Advertisementt

సినీజోష్ రివ్యూ: ఆదిపురుష్

Sun 18th Jun 2023 12:22 PM
adipurush telugu review  సినీజోష్ రివ్యూ: ఆదిపురుష్
Adipurush Telugu Review సినీజోష్ రివ్యూ: ఆదిపురుష్
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: ఆదిపురుష్ 

నిర్మాణం: యు.వి.క్రియేషన్స్ అండ్ టి.సిరీస్

నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, దేవ్ దత్తా, సన్నీ సింగ్, సోనాలి చౌహాన్ తదితరులు

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 

సంగీతం: అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం: సంచిత్ - అంకిత్ 

కూర్పు: అపూర్వ - ఆశిష్ 

ఛాయాగ్రహణం: కార్తీక్ పళని 

నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రమోద్, వంశీ మరియు ఓం రౌత్ 

దర్శకత్వం: ఓం రౌత్ 

విడుదల తేదీ: 16-06-2023

ఆరంభం: 

ఫస్ట్ అనౌన్స్ మెంట్ నుంచే ఆదిపురుష్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఫస్ట్ గ్లిమ్ప్స్ రాగానే ఆ ట్రెండింగ్ కాస్తా ట్రోలింగ్ లా మారింది.  

విమర్శలు చుట్టుముట్టాయి.. వెక్కిరింతలు వెల్లువెత్తాయి. 

రిలీజ్ వాయిదా పడింది.. క్వాలిటీపై జాగ్రత్త పెరిగింది. 

ఇక టీజర్ రిలీజ్ నుంచి కొంచెం కొంచెం ఆకట్టుకుంటూ,

పాటలతో, పోస్టర్లతో ప్రచారం కొనసాగిస్తూ వచ్చిన ఆదిపురుష్ టీమ్ 

ట్రైలర్ తో మాత్రం శెభాష్ అనిపించుకుంది.. భారీ ఓపెనింగ్స్ కి బాటలు వేసింది.

మరిక ప్రభాస్ ని రాఘవునిగా, కృతిసనన్ ని జానకిగా, సైఫ్ అలీఖాన్ ని లంకేశునిగా చూపిస్తూ బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ మలిచిన ఈ మోడ్రన్ రామాయణం నేడు విడుదలైన నేపథ్యంలో... ఆదిపురుష్ టీమ్ ప్రయత్నాలు - అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు ఫలించాయో సమీక్షలో చూద్దాం.!

ఆంతర్యం: 

భారతీయుల పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని ఈనాటి ఆధునిక సాంకేతిక సొబగులతో.. ఈతరం పిల్లలకు ఆకర్షణీయంగా చూపించాలని చేసిన ప్రయత్నమే ఆదిపురుష్. అందుకుగాను ఏడు కాండములు కలిగిన వాల్మీకి రామాయణం నుంచి అరణ్య కాండను, యుద్ధ కాండను ఎంచుకుని కాస్త కాల్పనికతను సైతం జోడిస్తూ ఈ కథనం సిద్ధం చేసుకున్నారు దర్శకుడు ఓం రౌత్. ఈ రెండే ఎందుకూ అంటే అందులోనూ ఓం రౌత్ కి  ఓ ప్రత్యేక కారణం వుందిలెండి. సీతాపహరణం నుంచీ రాముడు ఎదుర్కునే ఎడబాటు, జానకి చూసే ఎదురుచూపులు, ఆ సంఘర్షణ ఫ్యామిలీ ఆడియన్సుకి కనెక్ట్ అయితే.. యుద్ధ సన్నివేశాలతో ఈ జనరేషన్ ఆడియన్సుని ఇంప్రెస్ చేసేస్తే ఆదిపురుషునికి అఖండ నీరాజనం దక్కుతుంది అనేది దర్శకుని ఆలోచన. ఎలాగూ పురుషోత్తముడైన శ్రీ రాముని చరితం సుపరిచితము, లోకవిదితమే కనుక కథగా కాకుండా ఆదిపురుష్ రూపకల్పన ఆంతర్యాన్ని విశ్లేషించడం జరిగింది. ఇక ఈ ప్రయత్నంలో ఒప్పులెన్నో.. తప్పులెన్నో.. మెప్పులెన్నో ఇప్పుడు చర్చిద్దాం.!

