Advertisementt

సినీజోష్ రివ్యూ: విరూపాక్ష

Sun 30th Apr 2023 02:17 PM
virupaksha review  సినీజోష్ రివ్యూ: విరూపాక్ష
Cinejosh Review: Virupaksha సినీజోష్ రివ్యూ: విరూపాక్ష
Advertisement

సినీజోష్ రివ్యూ: విరూపాక్ష 

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర - సుకుమార్ రైటింగ్స్ 

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్, రాజీవ్ కనకాల, సాయిచంద్, కమల్ కామరాజు తదితరులు 

ఎడిటింగ్ : నవీన్ నూలి 

సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ 

మ్యూజిక్ : అజనీష్ లోక్ నాథ్ 

సమర్పణ : బాపినీడు బి.  

నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

స్క్రీన్ ప్లే: సుకుమార్ 

దర్శకత్వం : కార్తీక్ దండు

ప్రేమకథలకు పెట్టింది పేరైన సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన ఎవరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని ఎక్స్ పెరిమెంట్ విరూపాక్ష. 

ప్రమాదానికి గురై, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ నుంచి వెరీ కన్విన్సింగ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ విరూపాక్ష. 

భీమ్లానాయక్, బింబిసార, సార్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త మరో సర్ ప్రైజింగ్ రోల్ లో మెరిసిన చిత్రం విరూపాక్ష. 

ఫస్ట్ లుక్ దగ్గర్నుంచీ, టీజర్, ట్రైలర్ వంటి ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టినీ  ఆకర్షించిన విరూపాక్ష మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ మిస్టిక్ థ్రిల్లర్ స్క్రీన్ పై ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగిందో, ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తేల్చేద్దాం.!

విరూపాక్ష స్టోరీ రివ్యూ: 1979లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ జంటను సజీవ దహనం చేసేస్తారు రుద్రవనం గ్రామస్తులు. అగ్నికి ఆహుతి అయిపోతూ సరిగ్గా పుష్కరం తర్వాత ఆ ఊరంతా వల్లకాడుగా మారిపోతుందని హెచ్చరిస్తుంది ఆ ఇల్లాలు. ఇక 1991 లో అసలు కథ ఆరంభం అవుతుంది. అనూహ్య సంఘటనలకు బీజం పడుతుంది. సరిగ్గా అదే సమయంలో స్వగ్రామానికి వెళ్లాలనే తన తల్లి కోరిక మేరకు ఆమెను తీసుకుని రుద్రవనంలోకి అడుగుపెడతాడు సూర్య(సాయి ధరమ్ తేజ్). ఆ ఊరి పెద్ద హరిశ్చంద్రప్రసాద్(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త)ని చూసి ఇష్టపడతాడు. ఒకవైపు వీరిద్దరి ప్రేమకథ - మరోవైపు ఊళ్ళో సంభవిస్తున్న అంతు చిక్కని మరణాలతో సాగుతున్న కథనం శాసన గ్రంథం సూచన మేరకు ఆ గ్రామాన్ని అష్ట దిగ్భందనం చేయడంతో ఊపు అందుకుంటుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ డెత్ సీన్ దగ్గర్నుంచీ HOLD YOUR BREATH అనే ఇంటర్వెల్ బ్లాక్ వరకూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు దర్శకుడు. ఇక ద్వితీయార్ధంలో తాను ప్రేమించిన నందినిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ..  ఆ మరణాలకు కారణాలు వెదుకుతూ వెళ్లిన సూర్యకి ఎటువంటి నిజాలు తెలిశాయి అన్నదే మిగిలిన కథ కాగా పతాక సన్నివేశాలు ఆ కథకి ప్రాణం.! 

విరూపాక్ష స్క్రీన్ ప్లే రివ్యూ:  బేసిక్ గా థ్రిల్లర్స్ కి ట్రీట్ మెంటే ఇంపార్టెంట్. అది కుదిరితే వావ్ అంటారు. లేకుంటే వాకౌట్ అంటారు. విరూపాక్షలో వావ్ ఫ్యాక్టర్ లిమిటెడ్ గానే ఉన్నా వాకౌట్ అనే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు దర్శకుడు. మొదట్లో వచ్చే సూర్య - నందినిల లవ్ ట్రాక్ కొందరికి ల్యాగ్ అనిపించొచ్చు కానీ క్లయిమాక్స్ తో కనెక్టివిటీ ఉంది కనుక తప్పు పట్టలేం. సెకండాఫ్ లో సినిమా గ్రాఫ్ డౌన్ అవుతున్నా కథని కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం కనుక దాన్నీ తప్పనలేం. యూజువల్ గా థ్రిల్లర్స్ లో అసలు రీజన్ ఏంటో రివీల్ అయ్యాక రిలాక్స్ అయిపోతారు ప్రేక్షకులు. అందుకేనేమో మన లెక్కల మాస్టర్ సుక్కు స్లో పేస్ అనే కంప్లైంట్ ని పక్కనెట్టారు.. అసలు మ్యాటర్ ని ఆఖరి సన్నివేశం వరకూ నొక్కిపెట్టారు. ఓవరాల్ గా ఒకింత ప్రెడిక్టబుల్ సబ్జెక్టునే ఓర్పుతో, నేర్పుతో  ఆసక్తికర కథనంగా మలిచారు. ఎస్పీషియల్లీ  డెత్ సీన్స్ డిజైనింగ్ తో సౌండ్ మిక్సింగ్ పోటీ పడడంతో ఆ ఎపిసోడ్స్ అన్నీ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో వచ్చాయి. అలాగే కమర్షియల్ కాలిక్యులేషన్స్ కి పోకుండా క్లైమాక్స్ లో కథకి తగ్గ ముగింపుని ఇవ్వడం ఖచ్చితంగా స్క్రీన్ ప్లే లోని గొప్పదనమే అని చెప్పాలి. 

