సినీజోష్ రివ్యూ: టైగర్ నాగేశ్వరావు
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిష్షు సేన్ గుప్తా, మురళీ శర్మ, గాయత్రి భరద్వాజ్, నాజర్ తదితరులు
సినిమాటోగ్రఫి: ఆర్ మధి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
రచన, దర్శకత్వం: వంశీ నిర్మాత:
రిలీజ్ డేట్: 20-10-2023
ధమాకా వంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో సేఫ్ గా సాగిపోయే ఛాన్స్ ఉన్నప్పటికి.. ఈమధ్య మాస్ మహారాజ రవితేజ భిన్నమైన కథలపై మనసు పడుతున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర వంటి సినిమాలు షాక్ ఇచ్చినా కొత్త తరహా కథలను మాత్రం వదలనని చాటుకుంటూ రవితేజ చేసిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970 కాలంలో సంచలనం సృష్టించిన స్టూవర్టుపురం బందిపోటు నాగేశ్వరరావు ఇతివృత్తాన్ని తెరపైకి తెచ్చిన ఈ పీరియాడిక్ డ్రామాలో తనకు లభించిన ఛాలెంజింగ్ రోల్ ని ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసారు రవితేజ. మరి తన కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా ఫిలింగా రూపొందిన ఈ టైగర్ హంటింగ్ ఎంత ఇంటెన్స్ గా అనిపించిందో, ఆడియన్సుని ఏ మేరకు ఇంప్రెస్ చేసిందో సమీక్షలో చర్చించుకుందాం.!
స్టోరీ:
ఏదైనా దొంగతనం చేసే ముందు చెప్పి మరీ చేయడం స్టూవర్టుపురం నాగేశ్వర రావు (రవితేజ)ప్రత్యేకత. ఎనిమిదేళ్ళ వయసులో తండ్రి తల నరకడం నుంచి మొదలు పెడితే.. ప్రధాని ఇంటికే దొంగతనానికి వెళ్లడం, ఎమ్మెల్యే యలమంద (హరీష్ పేరడీ), సీఐ మౌళి (జిష్షు సేన్ గుప్తా) ప్రాణాలు తీసే వరకు నాగేశ్వర రావు జీవితంలో ఏం జరిగింది? అసలు నాగేశ్వరావు చిన్నప్పుడే తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అతని జీవితంలో సారా, మణి ల పాత్ర ఏమిటి? దోచుకున్న డబ్బుతో నాగేశ్వరావు ఏం చేసాడు అనేది పూర్తి కథ.
స్క్రీన్ ప్లే:
సినిమా మొదలు కావడమే దొంగతనాలతో మొదలు పెట్టారు. దొంగతనం, దోచిన డబ్బు మీద కన్నేసిన శత్రువుల మీద ఊచకోత. వ్యక్తిగత జీవితం. చిన్నప్పుడే తండ్రి తల నరకడం గానీ, ట్రైన్ రాబరీ సీన్ గానీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ నాగేశ్వరావు లైఫ్ లో వచ్చే ప్రేమకథ ఆసక్తిగా లేదు. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పటికి.. సన్నివేశాల్లో బలం కనిపించకపోవడంతో సాదాసీదా మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత గజదొంగలో మంచి మనిషి మీద కథలో ఫోకస్ చేయడంతో వేగం మరింత తగ్గింది. కథను ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నంతో సరైన ట్రాక్‌పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. దీనిలో కూడా కొన్ని సీన్లు బాగుంటే.. మరికొన్ని సీన్లు బలహీనంగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో రిపీట్ షాట్స్ వేయడంతో నిడివి పెరిగి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిందనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో బలమైన సంఘర్షణ కనిపించలేదు. రవితేజ ఆశయాన్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా క్లైమాక్స్ లేదు. ఓవరాల్‌గా సినిమా ఎమోషనల్ పాయింట్‌తో, హై ఎనర్జీతో ముగించడం వల్ల అప్పటి వరకు ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి కాస్త ఉపయోగపడింది.
ఎఫర్ట్స్:
రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో తన మార్కు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. డైలాగ్ డెలివరీ విషయంలో కాస్త తేడాగా అనిపిస్తుంది. నూపుర్ సనన్ తన పాత్ర పరిధి తగినట్టుగా ఫెర్ఫార్మ్ చేసింది. గాయత్రి భరద్వాజ్ క్లైమాక్స్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించింది. ముందు నుంచి హైప్ క్రియేట్ చేసిన రేణు దేశాయ్ హేమలత లవణం పాత్ర నాలుగైదు సీన్స్ కే పరిమితమైంది. హరీష్ పేరడి, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఇతరుల తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
టెక్నీకల్ గా జీవీ ప్రకాశ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది.. BGM కొన్ని సన్నివేశాల్లో బావుంది అనిపించినా.. చాలా చోట్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఆర్ మధి సినిమాటోగ్రఫి ఈ సినిమాకి ప్లస్ పాయింట్. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ఉండే ఈ కథకు ఫీల్ కలిగించడానికి ఉపయోగించిన కలర్ టోన్ బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపించింది. సెకండ్ హాఫ్ నిడివి విషయంలో జనాలు గోల పెట్టేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు.
దర్శకుడు వంశీ ఎంచుకొన్న పాయింట్.. ఆ పాయింట్ కథగా విస్తరించిన తీరు.. రాసుకొన్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. కాకపోతే రైటింగ్ పార్ట్ ఇంకా బెటర్‌గా ఉండి ఉంటే మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. విలనిజం బలంగా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో రివేంజ్ డ్రామా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా కథను కథగా చెప్పాలనే దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.
ఎనాలసిస్: రీసెంట్ టైమ్స్ లో రవితేజ పెరఫార్మెన్స్ తో పేకాడేసిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. ప్రాజెక్ట్ సెటప్ పక్కాగా కుదిరింది. యాక్షన్ దేనికదే అన్నట్టు అదిరింది. అయితే ఫస్ట్ హాఫ్ వరకు పరుగులు తీసిన టైగర్ సెకండాఫ్ లో మాత్రం నీరసంగా మారిపోయి ప్రేక్షకులకు భారంగా అనిపించాడు. 3 గంటలు దాటేసిన రన్ టైమ్, కథకు అస్సలు అతకని రొమాంటిక్ ట్రాక్, ఉదృతంగా ఉన్న వైలెన్స్, విజువల్స్ కి కావాల్సిన ఎఫెక్ట్ ఇవ్వలేకపోయిన BGM, పూర్ VFX సగటు ప్రేక్షకుడు పెదవి విరిచేలా చేసాయి. మరిలా మిక్సడ్ టాక్ తో స్టార్ట్ అయిన టైగర్ ని రవితేజ క్రేజు, ఇమేజు ఎక్కడివరకు తీసుకెళతాయో, బాక్సాఫీస్ వద్ద ఎంతటి వసూళ్లు రాబడతాయో వేచి చూద్దాం.!
సినీజోష్ రేటింగ్: 2.25/5
పంచ్ లైన్: పస తగ్గింది - నస పెరిగింది