అస్త్రబలం:

భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ ని గెలిచేందుకు వచ్చిన ఆదిపురుష్ బిగ్ స్క్రీన్ పైనే చూసి తీరాల్సిన విజవల్స్ ని ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నాడు. ప్రభాస్ ఇంట్రో సీన్, సీతాపహరణం సీన్, రావణుడి సర్ప మర్దన సీన్, హనుమాన్ లంకా దహనం సీన్ వంటివి దర్శకుడి ఆధునిక ఆలోచనా ధోరణికి అద్దం పడితే.. జఠాయువు ఎపిసోడ్, వాలి-సుగ్రీవుల ఫైట్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ వంటివి VFX విభాగానికి ఛాలెంజ్ విసిరాయి. పాటలు ఫర్లేదనిపించాయి.. మాటలు అనువాదంలా వినిపించాయి. ప్రీ ఇంటర్వెల్ - ప్రీ క్లయిమాక్స్ దృశ్యాలు రాముని ఔన్నత్యాన్ని చాటే కంటెంట్ తో ఆకట్టుకున్నాయి. వేగంగా సాగిన ప్రథమార్ధం.. ఆద్యంతం ఆకట్టుకున్న ప్రభాస్ ఆహార్యం ఆదిపురుష్ కి అసలైన బలంగా నిలిచాయి.

అంగ బలం: 

అజయ్ - అతుల్ స్వరపరిచిన పాటలు వినేందుకు శ్రావ్యంగా, చూసేందుకు రమ్యంగానే ఉన్నా జానకీ - రాఘవుల బంధాన్ని, వారి అనుబంధంలోని గాఢతని సరిగా చూపించ లేకపోయాయి. సందర్భోచితంగాను లేవనిపించాయి. సంచిత్ - అంకిత్ ల నేపథ్య సంగీతం మాత్రం ఆదిపురుష్ కి అండగా నిలబడింది. అవకాశం ఉన్నంతలో సాయం అందించింది. అపూర్వ - ఆశిష్ ల కూర్పు బహుశా దర్శకుని ఆదేశానుసారమే జరిగి ఉంటుంది కనుక లెంగ్త్ విషయంలో వచ్చే విమర్శలు వాళ్ళే పంచుకుంటారు. పాటలు - మాటలు అనువాదంలా అనిపించాయనే ఆరోపణలని రచయితలు ఎదుర్కుంటారు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం మాత్రం తన బాధ్యత నిర్వర్తించింది.. నిర్మాతల బృందం అయితే ఆర్ధికంగా సాహసమే చేసింది. దర్శకుడు ఓం రౌత్ ఆలోచన అభినందనీయమే కానీ ఆవిష్కరణలోనే తడబడ్డారు. ఓవైపు తన విజువలైజేషన్ తో మెస్మరైజ్ చేస్తూనే.. మరోవైపు పడుతూ లేస్తూ సాగే కాల్పనిక దృశ్యాల కథనంతో ఈ మోడ్రన్ రామాయణాన్ని రోలర్ కోస్టర్ రైడ్ లా మార్చేశారు. 

అవలోపం:

అందరూ ఆరాధించే గాథే అయినా, అంతటి భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆదిపురుష్ కి ఆశించిన స్థాయి స్పందన లేదంటే కథనంలోని అవలోపాలే కారణమని చెప్పాలి. రాఘవుని మొదటి సన్నివేశాన్ని మాస్ హీరో ఇంట్రోలా మలచడం కమర్షియల్ కాలిక్యులేషన్ అని సరిపెట్టుకోవచ్చు కానీ జానకీ సంహారమనే దృశ్యం ఎంతటి మాయే అయినప్పటికీ అస్సలు రుచించదు. అసలు జానకీ - రాఘవుల ఎడబాటులోని గాఢమైన సంఘర్షణే కనిపించదు. సెట్ రెడీ అయ్యాక షూట్ కి వెళదాంలే అన్నట్టు రాముడు ప్రవర్తిస్తుంటే - షెడ్యూల్ టైముకి ప్రభాస్ వచ్చేస్తాడులే అని కూర్చున్న కృతిసనన్ లా కనిపిస్తుంది అశోకవనంలోని జానకి. రామ లక్ష్మణుల బంధము.. రామాంజనేయుల అనుబంధము కూడా అంతే కృతకంగా అనిపిస్తాయి. ఇక రావణుడైతే దశ కంఠాలని రెండు లైన్స్ గా డివైడ్ చేసుకుని మోడరన్ హెయిర్ స్టైల్స్ తో వింతగా ఉంటాడు.. విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు. పూర్తిగా ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిన ఆదిపురుష్ కి హడావిడిగా చేసేసిన యుద్ధ సన్నివేశాలు కూడా మైనస్ గానే మారాయి. రాక్షస సంహారమంతా హాలీవుడ్ సినిమాల స్టైల్ లో చేసిన హంగామాలా ఉంటుంది. ముఖ్యంగా రావణ సంహారం మరీ చప్పగా, మమ అనిపించేసినట్టుగా ముగుస్తుంది. అన్నట్టు.. అసలీ కథనానికి రాముడు వనవాసానికి కదిలే దృశ్యాలు అవసరమే లేదు. అది పెట్టడమే బ్యాడ్ అనుకుంటే ఆ పోర్షన్ లో ప్రభాస్ లుక్ వెరీ వెరీ బ్యాడ్ అని రెబెల్ ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. 