విరూపాక్ష ఆర్టిస్ట్స్ రివ్యూ: సుక్కు మాట కాదనలేక ఒప్పుకున్నాడో.. కొత్త జోనర్ ట్రై చేద్దామని తనకి తనే చెప్పుకున్నాడో.. ఏదైతేనేం విరూపాక్షకి ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఎందుకంటే అంతటి తీవ్ర ప్రమాదం తరువాత తాను చేసిన ఈ కమ్ బ్యాక్ ఫిల్మ్ లో రెగ్యులర్ పాటలు, డ్యాన్సులు, ఫైట్సు లేకపోవడంతో  సాయి ధరమ్ కు శారీరక శ్రమ తప్పింది. సెటిల్డ్ గా ఉండే సూర్య పాత్రలో ఒదిగిపోయిన సాయి ధరమ్ నటుడిగా తనలో పెరిగిన పరిణతిని చూపించాడు. అలాగే స్కిన్ షో మాత్రమే సక్సెస్ కి కారణం కాదని నిరూపిస్తూ హుందాగా ఉండే పాత్రలతో విజయాలు పొందుతున్న లక్కీ హీరోయిన్ సంయుక్తకి ఈ చిత్రంలోనూ తనకి మరింత గుర్తింపు తెచ్చే మంచి పాత్ర దక్కింది. తను కూడా దొరికిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని అద్భుతంగా అభినయించింది. సునీల్, అజయ్ లు తమ ఆహార్యంతో ఆకట్టుకోగా రాజీవ్ కనకాల, బ్రహ్మాజీలు తమకు అలవాటైన పాత్రలను అవలీలగా చేసేసారు. సాయిచంద్ నటన పాత్రోచితంగా సాగితే కమల్ కామరాజు కొత్త గెటప్ లో కనిపించాడు. ఇతర నటీనటులందరూ కూడా వారి పాత్రల్లో రాణించారు. 

విరూపాక్ష టెక్నీషియన్స్ రివ్యూ: మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ గా రూపొందిన విరూపాక్ష కోసం ఇతర సాంకేతిక నిపుణులు సైతం ప్రాణం పెట్టి పని చేసారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ రుద్రవనంని అద్భుతంగా ఆవిష్కరిస్తే..  ఆర్ట్ డిపార్ట్మెంట్ అందుకు పూర్తిగా సహకరిస్తూ సమర్ధతను చాటుకుంది. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడితే.. సౌండ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ సింక్ తో బెదరగొట్టింది. ఎడిటింగ్ సుకుమార్ సూచనలకు అనుగుణంగా జరిగితే.. డైలాగ్స్ సందర్భోచితంగా సాగాయి. ఇక ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అయినా ఎక్కడా తడబడకుండా చక్కని టేకింగ్ తో మంచి మార్కులు వేయించుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. అతను ఎంచుకున్న స్టోరీ, దానికి తగ్గ విజువలైజేషన్, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ దర్శకుడిగా కార్తీక్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉందనే ఒపీనియన్ కలిగిస్తాయి. సమర్పకుడు బాపినీడు, నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ వైజ్ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అవుట్ ఫుట్ అందించారు.

విరూపాక్ష ప్లస్ పాయింట్స్: 

  • స్టోరీ, స్క్రీన్ ప్లే 
  • సాయి ధరమ్ తేజ్ - సంయుక్త 
  • ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ 
  • BGM అండ్ సౌండ్ డిజైనింగ్   
  • సినిమాటోగ్రఫీ 

విరూపాక్ష మైనస్ పాయింట్స్:

  • లాగ్ ఇన్ లవ్ ట్రాక్
  • స్లో పేస్ నేరేషన్ 
  • ఓవర్ డీటైలింగ్ 

విరూపాక్ష ఎనాలసిస్: థ్రిల్లర్ జోనర్ అనగానే ఓ ఇంటికో, ఓ పర్టిక్యులర్ ప్రాంతానికో పరిమితం కావడం.. మర్డర్సు, సస్పెన్సు, ఇన్వెస్టిగేషను ఇవన్నీ కామనే. వాటన్నిటికీ రీజన్ అంటూ ఫైనల్ గా దైవమో, దెయ్యమో లేక ఓ మానవ మృగమో రివీల్ అవ్వడం కూడా సహజమే. అయితే మ్యాటర్ ఏదైనా ఎంత అరెస్టింగ్ నేరేషన్ ఉందనేదే ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. అలా చూసుకుంటే మూఢ నమ్మకాలతో నిండిన కథే అయినా మూడ్ డిస్టర్బ్ చేయని కథనంతో రూపొందిన విరూపాక్ష ఆడియన్ ని ఖచ్చితంగా శాటిస్ ఫై చేసి పంపిస్తుంది. ముఖ్యంగా సాయి ధరమ్ - సంయుక్తా మీనన్ నటన సగటు ప్రేక్షకుడిని మురిపిస్తుంది.!

పంచ్ లైన్: విరూపాక్ష- విషయం ఉందండోయ్.!

సినీజోష్ రేటింగ్: 2.75/5

 

Cinejosh Review: Virupaksha:

Virupaksha telugu review

Tags:   VIRUPAKSHA REVIEW
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement