజం బావుంది. నాజర్, మిర్నా మీనన్, భరత్ రెడ్డి, రవి వర్మ, హర్షవర్ధన్ ఇలా ఎవరికి వాళ్ళే తమ పాత్రల్లో పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. ఈ సినిమాకు కనపడని హీరో కీరవాణి.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్‌ను ఎలివేట్ చేసింది.. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. కెమెరామ్యాన్ దాశరధి శివేంద్ర పల్లెటూరి అందాలని చక్కగా చూపించారు. సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని స్పీడుగా చేయడంతో కొన్ని సన్నివేశాల్లో సీజీ వర్క్ 100 పర్సెంట్ పర్ఫెక్ట్‌గా రాలేదు. ప్రసన్న కుమార్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీనివాసా చిట్టూరి ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు.

నా సామిరంగ ఎనాలసిస్:

నా సామిరంగ సినిమా ప్రారంభానికి ముందే.. మళయాళ సినిమాని రీమేక్ చేస్తున్నారనే విషయం రివీలైంది. దీంతో చాలా మంది ఈ సినిమాని చూసే ఉంటారు. మలయాళంలో సక్సెస్ సాధించిన ఈ సినిమాని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చిన విధానం ఆకట్టుకుంటుంది. మలయాళం సినిమా చూడని వారికి మాత్రం ఒరిజినల్ కథలానే అనిపిస్తుంది. అయితే ఇలాంటి కథతో టాలీవుడ్‌లో చాలానే సినిమాలు వచ్చాయి. అంతేందుకు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన కథ కూడా దాదాపు ఇదే ఛాయలతో ఉంటుంది. స్నేహం, ప్రేమ, గౌరవం, ప్రతీకారం అనే అంశాలను మిక్స్ చేసి.. కోనసీమ ప్రభల తీర్థం నేపథ్యంతో లింక్ చేసి.. రొటీన్ కథకి కొత్తదనం అద్దే ప్రయత్నం చేశారు. మన్మథుడు బిరుదాంకితుడైన నాగార్జున ఇందులోనూ సోగ్గాడే చిన్నినాయన తరహాలో చలాకీగా కనిపించారు. నాగార్జున-అల్లరి నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు, నాగార్జున-ఆషికల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కిక్కిస్తాయి. ఏం జరగబోతోందో ముందుగానే తెలిసిపోవడం మెయిన్ డ్రాబ్యాక్ అయితే.. యాక్షన్ సన్నివేశాల్లో నాగార్జున ఊర మాస్ అవతారం ఈ సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా అయితే పండగ నేపథ్యంలో.. పండగకి వచ్చిన ‘నా సామిరంగ’ డిజప్పాయింట్ చేయదు. సరదాసరదాగా ఉంటుంది కాబట్టి.. సరదాగా ఓసారి చూసేయవచ్చు.  

సినీజోష్ ట్యాగ్‌లైన్: నా సామిరంగ.. వాసి వాడి తస్సాదియ్యా

సినీజోష్ రేటింగ్: 2.75/5

Cinejosh Review : Naa Saami Ranga :

Naa Saami Ranga Telugu Movie Review

Tags:   NAA SAAMI RANGA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