అభినయం:  

ఆదిపురుష్ చిత్రానికి అండ దండా, ఆకర్షణా అన్నీ ప్రభాసే. సాటి లేని వీరత్వం కలిగి ఉన్నా మేటి నడవడికతో సాగే ఇలవంశోత్తముని పాత్రలో హుందాగా ఒదిగిపోయారు ప్రభాస్. మృదు స్వభావి - స్వల్ప సంభాషి అయిన ఆ శ్రీరాముని పాత్రలో చాలా బ్యాలన్సుడ్ గా పెర్ ఫార్మ్ చేసిన ప్రభాస్ వానర సేనకు దిశానిర్దేశం చేసే సమయంలో మాత్రం తన గళాన్ని గట్టిగా వినిపించారు. అయితే ఆ సన్నివేశం బాహుబలిని తలపించిందే తప్ప అక్కడ రాముడు కనిపించలేదంటే కారణం దర్శకుడే. మొత్తానికైతే తనవరకూ తన ఆహార్యంతో, అభినయంతో, హావభావాలతో ఆదిపురుష్ కి ప్రాణం పోశారు ప్రభాస్. జానకి గా కృతిసనన్ ఓకే అనిపిస్తుందే తప్ప ఓహో అనిపించేలా అయితే లేదు. భారీకాయుడైన రాక్షస రాజు రావణుడి బాడీ లాంగ్వేజ్ చూపించడంలో సైఫ్ అలీఖాన్ సగం సగమే సక్సెస్ అయ్యారు. ఆ లంకేశుని పాత్రకు మన రవి శంకర్ డబ్బింగ్ మాత్రం బాగా సూట్ అయింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్ గా దేవ్ దత్తా, మండోదరిగా సోనాల్ చౌహన్ తదితర తారాగణం అంతా వారికి వీలైన తీరులో నటించేసారు. ఒక్క ప్రభాస్ తప్ప మరే తెలుగు ఆర్టిస్టు ఆదిపురుష్ తారాగణంలో లేకపోవడం గమనార్హం.

అభిప్రాయం: 

నిజానికి ఆదిపురుష్ మరీ తిరస్కరించాల్సిన సినిమా కాదు. అలాగని కట్టిపడేసే కథనమూ లేదు. ఆధునిక సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నా.. వానరులకైనా సరైన రూపాలు సృష్టించలేకపోవడం, పిల్లల్ని విజువల్స్ తో మెప్పించాలనే ప్రయత్నంలో మరీ వీడియో గేమ్ ట్రిక్స్ కి ఫిక్స్ అయిపోవడం వంటివి అద్భుత విజయం వైపు ఆదిపురుష్ వేయాల్సిన అడుగులకు అడ్డం పడ్డాయి.. అవరోధంగా నిలిచాయి. ఎటెంప్ట్ లో సిన్సియారిటీ ఉన్నప్పటికీ - ఎగ్జిక్యూషన్ లో ఎఫీషియన్సీ మిస్ అవడం ఆదిపురుష్ మిక్సెడ్ టాక్ కి మెయిన్ రీజన్ అనేది ట్రేడ్ టాక్. చూద్దాం.. ఫస్ట్ గ్లిమ్ప్స్ కి నెగెటివ్ టాక్ వచ్చినా రిలీజ్ టైమ్ కి హ్యూజ్ క్రేజ్ అండ్ హైప్ తెచ్చుకున్న ఆదిపురుష్ ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో.. జై శ్రీరామ్ నినాదంతో అనూహ్యంగా పుంజుకుంటుందేమో.!! 

సినీజోష్ రేటింగ్: 3/5

పంచ్ లైన్: రమ్యత లోపించిన రామాయణం

 

 

 

Adipurush Telugu Review:

Cinejosh Telugu Review: Adipurush

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