సినీజోష్ రివ్యూ: రంగబలి
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, మురళి శర్మ తదితరులు
మ్యూజిక్: పవన్ సీహెచ్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
రిలీజ్ డేట్: 07 -07- 2023
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీకి వచ్చి వరస సినిమాలు చేస్తూ సక్సెస్ ని వెతుక్కుంటున్న హీరో నాగ శౌర్య. మధ్య మధ్యలో ఓన్ బ్యానర్ లోను అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడితో రంగబలి అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో దిగిపోయాడు. కొత్త హీరోయిన్ యుక్తి తరేజాతో జత కట్టిన నాగ శౌర్య రంగబలి ప్రమోషన్ విషయంలో కొత్త వరవడికి నాంది పలికాడు. డిఫరెంట్ ప్రమోషన్స్ అంటూ కొంతమంది మీడియా ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ కమెడియన్ సత్యతో చేయించిన ఇంటర్వ్యూలు అందరిని ఆకర్షించడం, రంగబలి ట్రైలర్ హిట్ అవ్వడంతో రంగబలిపై నాగ శౌర్యకి, నిర్మాతలకి కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే విడుదలకి ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇన్ని ఆర్భాటాల మధ్యన నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగబలి విషయమేమిటో సమీక్షలో చూసేద్దాం..
రంగబలి స్టోరీ రివ్యూ:
బీ ఫార్మసీ చదివిన శౌర్య (నాగశౌర్య)ది రాజవరం. మెడికల్ షాప్ పై వచ్చే సంపాదనతోనే శౌర్య తండ్రి(గోపరాజు రమణ) కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉంటాడు. శౌర్యకి గొడవలంటే ఇంట్రెస్ట్. బీ ఫార్మసీ చదివిన కొడుక్కి మెడికల్ షాప్ అప్పగించాలని శౌర్య తండ్రి ప్లాన్. కానీ శౌర్య రాజవరం సెంటర్ నిండా ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో)తో దిగిన కటౌట్స్ పెట్టి తిరుగుతూ ఉంటాడు. తండ్రి బలవంతం మీద శౌర్య తన తండ్రి కి ఫ్రెండ్, డీన్ అయిన మెడికల్ కాలేజీలో ఫార్మసీ ట్రైనింగుకు వెళతాడు. అక్కడే సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. సహజ తండ్రి (మురళీ శర్మ) శౌర్య వాళ్ళ ప్రేమ, పెళ్ళికి ఓకే చెబుతాడు. కానీ శౌర్యది రాజవరం అని తెలిసి తన కూతురుతో ఆయన పెళ్ళికి అంగీకరించడు. శౌర్య, సహజ పెళ్లికి రాజవరం రంగబలి సెంటర్ కి ఉన్న లింక్ ఏమిటో అనేది క్లుప్తంగా రంగబలి పూర్తి కథ.
రంగబలి ఎఫర్ట్స్:
నాగ శౌర్యకు క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కొత్తేమీ కాదు. ఎనర్జిటిక్ లుక్స్‌తో క్లాస్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌లతో మాస్ ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉంది. రంగబలిలోనూ శౌర్య కేరెక్టర్ లో పర్ఫెక్ట్ లుక్స్ తో కనిపించాడు. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ ఇలా అన్నిట్లో నాగ శౌర్య టాలెంట్ కనిపిస్తుంది. హీరోయిన్‌గా యుక్తి తరేజ గ్లామర్ గా ఆకట్టుకుంది. కథలో ట్రెడిషనల్ గాను, సాంగ్స్ లో గ్లామర్ చూపించింది. ఇందులో హీరో తర్వాత చెప్పుకోవాల్సిన కేరెక్టర్ కమెడియన్ సత్యది. సత్య వన్ మ్యాన్ షో చేసాడు. ఓ రకంగా సత్య ఈ సినిమాను గట్టెక్కించే ప్రయత్నం చేసినట్టే. తన కామెడీతో అందరినీ నవ్విస్తాడు. షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో తేలిపోయాడు. గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్, శరత్ కుమార్, మురళీ శర్మ ఇలా అందరూ తమ పాత్రలు చక్కగా పోషించారు.
రంగబలి టెక్నీషియన్స్ ఎఫర్ట్స్:
కథకి తగ్గ టెక్నీషియన్స్ దొరికారు అనేలా రంగబలి టెక్నీషియన్స్ పని తీరు ఉంది. రంగబలికి పవన్ సిహెచ్ అందించిన స్వరాలకు సరైన ప్లేస్‌మెంట్ లేదు. ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో వారికే తెలియాలి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. దివాకర్ మణి కెమెరా వర్క్ కమర్షియల్ మూడ్ తీసుకొచ్చింది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు ఇంటర్వెల్ ముందు కన్నా, తర్వాత చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ టెంపో సెకండ్ హాఫ్ లోను కంటిన్యూ అయ్యుంటే రిజల్ట్ బ్లాక్ బస్టర్ అనేలా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు పవన్ బాసంసెట్టి కొత్త కథనే తీసుకున్నాడు కానీ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, కథను నడిపించిన తీరు సరిగ్గా లేదు. ప్రథమార్ధంలో హీరో ఎలివేషన్ సీన్స్, కామెడీని బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు పవన్.. సెకండ్ హాఫ్ లో యాక్షన్ అండ్ ఎమోషన్స్ ని క్యారీ చెయ్యడంలో పూర్తిగా విఫలయ్యాడు.
రంగబలి విశ్లేషణ:
రంగబలి సినిమా కంటెంట్ ఎలా ఉంది అనేది ట్రైలర్ లో పరిచయం చేసి.. ప్రమోషన్స్ తో దానిని పీక్స్ కి తీసుకెళ్లిన నాగ శౌర్య-పవన్ బాసంశెట్టి.. థియేటర్స్ లో మాత్రం ఆ హవా కొనసాగించలేకపోయారు. కథ, కథనం ఎలా ఉన్నా సరే... కామెడీ కరెక్టుగా వర్కవుట్ అయితే నవ్వుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన సామజవరగమన. కమర్షియల్ కథల్లో కామెడీని మిక్స్ చేయడం ఓ ఆర్ట్. కొందరు దర్శకులకు ఆ టెక్నిక్ తెలుసు. రంగబలిలో శౌర్య, సత్య సీన్స్ చూసినప్పుడు కొత్త దర్శకుడు పవన్ బాసింశెట్టిలో ఆ టాలెంట్ ఉందనిపించింది. రంగబలి స్టార్ట్ అవడం నుంచి ఇంటర్వెల్ వరకు కామెడీతో పరుగులు తీసింది. ఇంటర్వెల్ తర్వాత సీన్స్ వస్తుంటే.. ఫస్టాఫ్ తీసిన దర్శకుడే సెకండాఫ్ కూడా తీశాడా..లేదంటే మరొకరు డైరెక్ట్ చేశారా.. అనే అనుమానం కలుగుతుంది. రంగా ఫ్లాష్ బ్యాక్‌ను కూడా ఏమంత ఆసక్తిగా మల్చలేదు. ఇలాంటి కథలు ఎన్నోసార్లు చూశామే అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక క్లైమాక్స్‌లో హీరో చేత చెప్పించే సందేశాలు, నీతులు జనాలకు ఎక్కడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కి తగ్గట్టుగా ఎమోషన్ కూడా పండినట్టయితే ఈ రంగబలి నెక్ట్స్ లెవెల్ లో ఉండేది.
రేటింగ్: 2.0/5